అంబేద్కర్‌, హిందూ మితవాదం, భారత జాతీయ కాంగ్రెస్‌

Ambedkar's Hindu moderate Indian National Congressఇటీవలే పార్లమెంటులో జరిగిన (డిసెంబర్‌ 2024) చర్చల్లో హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఒకవైపు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను అవమా నిస్తూ, మరోవైపు భారత జాతీయ కాంగ్రెస్‌ అంబేద్కర్‌తో చాలా ఘోరంగా ప్రవర్తించి0దని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రసంగం చేశాడు.”అంబేద్కర్‌ పేరును ఉచ్ఛరించడం ఒక ఫ్యాషన్‌ అయిపోయిందన్న” అమిత్‌ షా వ్యాఖ్యలను నిరసిస్తూ, తన పదవికి రాజీనామా చేసి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ దేశ వ్యాప్తంగా ప్రజలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రతిచర్యలు షా రాజకీయ ప్రతిష్టను ఖచ్చితంగా తగ్గిస్తాయి. అంతేకాక తన పార్టీ అంబేద్కర్‌కు ఎలా న్యాయం చేస్తూ వచ్చిందో చెపుతూ తన పార్టీని స్వయంగా అభినందించాడు. దానిలో భాగమే విగ్రహాల నిర్మాణం తొలి అడుగు అని అన్నాడు. దీన్ని అంబేద్కర్‌ ప్రశంసించి ఉండేవాడా?
బాబాసాహెబ్‌ పుట్టినరోజును ‘సామాజిక సామరస్య దినోత్సవంగా’ జరుపుకోవడం మొదలుపెట్టడాన్ని అమిత్‌ షా గొప్పతనంగా చెప్పుకున్నాడు. కానీ బాబాసాహెబ్‌ కన్న కలలకు ఇది పూర్తిగా విరుద్ధమైనది. ఆయన కుల నిర్మూలన గురించి మాట్లాడినాడు. కుల రహిత సమాజంపై అంబేద్కర్‌ దార్శనికతను, ఆయన కలల్ని తిరస్కరించే విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు లేదా ఆరెస్సెస్‌-బీజేపీ లు సామాజిక సామరస్య దినోత్సవాన్ని ప్రారంభించడం ద్వారా తమ ఎజెండాను ముందుకు తీసుకొనిపోతున్నాయి. వివిధ కులాల మధ్య సామ రస్యతతో కుల వ్యవస్థను శాశ్వతంగా కొనసాగించడాన్ని సామాజిక సామరస్య దినం సూచిస్తుంది.
లోతైన తాత్వికస్థాయిలో బీజేపీ కూడా, హిందూ సమాజం ప్రపంచ ఆదియుగం నుండి, బ్రాహ్మణులు నోటి నుండి, క్షత్రియులు భుజాల నుండి, వైశ్యులు తొడల నుండి, శూద్రులు పాదాల నుండి సష్టించబడ్డారని ప్రకటించే దీన దయాళ్‌ ఉపాధ్యాయ యొక్క ‘సమగ్ర మానవ వాదాన్ని’ సమర్థిస్తుంది.వారి భావజాలం ప్రకారం ఈ విభజన, సమాజానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒకవేళ ఆరెస్సెస్‌ – బీజేపీలు నిజంగా అంబేద్కర్‌కు న్యాయం చేసి ఉండి ఉంటే, వారు దళితులు, బీసీలు, షెడ్యూల్డ్‌ తెగల వారికి రిజర్వేషన్లను నీరుగార్చే విధంగా సమాజంలో ఆర్థికంగా బలహీన పడిన వర్గాలకు రిజర్వేషన్‌లు ప్రవేశపెట్టి ఉండెడివారు కాదు. దళితులకు వ్యతిరేకంగా దుర్మార్గాలు,దౌర్జన్యాలను తగ్గించి,ఆ విధంగా మహిళలపై హింస కూడా తగ్గించే విధంగా వారు భరోసా ఇచ్చి ఉండెడివారు.
కాంగ్రెస్‌ పార్టీ అంబేద్కర్‌ను విస్మరించింది, ఆయనకు న్యాయం చేయలేదనే అమిత్‌ షా వాదనను లోతుగానే పరిశీలించాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్‌ చేసిన కషికి హిందూ జాతీయవాద శక్తులు సహకారాన్ని అందించలేదు, సహాయం చెయ్యలేదు. జాతీయ నాయకత్వం అంటరానితనం, కుల సమస్యను ముఖ్యంగా 1930 దశాబ్దాల నుంచి చాలా తీవ్రంగా తీసుకుంది.
1932 నుండి గాంధీ అంటరానితనం, కుల వ్యవస్థల నిర్మూలన సమస్యను తీసుకొని రెండేండ్ల పాటు ఆ సమస్య పై చాలా తీవ్రంగా కేంద్రీకరించి పని చేశాడు. కులాంతర వివాహం చేసుకోని ఏ పెళ్ళి జంటకు ఆశీర్వాదం ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాడు. సబర్మతీ ఆశ్రమంలో ఒక దళిత కుటుంబానికి ఆశ్రయం కల్పించాడు. ఆ కారణంగా ఆశ్రమానికి దాతలు నిధులు ఇవ్వకుండా నిలుపుదల చేశారు, దళిత కుటుంబానికి ఆశ్రయం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలతో ఆశ్రమం మూతపడింది. ఆయన లోక్‌ సభకు ఎన్నిక కావడాన్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించినప్పటికీ, ఆ ఎన్నికల రణరంగంలో బాబాసాహెబ్‌ను వ్యతిరేకించిన వారిలో హిందూ మహాసభ కూడా భాగస్వామిగా ఉంది.ఆ తర్వాత ఆయన రాజ్యసభకు నియమితులయ్యారు.ఆ తరువాత మధ్యంతర ప్రభుత్వంలో అంబేద్కర్‌ భాగస్వామి కావాలని పట్టుపట్టింది కూడా గాంధీజీనే.అదే విధంగా గాంధీజీ సలహా మేరకు భారత రాజ్యాంగ రచనా కమిటీకి అంబేద్కర్‌ను అధ్యక్షుడ్ని చేశారు. అంబేద్కర్‌ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని, ఆర్టికల్‌ 370ను వ్యతిరేకించాడనీ, ఆ కారణంగానే ఆయన కేబినెట్‌ మంత్రి పదవికి రాజీనామా చేశాడని అమిత్‌ షా ప్రచారం కూడా చేశాడు. ప్రజాస్వామిక నిబంధనల ప్రకారం పని చేసిన మంత్రివర్గంలో ఆయన ఉన్నాడు. కాశ్మీర్‌ విషయంలో, ఆయన జోనల్‌ ప్రజల అభిప్రాయాలను కోరుకున్నాడు. స్థానిక జాతుల వైవిధ్యాలకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో కాశ్మీర్‌ లోయ, జమ్మూ ,లడాఖ్‌ లు వేరువేరుగా ఉండాలని కోరుకున్నారు. ఈ కారణాలతోనే అంబేద్కర్‌ మంత్రి పదవికి రాజీనామా చేశాడనే అమిత్‌ షా అభిప్రాయాలు పూర్తిగా తప్పు.
అంబేద్కర్‌ మంత్రి పదవికి రాజీనామా చేయడానికి అసలు కారణం పార్లమెంటులో హిందూ కోడ్‌ బిల్లు అసలు రూపంలో ఆమోదం పొందడంలో వైఫల్యం చెందడమే.హిందూ కోడ్‌ బిల్లు ముసాయిదాను తయారు చేయాలని అంబేద్కర్‌ను జవహర్‌ లాల్‌ నెహ్రూనే కోరాడు.ఆ ముసాయిదాను తయారుచేసే క్రమంలోనే అంబేద్కర్‌ మహిళల సమానత్వాన్ని ముందుకు తెచ్చి పెట్టాడు.ఈ బిల్లు నేపథ్యం ఏమంటే, వివిధ మతాలకు చెందిన వారి వ్యక్తిగత చట్టాలకు దిశా నిర్దేశం చేసే వివిధ కోడ్‌లు ఉన్నాయి. వివాహం, విడాకులు, వారసత్వం, పిల్లల సంరక్షణల విషయంలో వ్యక్తిగత చట్టాలు వర్తిస్తాయి. హిందూ కోడ్‌ బిల్లు బహిర్గతం కావడంతో దానికి వ్యతిరేకంగా గావు కేకలు మొదలయ్యాయి. ఇది, సనాతన ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నమని ఆర్‌ఎస్‌ఎస్‌, దాని పరివారం ప్రచారం చేశాయి. పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించి, డిసెంబర్‌ 12, 1949న ఆరెస్సెస్‌ అనుచరులు అంబేద్కర్‌, నెహ్రూల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు నిర్వహించి, హిందూ కోడ్‌ బిల్లు, అంబేద్కర్‌లకు వ్యతిరేకంగా ఒక సామాజిక వాతావరణాన్ని సష్టించారు. కాంగ్రెస్‌లో ఆంతరంగికంగా చాలామంది హిందూ కోడ్‌ బిల్లును వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. ఆ విధంగా హిందూ కోడ్‌ బిల్లు ఆమోదం పొందలేదు,ఆ కారణంగా తీవ్ర మనోవేదనకు గురైన అంబేద్కర్‌ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన రాజీనామాను కాంగ్రెస్‌ పార్టీకి ఆపాదిస్తూ ఆయన్ను అవమానించడం, విస్మరించడం అంటే వాస్తవాన్ని వక్రీకరించడమే. అయితే, భారత రాజకీయాల్లో అంబేద్కర్‌, ఆరెస్సెస్‌ పరివారంల భావజాలం పరస్పర వ్యతిరేక ధ్రువాలుగా ఉన్నాయి.
గడిచిన మూడు దశాబ్దాలకు మించిన కాలం నుంచి ఆరెస్సెస్‌ – బీజేపీలు ఎన్నికల కారణాలతో దళితులు, ఆదివాసీలను గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి మద్దతును సాధించడం కోసం వారు కొన్ని చర్యలు చేపట్టారు. కుల బానిసత్వం నుండి వారిని విముక్తి చేయడంలో రాజ్యాంగం పాత్రను చూస్తున్నారు కాబట్టి దళితుల్లో అధికులు రాజ్యాంగానికి అనుబంధంగా ఉన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో దళితులు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడానికి ఉన్న కారణాలలో ఇదొక ప్రధాన కారణం. అంబేద్కర్‌ అందించిన మరొక పెద్ద సహకారం, భారత రాజ్యాంగ రూపకల్పన. దీన్ని కూడా బీజేపీ మాతసంస్థ ఆరెస్సెస్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ”భారత కొత్త రాజ్యాంగం గురించిన దారుణమైన విషయం ఏమంటే, దానిలో ఎలాంటి భారతీయత లేదు. దానిలో ప్రాచీన భారతీయ రాజ్యాంగ చట్టాలు, సంస్థలు, పేర్లు, పదాల ఊసే లేదు” అని ఆరెస్సెస్‌ అనుబంధ పత్రిక ఆర్గనైజర్‌లో నవంబర్‌ 30, 1949న ప్రచురితమైన వ్యాసంలో పేర్కొంది. అదే విధంగా హిందూత్వ రాజకీయాల భావజాలానికి పితామహుడు అయిన సావర్కర్‌ కూడా, భారత రాజ్యాంగం లో ”భారతీయత అనేది లేదు” అని పేర్కొన్నాడు.
అంబేద్కర్‌ అందించిన రెండు ప్రధాన సేవల్ని వ్యతిరేకించడంలో బలమైన స్థానాలను కలిగి ఉన్న అమిత్‌ షా, అంబేద్కర్‌ కు తగిన గౌరవాన్ని ఇచ్చింది బీజేపీ మాత్రమే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వారి చర్యలన్నీ ప్రతీకాత్మకమైనవి, అవి వాస్తవమైనవి కాదు. పాకిస్థాన్‌ ఏర్పాటు ”మనకొక విషాదం”, అది స్థూల విషాదానికి, ముఖ్యంగా దళితుల బానిసత్వానికి మార్గాన్ని తెరిచే హిందూ మత రాజ్యానికి మార్గాన్ని సుగమం చేస్తుందని అంబేద్కర్‌ తన సవరించిన రచన ”థాట్స్‌ ఆన్‌ పాకిస్థాన్‌”లో పేర్కొంటాడు. అమిత్‌ షా ప్రధాన ఎజెండా హిందూమత రాజ్య స్థాపన, అంటే బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ప్రధాన విలువలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, సామాజిక న్యాయం లాంటి లక్ష్యాలకు పూర్తిగా వ్యతిరేకమైన ఎజెండా.
(”న్యూస్‌ క్లిక్‌” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌,9848412451
రామ్‌ పునియానీ