– సీఎం రేవంత్‌రెడ్డికి మేధావులు, విద్యావంతుల లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ (బీఆర్‌ఏఓయూ) ప్రాంగణంలో పదెకరాల స్థలాన్ని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)కు కేటాయించడాన్ని విరమించుకోవాలని మేధావులు, విద్యావంతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శనివారం తెలంగాణ మేధావులు, విద్యావంతులు 61 మంది లేఖ రాశారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు, దాని ఆవశ్యకత, పేదలు, మహిళలు, బడుగు బలహీన వర్గాలకు ఈ విశ్వవిద్యాలయం ఏ విధంగా ఉపయోగపడుతున్నదో, సేవలు అందిస్తున్నదో వివరించారు. ఉన్నత విద్యా వ్యాప్తికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని సీఎం దృష్టికి తెచ్చారు. లేఖ రాసిన వారిలో మాజీ వీసీలు విఎస్ ప్రసాద్, కె సీతారామారావు, రాంచంద్రం, వాయునందన్, వి వెంకయ్య, టీజీపీఎస్సీ మాజీ చైర్మెన్ ఘంటా చక్రపాణి, ఎమ్మెల్సీ కోదండరాం, హరగోపాల్, కె నాగేశ్వర్, దొంతి నరసింహారెడ్డి, పద్మజాషాలతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ , హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, తెలుగు యూనివర్సిటీ, సీఫెల్ , కాకతీయ, మౌలానా ఉర్దూ యూనివర్సిటీలతోపాటు పలు విద్యాసంస్థల ప్రొఫెసర్లు ఉన్నారు. ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలనీ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయని పేర్కొన్నారు.