చైనాను కవ్విస్తున్న అమెరికా, బ్రిటన్‌ !

ఒకవైపు ఐరాస ఆమోదించిన ఒకే చైనా విధానానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూనే దాన్నుంచి వైదొలగటమే కాదు, చైనాను రెచ్చగొట్టే విధంగా అమెరికా, బ్రిటన్‌ వాటిని అనుసరించే పశ్చిమ దేశాల తీరు గర్హనీయం. ఇటీవలి కాలంలో వాటి వేగం పెరిగింది. ఈ శక్తుల కుట్రలను ఎప్పటికప్పుడు పసిగడుతూ తన జాగ్రత్తలో తానుంటున్న చైనా అమెరికా కూటమికి ధీటుగా తన సత్తా ఏమిటో మిలిటరీ విన్యాసాల ద్వారా చూపుతున్నది. రష్యాను దెబ్బతీసేందుకు గాను దాని సరిహద్దుల వరకు నాటోను విస్తరించేందుకు వేసిన ఎత్తులో భాగంగా ఉక్రెయిన్‌కు సభ్యత్వమివ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానికి ప్రతిగా రష్యా 2022 ఫిబ్రవరి 24 నుంచి సైనిక చర్యను ప్రకటించి నాటో పధకా లను దెబ్బతీస్తున్నది. ఎదురుదాడి పేరుతో ఇటీవలి కాలంలో పశ్చిమ దేశాలు ఇచ్చిన అస్త్రాలతో ఉక్రెయిన్‌ మిలిటరీ ఏకంగా రష్యా భూభాగాల మీద దాడులకు పాల్పడుతూ పుతిన్‌ సేనలను కవ్విస్తున్నది. ఇపుడు పశ్చిమ దేశాలు చైనా మీద కేంద్రీకరించాయి. ఎక్కడో ఒక చోట చిచ్చు ఆరకుండా చూడటమే వాటి లక్షణం.
ఒక సర్వసత్తాక దేశానికి అందించే మాదిరి మిలిటరీ సాయాన్ని గత ఏడున్నర దశాబ్దాలుగా చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు అందించాలని తాజాగా అమెరికా నిర్ణయించింది. అన్ని అంతర్జా తీయ సూత్రాలు, సంప్రదాయాలకు ఇది విరుద్దమే. ఎనిమిది కోట్ల డాలర్ల విలువ గల మిలిటరీ సామగ్రిని అందచేసేందుకు అనుమతిం చాలని పార్ల మెంటును ఒక నోటిఫికేషన్‌ ద్వారా కోరింది. ఇదిగాక కొద్ది వారాల క్రితం 34.5 కోట్ల డాలర్ల ఆయుధాలు, ఎఫ్‌-16 యుద్ధ విమానాల ద్వారా కిరణశోధనకు అవసరమైన మరో 50 కోట్ల డాలర్ల వ్యవస్థలను కూడా అందించాలని బైడెన్‌ సర్కార్‌ నిర్ణయించింది. అమెరికా కనుసన్నలలో నడిచే బ్రిటన్‌ కూడా చైనాను గిల్లుతున్నది. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లవర్లీ చైనా పర్యటనలో ఉండగా తైవాన్‌ను ఒక స్వతంత్ర దేశంగా పార్లమెంట్‌కు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న అంశం వెలుగులోకి వచ్చింది. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించటం ఇది. ఐదు సంవత్స రాల తరువాత చైనాతో సంబంధాలను మెరుగుపరచుకొనే పేరుతో బీజింగ్‌ వచ్చిన తమ మంత్రి అక్కడ ఉండగానే సునాక్‌ సర్కార్‌ ఈ విధంగా వ్యవహరించటం ఏ విధంగా చూసినా రెచ్చగొట్టటమే. ఒకే చైనా విధానాన్ని బ్రిటన్‌ కూడా ఆమోదిం చింది. అలాంటిది ఐదు దశాబ్దాల తరువాత ఒక స్వతంత్ర దేశంగా పేర్కొ నటం వెనుక దుష్ట ఆలోచన తప్ప మరొకటి కనిపించటంలేదు. తైవాన్‌తో ఎలాంటి దౌత్య సంబంధాలు లేకుండా ఇలా చిత్రించటం ఉద్రిక్తత లను పెంచటమే. బ్రిటన్‌ చరిత్రలో అతి తక్కువగా 50 రోజులు మాత్రమే ప్రధాని పదవిలో ఉన్న నాయ కురాలిగా చరిత్రకెక్కిన లిజ్‌ ట్రస్‌ కన్సర్వేటివ్‌ పార్టీ నేత. భద్రతా పరంగా బ్రిటన్‌కు ముప్పు తెచ్చే దేశంగా చైనాను ప్రకటించాలని, దానికి అనుగుణంగా ఉండాలని, కాని అందుకు భిన్నంగా జరుగుతోందని స్వంత పార్టీకి చెందిన సునాక్‌ ఏలిక మీద ఆమె ధ్వజమెత్తింది. పార్టీలో ప్రత్యర్ధులను సంతుష్టీకరించేందుకు జేమ్స్‌ క్లవర్లీ కూడా చూశారు. చైనా ఉపాధ్యక్షుడు హాన్‌ ఝెంగ్‌తో భేటీ తరువాత విలేకర్లతో మాట్లాడుతూ చైనా ప్రతినిధులతో జరిపిన అన్ని సమావేశాల్లోనూ చైనాలో మానవ హక్కుల భంగం గురించి చెప్పానని, ఇక ముందు కూడా చెబుతూనే ఉంటానని చెప్పుకున్నాడు. దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చా నౌకాయానం పేరుతో ఆ ప్రాంత దేశాలను చైనా వ్యతిరేక కూటమిలో చేర్చేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు. ఒక వైపు దౌత్యపరంగా వత్తిడి, ప్రలోభాలతో అనేక దేశాలను తన అదుపులోకి తెచ్చుకొనేందుకు చూస్తున్నది. మరోవైపు చైనా కూడా దాన్ని అడ్డుకొనేందుకు దౌత్యపరంగా పావులు కదపటమే గాక ఎవరైనా తైవాన్‌ పేరుతో రాజకీయం చేస్తే డొక్క చించుతామని హెచ్చరిస్తున్నది. దానిలో భాగంగానే నలభై గంటల పాటు ఏకధాటిగా శత్రు జలాంతర్గాములను ఎదుర్కొని దెబ్బతీసే మిలిటరీ విన్యాసాలను తాజాగా జరిపింది. డజనుకు పైగా జలాంతర్గాలపై నిఘావేసే వైమానిక దళాలతో యుద్ధం సంభవించినపుడు ఎలా వ్యవ హరించేదీ అచరణాత్మంగా నిర్వహించి సిబ్బందికి అవగాహన కలిగించారు. శత్రు జలాంతర్గాములను పసి గట్టటం, వాటి మీద దాడులను ఎలా జరపాల్సిందీ శిక్షణ ఇచ్చారు. దక్షిణ చైనా సముద్రంలో చైనాను కవ్విస్తూ మరో యుద్ధ రంగాన్ని తెరిచేందుకు పశ్చిమ దేశాలు పూనుకున్నాయి. అందుకోసం తైవాన్‌ను పావుగా వాడుకుంటున్నాయి. ఈ నేపధ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అక్కడ జరుపుతున్న కుట్రలను అర్ధం చేసుకోలేము.