నవతెలంగాణ-హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్.ధనంజయులు, గౌరవ అతిథిగా ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫిసర్ పి.కిషోర్ బాబు హాజరయ్యారు. ఇందులో వివిధ విభాగాలకు చెందిన ప్రధాన అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు సిబ్బంది, ఎస్సీ, ఎస్టీ, ఓ.బీ.సీ సంఘాలతోపాటు గుర్తింపు పొందిన కార్మిక సంఘాల నుంచి సీనియర్ నాయకులు వచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్.ధనంజ యలు మాట్లాడుతూ భారతీయులను విద్యా, సామాజిక సంస్కరణల ద్వారా వారిలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడం, ప్రేరేపించడం బాబాసాహెచ్ గొప్పతనమన్నారు. భారతీయులంతా కులం, మతం, ప్రాంతాలకు అతీతం గా అంబేద్కర్ గొప్ప వారసత్వానికి వారసులని అన్నారు. సభను ఉద్దేశించి పి.కిషోర్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి దఢత్వానికి, ప్రతిభకు, అచంచలమైన అంకిత భావానికి గొప్ప నిదర్శనమన్నారు. భారత రాజ్యాంగం ప్రధాన రూపశిల్పిగా, భారత పౌరులందరికీ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కల్పించారని చెప్పారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన అవిశ్రాంతమైన కషి తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గుర్తు చేశారు.