అమెరికా X చైనా

America X China– బొగ్గు, చమురు వాహనాలు సహా పలు అమెరికా ఉత్పత్తులపై 10శాతం సుంకాలు
– డబ్ల్యూటీఓలో ఫిర్యాదు నమోదు
బీజింగ్‌ : అమెరికా విధించిన టారిఫ్‌లపై చైనా ప్రభుత్వం దీటుగా స్పందించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే బొగ్గు, ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తులపై 15శాతం, ముడి చమురు, ఇతర ఉత్పత్తులపై పది శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 10 నుంచి ఈ టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ చట్టం మౌలిక సూత్రాలు, టారిఫ్‌ లా వంటి చైనా చట్టాలు, ఇతర నిబంధనలకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నట్టు కస్టమ్స్‌ టారిఫ్‌ కమిషన్‌ మంగళవారం ప్రకటించింది. కెనడా, మెక్సికో, చైనా దేశాల ఉత్పత్తులపై ఈ నెల 1న అదనపు దిగుమతి సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు.
వ్యవసాయ పనిముట్లు, ఆటోమొబైల్స్‌ పికప్‌ ట్రక్కులు వంటి వాటిపై కూడా 10శాతం అదనపు టారిఫ్‌లు అమలు కానున్నాయని కమిషన్‌ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఏ ఏ ఉత్పత్తులకు ఎంతెంత అదనపు సుంకాలనేవి అనుబంధ పత్రాల్లో వెల్లడించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుత బాండెడ్‌ విధానాలు, పన్ను తగ్గింపు, మినహాయింపు విధానాలేవీ మారబోవని, తాజా టారిఫ్‌లకు ఎలాంటి మినహాయింపుల, తగ్గింపు వుండబోదని కమిషన్‌ ప్రకటన పేర్కొంది.
చైనా నుండి దిగుమతయ్యే ఉత్పత్తులపై అదనంగా 10శాతం సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) వివాదాల పరిష్కార యంత్రాంగంలో చైనా ఫిర్యాదు నమోదు చేసింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. చైనా చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసమే ఈ చర్య తీసుకున్నట్లు వాణిజ్య శాఖ ప్రతినిధి మీడియాకు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏకపక్షంగా అధిక టారిఫ్‌లను విధించడం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని విమర్శించింది. ఈ చర్య అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోగా చైనా, అమెరికాల మధ్య నెలకొన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుందని తెలిపింది. చైనా దిగుమతులపై ట్రంప్‌ విధించిన 10శాతం సుంకాలు మంగళవారం నుండి అమల్లోకి వచ్చాయి.
బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు గట్టి మద్దతుదారుగా డబ్ల్యుటిఓ సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా వుంటుందని వాణిజ్య ప్రతినిధి చెప్పారు. ఏకపక్షవాదం, వాణిజ్య రక్షణవాదం వంటి చర్యల వల్ల బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధిని పరిరక్షించేందుకు కట్టుబడి వుంటామని తెలిపారు.