– పాలస్తీనా రాయబారి వెల్లడి
న్యూయార్క్ : గాజాపై దాడిలో అమెరికా సైన్యం ప్రత్యక్షంగా పాల్గొంటున్నదని ఫ్రాన్స్‌లో పాలస్తీనా రాయబారిగా పనిచేసిన సల్మాన్ అల్ హర్ఫి అన్నారు. అమెరికా సైన్యం ఇజ్రాయిల్‌కు మద్దతు ఇవ్వటమే కాకుండా పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నదని తెలిపారు. అమెరికా తన సైన్యాన్ని గాజా ప్రాంతానికి పంపటమే కాకుండా వారు యుద్ధంలో పాల్గొనేలా చేస్తున్నదని చెప్పారు. కాగా, తమ సైన్యాన్ని ఇజ్రాయిల్‌కు గానీ, గాజాకు గానీ పంపే ఉద్దేశం తమకులేదని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అయితే యుద్ధ క్షేత్రం నుంచి అందుతున్న నివేదికల ప్రకారం గాజాలో అమెరికా సైనిక కదలికలు స్పష్టంగా కనపడుతున్నాయి. గాజాకు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోవున్న నెగేవ్ ఎడారిలో ఇజ్రాయిల్‌కు చెందిన సైనిక స్థావరాన్ని అమెరికా ఎలాంటి ఆర్భాటం లేకుండా అప్రకటితంగా విస్తృతపరుస్తున్నది. గాజాపైన ఇజ్రాయిల్ చేస్తున్న దురాక్రమణలో 5000 మంది అమెరికా సైనికులు పాల్గొన్నట్టు ఇరాన్ మీడియాకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. గతవారంలో హమస్ బంధీలను విడిపించటానికి అమెరికా, ఇజ్రాయిలీ ప్రత్యేక దళాలు సంయుక్తంగా ప్రయత్నించి ఘోరంగా నష్టపోయాయని ట్రంప్ పాలనలో అమెరికా రక్షణ శాఖకు సలహాదారుగా పనిచేసిన డగ్లస్ మెక్ గ్రెగర్ టకర్ కార్ల్ సన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పాడు. గాజాలో వందల కిలోమీటర్ల పొడుగు సొరంగ మార్గాలున్నాయి. ఇవి హమస్ మిలిటెంట్ల చలనాలకు, రక్షణకు ఉపయోగపడుతున్నాయి. ఈ సొరంగ మార్గాలను ధ్వంసం చేయటం ఇజ్రాయిలీ సైన్యానికి దుస్సాధ్యంగా మారింది.
75సంవత్సరాల చరిత్రగల పాలస్తీనా-ఇజ్రాయిల్ సంక్షోభం అక్టోబర్7న దక్షిణ ఇజ్రాయిల్ పైన జరిగిన హమస్ మెరుపు దాడితో మరోసారి హింసాత్మక రూపాన్ని సంతరించుకుంది. మూడు వారాలుగా గాజాపైన ఇజ్రాయిల్ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ హింసలో గాజా, వెస్ట్ బ్యాంక్‌లలో 8400మంది పాలస్తీనా వాసులు, 1413ఇజ్రాయిలీ ప్రజలు మరణించారు.
అనేక వేలమంది గాయపడ్డారు. 15లక్షలమంది గాజా వాసులు, రెండు లక్షలమంది ఇజ్రాయిలీ ప్రజలు తమ నివాసాలను వదిలి శరణార్థులుగా మారారు. రష్యా, చైనా, ఇరాన్, టర్కీ, సౌదీ అరేబియా, బ్రాజిల్, సౌత్ ఆఫ్రికాలతోపాటుగా అనేక దేశాలు గాజాలో హింసను తక్షణమే ఆపాలని, సహాయాన్ని నిరాటంకంగా ప్రజలకు చేరేలా చూడాలని కోరాయి. అమెరికా, ఇజ్రాయిల్ కాల్పుల విరమణకు అంగీకరించకుండా హమస్ ను నాశనం చేసేదాకా యుద్ధం కొనసాగుతుందని ప్రకటించాయి. గాజాను నాశనం చేయకుండా హమస్ ను నాశనం చేయటం దుస్సాధ్యమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్ రోవ్ హెచ్చరించాడు.