
ప్రజా పాలన సేవా కేంద్రాలలో లబ్ధిదారుల దరఖాస్తులలో సవరణలను జాగ్రత్తగా చేయాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. బుధవారం ఆమె తిప్పర్తి మండల కేంద్రంలో ని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్తు బిల్లు, ఎల్పిజి కనెక్షన్ కింద 500 రూపాయలకు సిలిండర్ పొందేందుకు సేవా కేంద్రానికి వచ్చిన లబ్ధిదారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ముందుగా జొన్న గడ్డల గూడెం గ్రామానికి చెందిన ఎం. కోటయ్యతో మాట్లాడుతూ దేనికోసం ఎంపీడీవో కార్యాలయం వచ్చారని అడిగారు. గృహ జ్యోతి కింద జీరో బిల్లు కోసం, అలాగే 500 రూపాయల ఎల్పీజీ కనెక్షన్ కోసం వచ్చానని కోటయ్య జిల్లా కలెక్టర్ కు తెలుపగా,సేవా కేంద్రంలో ఆ రెండింటికి సంబంధించిన సవరణలను జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి జీరో విద్యుత్ బిల్లు రసీదును జిల్లా కలెక్టర్ కోటయ్యకు అందజేశారు. సునీత, ఆండాళ్ అనే ఎల్పిజి సిలిండర్ లబ్ధిదారులతో సైతం కలెక్టర్ నేరుగా మాట్లాడారు. వారి వినియోగదారు నంబరు తీసుకొని 500 రూపాయలకే ఎల్ పి జి సిలిండర్ పొందేందుకు ప్రజాపాలన దరఖాస్తులో వారి వినియోగదారు నంబర్ల సవరణ లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి, తహసిల్దార్ స్వప్న, తదితరులు ఉన్నారు.