– ఎలక్ట్రోరల్ అధికారి, ఐఏఎస్ అయేషా మస్రత్
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్ : కొత్తగా ఓటర్ నమోదుకు, జాబితాలో సవరణలకు ఈనెల 28 వరకు అవకాశం ఉందని ఎలక్ట్రోరల్ అధికారి, ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి, ఐఏఎస్ అయేషా మస్రత్ తెలిపారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూతులను పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా, బీఎల్‌వోలు పోలింగ్ బూత్‌ల వద్ద కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అన్నారు. పలు అంశాలపై బీఎల్ఓ లకు సలహాలు, సూచనలు చేశారు. 2025 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన వెబ్ సైట్ (eci. Govt.in) ఓటరు హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక అదనపు కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎలక్షన్ డీటీ సదానందం, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, సీహెచ్ వినీత్,
ఆర్ఐ రవీందర్, బీఎల్ఓ లు మునిగాల రాణి, సీహెచ్. స్వరూప రాణి, తదితరులు పాల్గొన్నారు.