సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని పసర గ్రామం సుందరయ్య నగర్ లో ఆదివారం అంబేద్కర్ 134 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి పూలమాలవేసి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆ రోజుల్లో చదువుల విషయంలో ఎంతో కష్టపడి చదివి విదేశాల్లో లా బారిష్టర్ చదివి రాజ్యాంగ నిర్మాతగా దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారని అన్నారు. మొదట న్యాయ మంత్రిగా పనిచేస్తూ న్యాయం చేయలేనప్పుడు మంత్రి పదవి అవసరం లేదని మంత్రి పదవిని తృణప్రాయంగా స్వీకరించి రాజీనామా చేసి వెనుకబడిన వర్గాలు తరగతుల కోసం ఎంతో కృషిచేసిన కోవిదుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను వారసులు కొనసాగించడం మన ముందున్న లక్ష్యం అని అదే మనం అంబేద్కర్ కు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. అనంతరం మురళి ఆధ్వర్యంలో పిల్లలకు పెద్దలకు అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు పొదిల్ల చిట్టిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అంబాల మురళి, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేష్, నాయకులు జిట్టబోయిన రమేష్, కొమ్ము రాజు శ్రీ రామోజు సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.