అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి

నవతెలంగాణ హలియా 

అనుముల మండలంలోని నాయుడుపాలెం గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ ఉద్యోగుల సమాఖ్య, మాదిగ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం నాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 67 లో వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జునసాగర్ నియోజకవర్గ మాదిగ ఉద్యోగుల సమాఖ్య గౌరవ అధ్యక్షులు మందా సైదులు రావు గౌతమ్ మాట్లాడుతూ దేశంలో తాడిత పీడిత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగం లో ప్రత్యేక హక్కులను కలిపించి, అట్టడుగు వర్గాల చైతన్యానికి, అన్ని రంగాల్లో వారి అభివృద్ధి కోసం, అట్టడుగు వర్గాల్లో ఆత్మగౌరవం పెంపొందించేందుకు తన జీవితాంతం అలుపెరుగని కృషి చేసిన గొప్ప మానవతావాది, మహోన్నతుడు అని అన్నారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకై యువత కృషి చేయాలని ఆయన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అట్టడుగు వర్గాలు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో విశ్రాంత ఏ.ఎస్.ఐ, యడవెల్లి సోమశంకర్, మాజీ ఎం పి టి సి. రమావత్ సర్దార్ నాయక్, మాజీ వార్డు సభ్యులు యడవెల్లి రమేష్, మందా లక్ష్మీ, యడవెల్లి సునీత, బాణావత్ నర్సింగ్, మందా జయంత్ రామ్, యడవెల్లి సోమమ్మ, చనగళ్ల చిన మారమ్మ, మందా వెంకటమ్మ, దరావత్ చరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.