– చెప్పేవి శాంతి ప్రవచనాలు… ఎగదోసేది యుద్ధాన్నే !
– నెల్లూరు నరసింహారావు
హమస్‌ను నామరూపాలు లేకుండా చెయ్యాలనే, బంధీలుగావున్న తమవారిని బలవంతంగా విడిపించుకో వాలనే లక్ష్యాలు నెరవేరక తాము గాజా యుద్ధంలో మూడవ దశలో ప్రవేశించామని ఇజ్రాయిల్ మిలిటరీ ఇటీవల ప్రకటించింది. ఇజ్రాయిల్ ఒప్పుకోనప్పటికీ ఒక డజను సాయుధ గ్రూపులు ఉత్తరం నుంచి దక్షిణందాకా పాలస్తీనా వాసులను హతమార్చటం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 30000మంది పాలస్తీనియన్లు హతులయ్యారు. అందుకే ఈ మానవ హననాన్ని ఐక్యరాజ్య సమితి ఎయిడ్ అధినేత మార్టిన్ గ్రిఫ్పిత్ అత్యంత దారణమైన మానవతా సంక్షోభం అని అన్నాడు. దీనిలో దురాక్రమణదారైన ఇజ్రాయిలీ సైన్యానికి సైనికపరంగా చెప్పుకోవటానికి ఏమీలేదు. గాజాలో ఇజ్రాయిల్ సైన్యం విఫలమైన నేపథ్యంలో హమస్ పరువు, ప్రతిష్టలు పెరిగాయి. దానితో ఇజ్రాయిల్ ప్రధాని ద్రుష్టి పాలస్తీనా- ఇజ్రాయిల్ సరిహద్దు ఆవలకు మారింది.
గాజాలో యుద్ధం ముగియటంతోపాటు తన రాజకీయ జీవితం కూడా ముగుస్తుందని నేతాన్యాహూకు తెలుసు. జనవరి 2వ తేదీనాడు బీరూట్ దక్షిణ ప్రాంతంపై దాడిచేసి హమస్ పొలిటికల్ బ్యూరో ఉప నాయకుడైన సలా అల్- అరౌరీని, ఆయనతోపాటున్నమరో ఆరుగురిని ఇజ్రాయిల్ హత్య చేసింది. 2006లో జరిగిన హెజ్బొల్లా-ఇజ్రాయిల్ యుద్ధం తరువాత లెబనాన్ రాజధానిపైన ఇజ్రాయిల్ దాడి చేయటం ఇదే తొలిసారి. 2006లో లెబనాన్-ఇజ్రాయిల్ యుద్ధం తరువాత లెబనాన్ రాజధానిపైన దాడి చేయటమే తాము యుద్ధ ప్రకటనకు అంతిమ ఘడియగా పరిగణిస్తామని హెజ్బొల్లా సెయ్యెద్ హస్సన్ నస్‌రల్లా పదేపదే స్పష్టం చేశాడు. ఇజ్రాయిల్ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో తరచుగా కాల్పులు జరుపుతున్న హెజ్బొల్లా నుంచి ప్రతిస్పందన ఉంటుందనే విషయం ఇజ్రాయిల్ ప్రభుత్వానికి తెలుసు. గాజా యుద్ధంలో హెజ్బొల్లో హమస్‌కు మద్దుతుగా నికరంగా నిలుస్తోంది. హమస్ తో స్నేహ సంబంధాలున్న ప్రాంతీయ శక్తులన్నింటికీ ఇదే లక్ష్యం ఉంది. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఇజ్రాయిల్-హుజ్బొల్లా ల మధ్య యుద్ధంగా మార్చటానికి హెజ్బొల్లాకు ఆసక్తి లేదు. జనవరి 8వ తేదీనాడు దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా ఇన్‌ఫాంట్రీ కమాండర్ విస్సమ్ తవీల్ కారుపైన ఇజ్రాయిల్ వైమానిక దాడిచేసి హతమార్చింది. జరిగిన రెండు హత్యలకు ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ లోని సఫద్ లోవున్న ఉత్తర కమాండ్ కేంద్రంపైన, మెరాన్ లోని ఉత్తర సైనిక స్థావరంపైన హెజ్బొల్లా దాడులు చేసింది. అలాగే 8కిలోమీటర్ల దూరంలోవున్న మెర్కవా ఇజ్రాయిల్ ట్యాంక్ ను హెజ్బొల్లా య్యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ తో పేల్చివేసింది. దీనితో లెబనాన్ పైన యుద్ధం చేయటం ప్రమాదకరమని ఇజ్రాయిల్ గమనించింది. హెజ్బొల్లాకు ఒక లక్షమంది సర్వ సన్నద్దంగావుండే సైన్యం ఉంది. ఈ సైన్యంవద్ద వేలాది మిస్సైల్స్ ఉన్నాయి. ఈ సైన్యానికి ఇజ్రాయిల్ రాజధానిపైన, హైఫా నగరంపైన దాడిచేసే సామర్థ్యం ఉంది. అమెరికాకు ఇదంతా తెలుసు. పైకి శాంతి ప్రవచనాలు పలుకుతూ ఆచరణలో అమెరికా చేసే పనులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అమెరికా కాంగ్రేస్ ప్రమేయంలేకుండా రెండుసార్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వందల కోట్ల విలువగల ఆయుధాలను ఇజ్రాయిల్ కు సరఫరా అయ్యేలా చూశాడు. అంతేకాకుండా ఎటువంటి షరతులూ లేకుండా గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న మానవ హననానికి అమెరికా మద్దతునిస్తోంది. అలాగే లెబనాన్ లో చట్టవిరుద్దంగా ఇజ్రాయిల్ చేసిన హత్యలను కూడా అమెరికా ఖండించటం లేదు. అంతేకాకుండా ఇరాక్ లో ఇరాకీ పాపులర్ మొబిలై జేషన్ యూనిట్స్(పిఎమ్‌యు) కమాండర్ ముస్తాక్ అల్-జవహరీని హత్య చేయటానికి తన సైన్యాన్ని బైడెన్ ఆదేశించాడు. దీనితో అమెరికా ఇరాక్ తో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించినట్టయింది. ఇరాక్ ప్రభుత్వం వెంటనే అమెరికా సేనలను తమ భూభాగం నుంచి వైదొలగ వలసిందిగా ఆదేశించింది. ఈలోపు హౌతీ మిలిటెంట్ల పైన, యమెన్ భూభాగంపైన ఎర్రసముద్రం నుంచి అమెరికా- బ్రిటీష్ సైన్యాలు దాడుల చేస్తున్నాయి. ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్ లోని యైలాత్ ఒడరేవు వైపు పయనించే ఇజ్రాయిల్ రవాణా నౌకలపైన హౌతీ మిలిటెంట్లు దాడులు చేస్తున్నారుగానీ ఎవ్వరినీ చంపటం లేదు. ఈవిధంగా అమెరికా మధ్యప్రాచ్చంలో ఘర్షణలను పెంచుతోంది.
గాజాలో ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనా ప్రజలకు సహాయం అందించేందుకు అనుమతించాలని మాత్రమే హౌతీ మిలిటెంట్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సందర్బంలోను అంతర్జాతీయ న్యాయ సూత్రాల అమలుకు అమెరికా తన దౌత్య నీతిని ఉపయోగించటానికి బదులుగా అపారమైన తన సైనిక శక్తితో ఆటవిక న్యాయాన్నిఅమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. గాజాలో మానవ హననం కొనసాగించటానికి ఇజ్రాయిల్‌ను అనుమతి స్తోంది. ఈ మానవ హననాన్ని ఆపటానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రయత్నిస్తే వెంటనే ఆగిపోతుంది. అయితే ఆయనలో అటువంటి ఆలోచనగానీ, కనీస ప్రజాస్వామిక స్పూర్తిగానీ మచ్చుకైనా కనిపించవు.