సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్‌

సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్‌– హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సమసమాజ స్థాపన కోసం చేసిన కృషి మరువలేనిదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే అన్నారు. అణగారిన వర్గాలకు రిజర్వేషన్లను కల్పించి సమసమాజ స్థాపనకు కృషి చేశారని కొనియాడారు. హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్‌ అనుసరించిన మార్గం నేటికీ ఆదర్శనీయంగా ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సామ్‌ కోషి అన్నారు. ప్రపంచంలో పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నప్పుడు అంబేద్కర్‌ ఏర్పాటు చేసిన ఆర్‌బీఐ, ఫైనాన్స్‌ కమిషన్‌ లాంటివి మార్గదర్శకమయ్యాయన్నారు.
జస్టిస్‌ గిరిజా ప్రియదర్శిని, జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన ప్రసంగించారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ ఏ.నరసింహారెడ్డి, హెచ్‌సీఏఏ అధ్యక్షులు అయ్యాడపు రవీందర్‌రెడ్డి, ఏఎస్‌జీ నరసింహ శర్మ, డీఎస్‌జీ గాడి ప్రవీణ్‌కుమార్‌, పీపీ నాగేశ్వర్‌రావు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షులు సునీల్‌గౌడ్‌, మాజీ ఏజీ బీఎస్‌ ప్రసాద్‌, హెచ్‌సీఏఏ ఉపాధ్యక్షురాలు ఏ.దీప్తి, కార్యదర్శులు ఉప్పల శాంతిభూషణ్‌రావు, సంజీవ్‌ జిల్లెల, జాయింట్‌ సెక్రటరీ వాసిరెడ్డి నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.