అమెరికావి ద్వంద్వ ప్రమాణాలు !

అమెరికావి ద్వంద్వ ప్రమాణాలు !– అమెరికా గడ్డపై నుండి దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం
– ఘాటుగా స్పందించిన ఉత్తర కొరియా
– రాకెట్‌ ప్రయోగం
ఉత్తర కొరియాతో అంతరిక్ష పోరు నేపథ్యంలో దక్షిణ కొరియా సోమవారం ఘన ఇంధన అంతరిక్ష రాకెట్‌ను ప్రయోగించింది. ఇది మూడో ప్రయోగం, గతేడాది మార్చిలో,  డిసెంబరులో రెండుసార్లు ప్రయోగించింది.
సియోల్‌ : అమెరికా గడ్డపై నుంచి దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అనుమతించడం ద్వారా అమెరికా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోం దని ఉత్తర కొరియా తీవ్రంగా విమర్శించిం ది. గతంలో ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగాన్ని అమెరికా ఖండించిన నేపథ్యంలో సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ స్పేస్‌ ఫోర్స్‌ బేస్‌ నుండి దక్షిణ కొరియా గత వారం దేశీయంగా మొదటిసారిగా నిర్మించిన గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. నవంబరు 21న ఉత్తర కొరియా మొదటిసారిగా తన సొంత మిలటరీ నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. వెంటనే అమెరికా, దక్షిణ కొరియాలు, వారి భాగస్వామ్య దేశాలు ఆ చర్యను ఖండిస్తూ, తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తోందంటూ విమర్శించాయి. అమెరికా నుండి ముప్పు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉపగ్రహాలను, క్షిపణులను ప్రయోగించే, పరీక్షించే హక్కు తమకు వుందని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. ఉత్తర కొరియా సార్వభౌమాధికారాన్ని చట్ట విరుద్ధంగా నిరసిస్తూ, ఆంక్షలు విధించడమన్నది రోదసీ స్థాయిలో అమెరికా జరుపుతున్న కామెడీ అని ఉత్తర కొరియా రోదసీ సంస్థ ఒక ప్రకటనలో విమర్శించింది. పైగా గతంలో ఉత్తర కొరియా ప్రయోగాన్ని విమర్శించి… ఈనాడు అమెరికా దక్షిణ కొరియా విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని పేర్కొంది. గ్యాంగ్‌స్టర్‌ వంటి అమెరికా తర్కాన్ని గనక సహించి, ఆమోదిస్తే, ప్రపంచ శాంతి, సుస్థిరతలు కోలుకోలేని రీతిలో ఘోర ప్రమాదానికి గురవుతాయని ఆ ప్రకటన విమర్శించింది. ప్రత్యర్థి ఎత్తుగడలను మరింత మెరుగైన రీతిలో పర్యవేక్షించేందుకు అదనంగా నిఘా ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఉత్తర కొరియా తెలిపింది.