– 29న క్యూబా ప్రజలకు సంఘీభావ ప్రదర్శనలు :సీఐటీయూ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
క్యూబాపై అమెరికా సామ్రాజ్యవాద నిరంకుశ, నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 29న క్యూబా ప్రజలకు అండగా రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. ఈమేరకు శనివారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య, ఆర్థిక దిగ్బంధానికి ముగింపు పలకాలంటూ జనరల్ కౌన్సిల్ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గత 63 ఏండ్లుగా అమెరికా దిగ్బంధం వల్ల క్యూబా ఆర్ధికంగా 164.14 బిలియన్ డాలర్లు నష్టపోయిందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రీత్యా ఇది మొత్తం 1,499 ట్రిలియన్ డాలర్లు అని వివరించారు. క్యూబాలో అమెరికన్లు ప్రయాణించేందుకు ట్రంప్ కూడా అనేక అడ్డంకులను సృష్టిస్తూ కొత్త కొత్త నిబంధనలను జారీ చేశారని విమర్శించారు. ఆ నిబంధనలు ప్రస్తుతం అమెరికా అధ్యక్షులు బైడెన్ కూడా కొనసాగిస్తు న్నారని తెలిపారు. ఫలితంగా క్యూబాకు దిగుమతులు తగ్గిపోయాయని పేర్కొన్నారు. ఆర్థిక, బ్యాంకింగ్ లావాదేవీలు, విదేశీ వాణిజ్యం, ఆదాయ వనరులు, ఎనర్జీ, క్రెడిట్ లావాదేవీలకు క్యూబాకు తీవ్ర అవరోధంగా మారాయని తెలిపారు. క్యూబా ఆరోగ్య సంరక్షణ, ఆహారం, వ్యవసాయ రంగాలకు వర్తించేలా అమెరికా ఉద్దేశపూర్వకంగా నిషేధాలు, పరిమితులను అమలు చేసిందని విమర్శించారు. దీంతో ఆరోగ్య సంరక్షణలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, ఆపరేటింగ్ రూమ్‌లో వినియోగించే విడిభాగాల, బ్లడ్ గ్యాస్ ఎనలైజర్లు, ఇమ్యునో డెఫిషియెన్సీ వ్యాధులను నిర్ధారించే మోజెంట్లు, క్యాన్సర్ చికిత్సలకు ఉపయోగించే మందులు, ఔషధాలు, విడి భాగాలు, నవజాత శిశువుల సంరక్షణకు ఉపయోగించే వస్తువులకు కొరత ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ యంత్రాల నిర్వహణకు అవసరమైన ఇంధనం, నూనెలు, లూబ్రికెంట్ల కొరత, ఎరువులు, పురుగు మందుల కొరత టన్నుల కొద్దీ ఉత్పత్తులను శీతలీకరించే సామర్థ్యం కోల్పోవడం వంటి కారణాల వల్ల ఆహారోత్పత్తి తగ్గిందని పేర్కొన్నారు. ఈ దిగ్బంధం వల్ల సహకార సంఘాలు, రైతులు వాడే యంత్రాల కోసం విడి భాగాలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర రవాణా సాధనాలు అందుబాటులో లేక వ్యవసాయం స్తంభించిం దని తెలిపారు.
అలాగే సాగులో లేని భూమిని ఉత్పత్తికి ఉపయోగించేందుకు వాడే ముడి పదార్థాలు లేక ఇతర ఉత్పత్తులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. క్యూబా నేడు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వివరించారు. దాదాపు మొత్తం ద్వీపంలోని 11 మిలియన్ల జనాభాలో 10 మిలియన్ల ప్రజలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 17న దాని ప్రధాన థర్మో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ సేవలను నిలిపివేయటంతో మొత్తం విద్యుత్ వ్యవస్థ నాశనమైందని తెలిపారు. దానికి ఇంధన సరఫరా లేకపోవడం, ఇంధన చమురుతో ఓడ రాక ఆలస్యం కావడంతో పరిస్థితి మరింత జటిలమైందని తెలిపారు. ఈ దిగ్బంధం ప్రధాన లక్ష్యం ఆకలితో క్యూబా జనాభా మరణిస్తే, ప్రజలు వారి అధికారులకు వ్యతిరేకంగా తిరగబడతారని అమెరికా ఆలోచన అని పేర్కొన్నారు. క్యూబా ప్రజలు దైనందిన జీవితాన్ని గడపటానికి నిత్యావసరాల కొరత వల్ల ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈనెల 28, 29 తేదీల్లో క్యూబాపై విధించిన క్రిమినల్ దిగ్బంధాన్ని తొలగించే తీర్మానంపై ఐక్యరాజ్యసమితి మరోసారి చర్చిస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 29న జిల్లా, మండల కేంద్రాల్లో సంఘీభావ ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు.