ఇజ్రాయిల్ లో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

– అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, కొవ్వొత్తిలతో నివాళి 
 నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇజ్రాయిల్లో  అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆఫ్ ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, కొవ్వొత్తిలు వెలిగించి యూత్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఇజ్రాయిల్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు, వేల్పూర్ మండలం వెంకటాపూర్ కు చెందిన  నీరడి ప్రేమానందు మాట్లాడుతూ ఇజ్రాయిల్ లో ఉన్న అంబేద్కర్ వాదులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
తరతరాలుగా ఊరికి దూరంగా, అంటరాని బానిస బతుకులు బ్రతికిన జాతులకు వెలుగులు పంచి  బడుగు బలహీన, ఆదివాసీ వర్గ ప్రజలకు  హక్కులు కల్పించి, ఆధిపత్య శక్తులతో చివరి శ్వాస వరకు పోరాడి అందరివాడిగా చరిత పుటల్లో చిరస్థాయిగా అంబేద్కర్ నిలిచారని కొనియాడారు. సాటి మనుషుల పట్ల హీనమైన రీతిలో సాగించిన దుర్మార్గ దురాచారాలను మంటల్లో తగలేసి భారత రాజ్యాంగం ద్వారా సమానత్వం ప్రసాదించిన ఆ మహనీయుని స్ఫూర్తితో కుల, మత భేదాలు లేని సమ సమాజం కోసం అందరం కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆఫ్ ఇజ్రాయిల్ సభ్యులు రతీష్, ఈర్గల సుమన్ కుమార్, ధీరజ్, జూల విజయ్, దయాలింగం, పోతె రాకేష్, జయ సూర్య, రాము, ప్రశాంత్, సన్నీ, సవీన్, మహీపాల్, జైపాల్, ముత్తు, తదితరులు పాల్గొన్నారు.