చైనాను కవ్విస్తున్న అమెరికా!

America is teasing China!డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు గడువు జనవరి 20వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అమెరికా ప్రభుత్వం చైనాను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. ఒక వైపు పశ్చిమాసియాలో ఎమెన్‌ మీద దాడులకు దిగుతూ అవసరమైతే ఇరాన్‌ సంగతి చూస్తామంటూ అమెరికా, ఇజ్రాయెల్‌ బెదిరింపులకు పాల్పడుతున్నాయి. మరోవైపు చైనాతో గిల్లికజ్జాలకు అమెరికా దిగింది. చైనా మిలిటరీ గురించి అతిశయోక్తులతో నివేదికలను రూపొందించి ఆ సాకుతో తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు మరిన్ని ఆయుధాలను అందించేందుకు పూనుకుంది. స్వంత చట్టం మేరకు తైవాన్‌లో ఇంధనం నింపుకొనే పేరుతో యుద్ధ విమానాల రాకపోకలకు రంగం సిద్ధం చేస్తున్నది. పక్కనే జపాన్‌, దక్షిణ కొరియాలో దాని సైనిక స్థావరాలు ఉండగా తైవాన్‌కు రావాలని చూడటం చైనా సహనాన్ని పరీక్షించటం తప్ప మరొకటి కాదు. ఈ పూర్వరంగంలోనే సార్వభౌ మత్వం, ప్రాదేశిక సమగ్రతలను కాపాడుకొనే తమ సత్తాను ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దని చైనా బుధవారం నాడు హెచ్చరించింది. శాంతియుతంగా విలీనం కావాల్సిన తైవాన్‌ ప్రాంతాన్ని బెదిరింపులతో సంప్రదింపులకు వచ్చే విధంగా చైనా మిలిటరీని తీర్చిదిద్దుతున్నదని అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ 2024నివేదికలో ఆరోపించింది. దాన్ని సాకుగా చూపి తైవాన్‌కు మరిన్ని ఆయుధాలు అందచేసేందుకు వేసిన ఎత్తుగడ ఇది. అమెరికా జాతీయ రక్షణ అధికార చట్టం ప్రకారం 2025 సంవత్సరంలో తైవాన్‌కు ఆయుధాలు అందించేందుకు గాను పెంటగన్‌ నివేదికలో చైనా ముప్పు అంటూ ప్రతికూల సమాచారాన్ని చొప్పించారని, తమ అంతర్గత వ్యవహారాల్లో మూడవ పక్ష జోక్యాన్ని సహించేది లేదని చైనా ప్రభుత్వంలోని తైవాన్‌ వ్యవహారాల శాఖ కార్యాలయం ప్రకటించింది.
ప్రపంచంలో చైనా ఒకే ఒక్కటి ఉంది. తైవాన్‌ దానిలో భాగం. ఒకే చైనా అన్న అవగాహనను అంగీకరించిన అమెరికా ఆమేరకు తమతో కలసి గతంలో విడుదల చేసిన మూడు ప్రకటనలకు కట్టుబడి ఉండాలని చైనా డిమాండు. అమెరికా చర్యలు దాన్ని ఉల్లంఘించేవిగా ఉన్నాయి. తైవాన్‌ స్వాతంత్య్రం గురించి తప్పుడు సంకేతాలు పంపవద్దు, తైవాన్‌లో అధికారంలో ఉన్న పార్టీ అమెరికా అండచూసుకొని రెచ్చిపోతే తగిన ఫలితం అనుభవించాల్సి ఉంటుందని, విలీన చారిత్రక క్రమాన్ని ఆపలేరని కూడా చైనా హెచ్చరించింది. మిలిటరీని చూపి చైనీయులు బెదిరిస్తున్నారని దానికి ప్రతిగా తైవాన్‌తో కుదుర్చుకున్న రవాణా సేవల ఒప్పందం మేరకు అమెరికా మిలిటరీ విమానాలకు ఇంధనాన్ని తైవాన్‌లో నింపాలని కొందరు అమెరికన్‌ మిలిటరీ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. అంటే అవసరం లేకపోయినా ఆ సాకుతో తైవాన్‌కు యుద్ధ విమానాల రాకపోకలను నిర్వహించాలని చెప్పటమే. అమెరికా నివేదికల్లో రాసుకున్నదాని ప్రకారం 2022, 23 సంవత్సరాలలో పదిహేను వందల చైనా మిలిటరీ విమానాలు తైవాన్‌ ప్రాంత గగనతలంలో తిరిగాయట! అదే విధంగా అమెరికా కూడా తైవాన్‌ స్వాతంత్య్రం కోరుతున్నవారికి భరోసాగా విమానాలను నడపాలని బహిరంగంగా కోరుతున్నారు. అలా గనక చేస్తే దాన్ని తమ దేశ మిలిటరీ, అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా పరిగణిస్తామని చైనా స్పష్టం చేసింది.
కమ్యూనిస్టుల నాయకత్వంలో 1949లో ఏర్పడిన జన చైనా పాలనలో తైవాన్‌ ఎన్నడూ లేదని కొందరు తప్పుదారి పట్టించే వాదనలు చేస్తున్నారు. 1945లోనే చైనా భద్రతా మండలి శాశ్వత సభ్యదేశంగా ఉంది. కమ్యూనిస్టుల తిరుగుబాటు సమయంలో తైవాన్‌లో తిష్టవేసిన చైనా ప్రభుత్వానికే 1970దశకం వరకు ఐరాసలో గుర్తింపు కొనసాగించారు. తరువాత కమ్యూనిస్టు చైనాను అసలైన ప్రతినిధిగా పరిగణించి తైవాన్‌ కూడా దానిలో అంతర్భాగమే అని ఐరాస గుర్తించింది. అప్పటివరకు ప్రధాన భూభాగంతో సంబంధాలు లేవు గనుక పరస్పరం విశ్వాసం కల్పించి విలీన ప్రక్రియ జరపాలని నిర్ణయించారు. అయితే ఇన్ని దశాబ్దాలు గడచినా అలాంటి పరిస్థితి ఇంకా రాలేదంటూనే, మరోవైపు స్వతంత్ర తైవాన్‌ కోరుకొనే శక్తులను అమెరికా ఎగదోస్తున్నది. ఆయుధాలు ఇచ్చి తిరుగుబాటుకు సన్నద్దం చేస్తున్నది. ఆ చర్యలను ఎప్పటికప్పుడు చైనా ఖండిస్తున్నది, శాంతియుతంగా విలీనానికి అనేక ప్రతిపాదనలు చేసింది. బ్రిటన్‌ పోర్చుగీసు కౌలు గడువు తీరిన తరువాత చైనాలో అంతర్భాగాలుగా మారిన హాంకాంగ్‌, మకావు దీవుల్లో మాదిరి తైవాన్‌లో కూడా 2049వరకు ఒకే దేశం రెండు వ్యవస్థలు ఉనికిలో ఉంటాయని చైనా చెబుతున్నది.శృతిమించి వేర్పాటుకు ప్రయత్నిస్తే అవసరమైతే బలప్రయోగం చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. తైవాన్‌ సమస్యను అమెరికా తెగేదాకా లాగేందుకు చూస్తున్నది.