– దేశంలో వ్యవసాయ సంక్షోభం,నిరుద్యోగానికి పరిష్కారాలు
– ఆయన విధానాలను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు : మేధావులు, సామాజికవేత్తల ఆందోళన
న్యూఢిల్లీ : మోడీ పాలనలో అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలు దేశంలోని ప్రతి రంగాన్నీ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ రంగాలపై ఆధారపడేవారి జీవనోపాధిని దెబ్బ తీసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇది దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లేందుకు కారణమైందని నిపుణులు, మేధావులు అంటున్నారు. ఇలా ప్రతికూలంగా ప్రభావితమై రంగాల్లో వ్యవసాయమూ ఉన్నది. మోడీ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి నిరుద్యోగులుగా మారిన, మారుతున్న యువత కూడా కష్టాలపాలవుతున్నది. దేశంలో వ్యవసాయం సంక్షోభానికి, నిరుద్యోగ సమస్యకు మోడీ సర్కారు, అది అవలంభించిన విధానాలే కారణమని విశ్లేషకులు అంటున్నారు.
దేశంలో లక్షలాది మంది రైతులు మోడీ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వారు నిరసిస్తున్నారు. పంటలకు కనీస ధర హామీని అన్నదాతలు వినిపించే ప్రధాన డిమాండ్లలో ఒకటి. కానీ, మోడీ సర్కారు మాత్రం రైతన్నల మాట వినటం లేదని మేధావులు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఇక ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన మోడీపై నిరుద్యోగ యువత చాలా ఆగ్రహంతో ఉన్నది. మరో మూడ్రోజుల్లో దేశంలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో అన్నదాత, యువత నుంచి బీజేపీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తాకనున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే, ఇలాంటి సమస్యలకు అంబేద్కర్ దార్శనికతే అసలైన పరిష్కార మార్గాలను చూపిస్తుందని నిపుణులు, మేధావులు అంటున్నారు. ఆర్థికవేత్తగా అంబేద్కర్ దృక్పథం చాలా విలువైనదనీ, పరిష్కార మార్గాలను కోరుకునేవారెవరైనా దీనిపై అధ్యయనం చేయాలని వారు సూచిస్తున్నారు. అయితే, సంఫ్‌ు భావజాలంతో పని చేసే బీజేపీ నుంచి అది ఆశించటం అత్యాశే అవుతుందని చెప్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చబోమని మోడీ హామీలు ఇస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ వీలైనన్ని ఎక్కువ సీట్లతో కేంద్రంలో అధికారంలో ఉంటే వివాదాస్పద సవరణలు, చట్టాలు, నిర్ణయాలు తప్పక ఉంటాయని దేశ ప్రజలను మేధావులు హెచ్చరిస్తున్నారు. 1918 నాటికి జర్నల్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో అంబేద్కర్ భారత్‌లోని చెల్లాచెదురుగా ఉన్న, చిన్న పొలాలలో పనిలేకుండా ఉన్న కార్మికుల సమస్యపై సున్నితంగా ప్రస్తావించారనీ, కార్మిక ఆధారిత పారిశ్రామికీకరణను ప్రతిపాదించారని గుర్తు చేస్తున్నారు. దీని ద్వారా భారతదేశ వ్యవసాయ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుందని చెప్తున్నారు. కార్మిక ఆధారిత పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా.. వ్యవసాయ కార్మికులను ఆర్థికంగా పరిపుష్టం చేస్తుందని మేధావులు చెప్తున్నారు. ఈ వాదన 1954లో నోబెల్ ప్రైజ్-గెలుచుకున్న ఆర్థికవేత్త ఆర్థర్ లూయిస్ అభివృద్ధి చేసిన ద్వంద్వ రంగ నమూనాను పోలి ఉంటుందని అంటున్నారు. ఇటు నిరుద్యోగం అంశం విషయంలోనూ ఆయన ప్రతిపాదించిన ఉద్యోగాల-కేంద్రీకృత జాతీయ పారిశ్రామిక విధానం భారత్‌లో నిర్లక్ష్యం చేయబడిందని మేధావులు గుర్తు చేస్తున్నారు. యూఎస్, బ్రెజిల్ వంటి ఇతర దేశాల్లోని నగరాల్లో మాత్రం అంబేద్కర్ విధానం కనిపిస్తున్నదని అంటున్నారు.
సామాజిక నిబంధనలు, ఆర్థిక నిర్మాణాలు శ్రమను వెలికితీయటం, వనరుల పంపిణీని ఎలా నిర్దేశిస్తాయనే దానిపై అంబేద్కర్‌కు లోతైన అవగాహన ఉన్నది. కుల వ్యవస్థ అనేది ”కార్మికుల విభజన” అని, కేవలం శ్రమ విభజన మాత్రమే కాదని కుల నిర్మూలనలో అంబేద్కర్ వాదనను నిపుణులు గుర్తు చేస్తున్నారు. పరిశ్రమ, వ్యవసాయం కోసం అంబేద్కర్ విధానాలు కార్మిక హక్కుల హక్కులను పరిరక్షిస్తాయని అంటున్నారు. ఆయన 1942-46 నుంచి బ్రిటిష్ వైస్రారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో కార్మిక సభ్యునిగా పరిశ్రమ, వ్యవసాయం రెండింటిలోనూ కనీస వేతనం, తగ్గిన పని గంటలు, ప్రసూతి ప్రయోజనాలు, కార్మికుల పరిహారం, సామాజిక భద్రతా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులను పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ”ప్రభుత్వ నియంత్రణలో సామూహిక పొలాల రూపంలో సాగు చేయబడిన భూమితో వ్యవసాయాన్ని రాష్ట్ర పరిశ్రమగా అంబేద్కర్ ఊహించారు. అణగారిన కులాలు, మహిళల స్థితిగతులను మెరుగుపరచటానికి ఆయన జీవితకాల నిబద్ధతను పరిగణనలోకి తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా, ఇది సాధించదగినది” అని మేధావులు, సామాజికవేత్తలు అంటున్నారు. కేరళలో మహిళల నేతృత్వంలోని కుటుంబశ్రీ వ్యవసాయ సముదాయాల విజయంలో అది స్పష్టమైందని చెప్తున్నారు. అణగారిన మహిళలకు భూమి, క్రెడిట్‌ను గుర్తించటం, సులభతరం చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం చురుకైన పాత్ర పోషించిందని పరిశోధనలు చెప్తున్నాయని అంటున్నారు. అట్టడుగు వర్గాలకు ఎక్కువ యాజమాన్యం, వనరుల నియంత్రణ కోసం అంబేద్కర్ వాదించారని చెప్తున్నారు.
”మన సామాజిక, ఆర్థిక జీవితంలో సమానత్వాన్ని ఎంతకాలం నిరాకరిస్తాము? మనం దానిని చాలా కాలం పాటు నిరాకరిస్తే.. మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేయటం ద్వారానే మనం అలా చేస్తాం” అని అంబేద్కర్ రాజ్యాంగ అసెంబ్లీలో చేసిన ప్రసిద్ధ ప్రసంగాన్ని రాజకీయ విశ్లేషకులు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గుర్తు చేసుకుంటున్నారు. భారత్ ప్రస్తుతం ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ.. దేశ రైతులలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. క్షీణించిన నేల, నీటి కొరత, అనిశ్చిత వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవటంలో పోరాడుతూ.. దాదాపు సగం వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ ఆలోచనలను ఆది నుంచీ ప్రభుత్వాలు ఆదరించలేదనీ, ఒకవేళ ఆయన ఆశయాలనే పాటించి ఉంటే.. భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు చక్కటి పరిష్కారం దొరికేదని సామాజికవేత్తలు, మేధావులు సూచిస్తున్నారు.