– 20 కిలోమీటర్లు మృతదేహాన్ని జెడ్డికి కట్టి మోసిన బంధువులు
– ఆధునిక యుగంలో ఆదివాసీల హృదయ విదారక ఘటన
నవతెలంగాణ- చర్ల
జాబిల్లిపై జాగ కోసం పరుగులు తీసే ఆధునిక యుగంలో ఆదివాసీ బిడ్డలకు జెడ్డినే అంబులెన్స్ అయినా హృదయ విదారక ఘటన సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కిష్టారం పంచాయతీకి చెందిన అర్లపెంట గ్రామ ఆదివాసీ రవ్వ దేవా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో దేవాను భద్రాచలం ఏరియా వైద్యశాలలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం భద్రాచలంలోనే ఓ ప్రయివేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఎన్ని రోజులు వైద్యం చేపించిన రోగం తగ్గకపోవడం, ఖర్చులు పెరగడంతో కుటుంబం ఆ ప్రైవేట్ వైద్యశాల నుండి డిశ్చార్జ్ చేయించుకుంది. రోగిని తీసుకొని పాలచల్మ పంచాయతీకి చెందిన వారు స్థానిక చికిత్స కోసం పారా ఇటాన్‌పాడ్ బైగాకు చేరుకున్నారు. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత దేవా మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామం అర్లపెంటకు తీసుకొని వెళ్ళుట కోసం సరైన రవాణా వ్యవస్థ లేక జెడ్డి కట్టుకొని తీసుకెళ్ళేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాల కారణంగా నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కుటుంబ సమేతంగా 20 కిలోమీటర్లు కాలినడకన తీగన్‌పల్లి నుంచి కల్వర్టు దాటి స్వగ్రామమైన అర్లపెంటకు చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు. ఆధునిక కాలంలో కూడా ఆదివాసీల అవస్థలు అంతా ఇంత కాదని చెప్పవచ్చు.