ఈనెల 20 నుండి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, వచ్చే జనవరి 6 వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే తెలిపారు. శనివారం నాడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి, అదనపు ఛీప్ ఎలక్టోరల్ ఆఫీసర్ లోకేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈనెల 20 నుండి నిర్వహించబోయే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్షించి పలు సూచనలు, సలహాలు అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే వివరిస్తూ ఈనెల 20 నుండి వచ్చే అక్టోబరు 18 వరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఇంటింటా సర్వేతో బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలించి కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, తప్పులు సవరణ వంటి పనులు నిర్వహించడం జరుగుతుందని, ఒకే చిరునామాపై ఎక్కువ ఓట్లు వంటి అంశాలపై ప్రతేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. వచ్చే అక్టోబరు 29 న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. వీటిపై సవరణలు, అభ్యంతరాలకు నవంబరు 28 వరకు స్వీకరిస్తారని, డిసెంబరు 24 లోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వచ్చే జనవరి 6వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఇంటింటి సర్వే చాలా ముఖ్యమని, ఇ.ఆర్.ఓ., ఎఇఆర్, సూపర్వైజర్ల పర్యవేక్షణలో బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే చేపడతారని, ఇందుకోసం నియోజక వర్గ స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, బూత్ లెవల్ ఆఫీసర్ వద్ద ఎలక్టోరల్ జాబితా, పోలింగ్ స్టేషన్ మ్యాప్, విఐపి ఓటర్ల వివరాలు ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బూత్ లెవల్ ఆఫీసర్లు తమ ఉన్న బి.ఎల్.ఓ. యాప్ లో ఓటర్ల వివరాలను నమోదు చేయడం జరుగుతుందని తెలియచేస్తూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఓటు హక్కు నమోదు కోసం 18 సంవత్సరాలు నిండబోయే యువత వివరాలను బూత్ లెవల్ అధికారుల ద్వారా ముందుగానే సేకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని రెండు నియోజక వర్గాలైన ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి ఆలేరు నియోజక వర్గానికి 309 పోలింగ్ స్టేషన్లు, భువనగిరి నియోజక వర్గానికి 257 పోలింగ్ కేంద్రాలు కలిపి మొత్తం 566 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. భువనగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో 1,08,894 మంది పురుష, 1,11,900 మంది మహిళా ఓటర్లు, ఒక ట్రాన్స్ జెండర్ కలిపి మొత్తం 2,20,795 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఆలేరు అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించి 1,16,884 మంది పురుష, 1,18,317 మంది మహిళా ఓటర్లు, 19 మంది ట్రాన్స్ జెండర్స్తో కలిపి మొత్తం 2,35,220 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి బెన్ షాలోమ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్, భువనగిరి ఆర్.డి.ఓ. అమరేందర్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీలుదారు సురేష్, శ్రీకాంత్ లు ఉన్నారు.