సగం మంది అమెరికన్లు తమ పెరుగుతున్న గహ నిర్వహణ ఖర్చులను భరించలేక ఇబ్బంది పడుతున్నారని, చాలా మందికి ఆర్థిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉందని, ప్రతి ఐదుగురిలో ఒకరు భోజనాన్ని మానేస్తున్నారని ఒక కొత్త పోల్ వెల్లడించింది. సీటెల్ ఆధారిత రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ రెడ్‌ఫిన్ ఆధ్వర్యంలో శుక్రవారం విడుదల చేసిన సర్వేలో 50శాతం అమెరికా గహ యజమానులు, అద్దెకు వున్నవాళ్లు తమ గహ అవసరాలకు చేయవలసిన చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కోవటం కష్టంగా వుందని చాలా మంది తెలిపారు. ఉదాహరణకు 22 శాతం మంది భోజనానికి దూరంగా ఉన్నారని, 21శాతం మంది తమ వస్తువులలో కొన్నింటిని విక్రయించారని, 37 శాతం మంది అదనపు గంటలు పని చేశారని లేదా అదనపు ఉద్యోగాలను తీసుకున్నారని ఈ సర్వేలో తేలింది.”అమెరికాలో గహనిర్మాణం చాలా ఆర్థిక భారంగా మారింది. కొన్ని కుటుంబాలు ఇకపై ఆహారం, వైద్య సంరక్షణతో సహా ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేయలేవు. అనివార్యంగా ఈ కుటుంబాలు అనేక త్యాగాలు చేయవలసి వస్తోంది. తమ నెలవారీ ఖర్చులను భరించటం కోసం ఓవర్ టైం పని చేయడం, అప్పులు చేయటం తప్పటం లేదు” అని రెడ్‌ఫిన్ ఆర్థిక పరిశోధనా చీఫ్ చెన్ జావో తెలిపారు. అనేక అమెరికా నగరాల్లో గహాల ధరలు, అద్దెలు బాగా పెరిగాయి. గత అక్టోబర్‌లో అవి 23 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత తనఖా రేట్లు పెంచబడ్డాయి. మధ్యస్థ ధర కలిగిన ఇంటిని కొనుగోలు చేయడానికి అవసరమైన స్థాయి కంటే సాధారణ అమెరికా గహ ఆదాయం సంవత్సరానికి 30,000 డాలర్లు తక్కువగా ఉంటుందని రెడ్‌ఫిన్ తెలిపింది.దాదాపు 35 శాతం మంది తమ హౌసింగ్ చెల్లింపులను కొనసాగించడానికి తక్కువ సెలవులు తీసుకుంటున్నారని లేదా ఏదీ తీసుకోలేదని చెప్పారు. సుమారు 18 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి డబ్బును అప్పుగా తీసుకున్నారు లేదా వారి పదవీ విరమణ పొదుపును వాడారు. 16 శాతం మందికి నగదు కొరత కారణంగా వారు వైద్య సంరక్షణను ఆలస్యం చేయవలసి వచ్చింది లేదా వదులుకోవాల్సి వచ్చింది. అమెరికా ద్రవ్యోల్బణం రేటు జూన్ 2022లో 40 సంవత్సరాలలో అత్యధిక స్థాయికి పెరిగినందున ధరలను తగ్గించే ప్రయత్నంలో వడ్డీ రేట్లను పెంచడానికి ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించింది. అప్పటి నుండి ద్రవ్యోల్బణం వేగం తగ్గింది.అయితే ఆర్థికవేత్తలు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఫిబ్రవరికి ముందు ఒక సంవత్సరం ధరలు 3.2 శాతం పెరిగాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే ఆశలను ఈ పెరుగుదల మసకబార్చింది. చాలా మంది యువ అమెరికన్లకు తమ అపార్ట్ మెంట్లను వదులుకొని వారి తల్లిదండ్రులతో జీవించవలసిన పరిస్థితి ఏర్పడింది. గత సెప్టెంబరులో హారిస్/బ్లూమ్‌బెర్గ్ నిర్వహించిన పోల్‌లో 18 నుండి 29 సంవత్సరాల వయస్సు గల వారిలో 45 శాతం మంది తమ తల్లిదండ్రులు లేదా ఇతర బంధువులతో కలిసి నివసిస్తున్నారని తేలింది. 1940ల తరువాత ఇంతటి స్థాయిలో ఇది ఎన్నడూ లేదు.