ఇంధనం లేక..గమ్యం చేరలేక..! కదల్లేకపోతున్న అంబులెన్సులు

No fuel..Can't reach the destination..!
Ambulances that cannot move– ఐటీడీఏ పరిధిలో నెలల తరబడి పెండింగ్‌లో డీజిల్‌ బిల్లులు
– నిధుల భారంతో అవస్థలు పడుతున్న వైద్యులు
– పీహెచ్‌సీకి వెళ్లలేక నడిరోడ్డుపైనే మహిళ ప్రసవం
ఎవరికి ఆపదొచ్చినా నేనున్నానంటూ కురు.. కురుమంటూ పరుగెత్తుకొచ్చే అంబులెన్సులకే పెద్ద ఆపద వచ్చింది. ఇంధనం లేకపోవడంతో ఉన్నచోట నుంచి చక్రాలు కదల్లేని పరిస్థితి దాపురించింది. కురు..కురు చప్పుడు తగ్గింది. ప్రభుత్వం డీజిల్‌ డబ్బులు సకాలంలో విడుదల చేయని కారణంగా పేదలకు వైద్య సేవలందించాల్సిన అంబులెన్సులు షెడ్డుకే పరిమితవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా అత్యవసరంలో ఆస్పత్రులకు వెళ్లాల్సిన గర్భిణీలు అవస్థలు పడుతున్నారు. తాజాగా నిర్మల్‌ జిల్లా పెంబీ మండలంలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తులసీపేటకు చెందిన మహిళకు గురువారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108కు ఫోన్‌ చేశారు. డీజిల్‌ అయిపోవడంతో అంబులెన్సు మార్గమధ్యలోనే నిలిచిపోయింది. ఫలితంగా గర్భిణి నడిరోడ్డుపైనే ప్రసవించింది. ఐటీడీఏ పరిధిలోని అన్ని అంబులెన్సులు డీజిల్‌ సమస్య ఎదుర్కొంటున్నాయి.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గిరిజనులు, పేదలకు అత్యవసర వైద్య సేవల కోసం ప్రభుత్వం అంబులెన్సులను ప్రవేశపెట్టింది. అవ్వాల్‌, 102, 108 వాహనాలను వివిధ మండలాలకు కేటాయించింది. ఆయా మండలాల పరిధిలోని ఎవరికి సమస్య వచ్చినా ఈ వాహనాలు సకాలంలో వెళ్లి వైద్య సేవల కోసం ఆస్పత్రికి తీసుకొస్తుంటాయి. కానీ కొన్ని నెలలుగా ఇంధనం సమస్య ఉండటంతో సకాలంలో గమ్య స్థానాలకు చేరలేకపోతున్నాయి. నిర్మల్‌ జిల్లా పెంబీ మండలం తులసీపేటకు చెందిన మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రాత్రి 8గంటల సమయంలో 108కు ఫోన్‌ చేశారు. ఎడ్లబండి సాయంతో సదరు మహిళను వాగు దాటించారు. రోడ్డుపై అంబులెన్సు కోసం ఎదురుచూశారు. మార్గమధ్యలో డీజిల్‌ అయిపోవడం తో అంబులెన్స్‌ ఆగిపోయింది. ఆ వెంటనే సంబంధిత వైద్యుడికి ఫోన్‌ చేయగా.. ఆయన డీజిల్‌ కోసం డబ్బులు పంపించడం.. అక్కడ్నుంచి పెట్రోల్‌ బంకుకు వెళ్లి పోయించడం జరిగినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో 10.30గంటల సమయంలో నడిరోడ్డుపైనే మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వచ్చిన అంబులెన్స్‌ ద్వారా ఆమెను పెంబీ పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ఖానాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల కిందట నార్నూర్‌ మండలం నాగల్‌కొండకు చెందిన గర్భిణికి కూడా ఇదే సమస్య ఎదురైంది. స్థానిక ఆశా కార్య కర్త సొంత డబ్బులతో అంబులెన్సులో డీజిల్‌ పోయించి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.
నెలల తరబడి పెండింగ్‌లో బిల్లులు..!
ఐటీడీఏ పరిధిలోని అంబులెన్సులకు డీజిల్‌ ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. పెంబీ మండలంలో రెండు నెలల బిల్లులు రూ.19,500 వరకు రావాల్సి ఉందని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఈ సమస్య ఒక్క పెంబీ మండలానికే కాకుండా ఐటీడీఏ పరిధిలోని అన్ని మండలాలు ఎదుర్కొంటున్నాయి. బిల్లులు రాకపోవడం తో సంబంధిత పీహెచ్‌సీ వైద్యులకే డీజిల్‌ పోయించే బాధ్యత అప్పగించారు. అప్పట్నుంచి వైద్యులు ముందుగా అంబులెన్సులో డీజిల్‌ పోయిస్తే ప్రభుత్వం నుంచి బిల్లులు వచ్చిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, రెండు నెలలు మాత్రమే కాకుండా ఒక్కోసారి సుమారు ఆరు నెలలపాటు బిల్లులు రాకపోవడంతో వైద్యులు సైతం ఆర్థికభారం తో ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్‌ లేని కారణంగా అంబులెన్సులు బాధితు లను ఆస్పత్రులకు చేర్చలేకపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో సమస్య ఉన్న బాధితులే సొంత డబ్బులతో డీజిల్‌ పోయిస్తామని చెప్పి అంబులెన్సులను పిలిపిస్తునట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితి చాలా మండలాల్లో ఉందని పలువురు చెబుతున్నారు. రోడ్లు బాగా లేకపోవడం కూడా అంబులెన్సులు గమ్య స్థానానికి చేరుకోలేక పోతున్నాయి. తాజాగా డీజిల్‌ సమస్య ఏర్పడింది. ఈ విషయమై నిర్మల్‌ జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్‌ను సంపద్రించగా.. అంబులెన్సులకు డీజిల్‌ సమస్య లేదని పేర్కొన్నారు.