అమెరికా ‘చిప్‌ యుద్ధం’ విఫలం!

వాషింగ్టన్‌ : తన ప్రత్యర్థి దేశాల సైనిక, సాంకేతిక శక్తిని బలహీనపర్చటంతోపాటు ఆర్థికాభివృద్ధిని కుంటుపడేలా చేయటానికి ఉన్నతస్థాయి మైక్రోచిప్‌ సాంకేతికతను అందుబాటులో లేకుండా చేస్తే సరిపోతుందని అమెరికా భావిస్తోంది. ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సాంకేతికత మీద, వాటిని ఉత్పత్తిచేసే యంత్రాలపైన అమెరికాకుగల గుత్తాధిపత్యాన్ని ఉపయోగించి ఏకపక్షంగా చైనా, రష్యా కంపెనీలను బ్లాక్‌ లిస్టులో పెట్టటమే కాకుండా తన ఇతర మిత్రదేశాలతోను అమెరికా అదేపని చేసేలా వత్తిడి చేస్తున్నది.
సాంకేతికతపైన అమెరికాకుగల గుత్తాధి పత్యాన్ని ఉపయోగించి అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దీన్నే ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తున్నాడు. ఇదే నేటి నూతన ప్రచ్చన్న యుద్ధ సారం. దీనికి పునాదిగా అణ్వస్త్రాల కంటే కూడా చిప్స్‌ సాంకేతికతే ఉంది. భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీలను అమెరికా తన నియంత్రణలో ఉండాలనుకుంటోంది. అయితే అమెరికా తన ప్రత్యర్థి దేశాలపైన ఎన్ని ఆంక్షలను, నియంత్రణలను విధించినప్పటికీ కాలక్రమంలో ఈ విధానం పనిచేయటంలేదని తేలిపోయింది. చైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ విపరీతంగా పెట్టుబడి పెట్టి చిప్స్‌ సాంకేతికతపైన పట్టును సాధించింది. రష్యా కూడా చిప్స్‌ను తన అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేసుకోవటమే లేక వివిధ వనరుల నుంచి సేకరించటమో చేస్తోంది.
ఈ విషయంలో అమెరికా లక్ష్యాలు ఎందుకు విఫలమవుతున్నాయనే ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. అన్నింటికంటే ముందుగా తెలుస్తున్నదేమంటే ఆంక్షలు విధిస్తున్న తీరు నేటి బహుళ ద్రువ ప్రపంచంలో తానే అన్నీ అయి ఆధిపత్యం చెలాయించిన ఏకధ్రువ ప్రపంచం కాలానికి చెందినవి కావటమే. 1990, 2000 దశాబ్దాల్లో నెలకొన్న ఏకధ్రువ ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యం సమగ్రంగా ఉండేది. అటువంటి స్థితిలో అమెరికా తనకు నచ్చని చిన్న దేశాలను తన ఆంక్షలతో దారిద్య్రంలోకి జారుకునేలా చేసేది. అలా ఆయా దేశాలను తన దారిలోకి తెచ్చుకునేది. ఎందుకంటే అటువంటి చిన్న దేశాలను ఆర్థికంగాను, సాంకేతికంగాను వెలివేయటం చాలా తేలిక. అలా ఆంక్షలు విధించటం ఏకద్రువ ప్రపంచ లక్షణం. ఆ రోజుల్లో అమెరికా చెప్పిందే చట్టం. మిగిలినవాళ్ళు చేసింది, చేయవలసింది ఆ చట్టాన్ని అనుసరించటమే. అయితే కాలం మారి బహుళ ధ్రువ ప్రపంచం ఆవిర్భవించినప్పటికీ అమెరికా విధానం మారలేదు. గతంలోవలే తనకు నచ్చని ప్రాబల్య దేశాలపైన కూడా ఆంక్షలను విధించి వాటిని తన దారికి తెచ్చుకోవచ్చనే భ్రమలో అమెరికా ఉంది. తన ప్రాబల్యం తగ్గి ఇతర దేశాల ప్రాబల్యం పెరగటంవలన తాను విధించిన ఆంక్షలను అమలుచేయటం అమెరికాకు కష్టతరమౌతోంది. చిన్న దేశాలపైన కూడా అమెరికా ఆధిపత్యం ఇంతకు ముందులా సాగటం లేదు. నిర్దాక్షిణ్య ఆంక్షలను విధించి ఉత్తర కొరియాను అణ్వస్త్ర నిరాయుధీకరణ చేసేలా చూడొచ్చని ఒకప్పుడు అమెరికా భావించింది. కానీ అలా జరగకపోవటానికి ఇటువంటి దేశాలకు గతంలోకంటే మరిన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటు లో ఉన్నాయి. అలాగే రష్యా క్షిపణులు అచి రకాలంలోనే అడుగంటు తాయనే అమెరికా అంచనాకు భిన్నంగా రష్యా కూడా తనకు కావలసిన ఎలెక్ట్రానిక్‌ చిప్స్‌ ను వివిధ సాధనాల ద్వారా నిరాటంకంగా సేకరించుకోగలు గుతుంది. తను పోటీపడకుండా తన ప్రత్యర్థి దేశాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోకుండా ఆంక్షలతో నిలువరించవచ్చనే భ్రమ అమెరికాకు ఉండటంవల్లనే ప్రస్తుత పరిస్థితి తలెత్తింది. తన ప్రత్యర్థి దేశాలకు సాంకేతికతను అభివృద్ధి చేసుకునే సామర్థ్యంలేదని, ఆంక్షలతో తన ఆధిపత్యాన్ని కొనసాగించగలననే భ్రమ అమెరికాకు ఉంది. మరోవిధంగా చెప్పాలంటే మరే దేశమూ మైక్రో చిప్‌ లేక సెమీ కండక్టర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకుతాముగా అభివృద్ధి చేసుకోజాలవని అమెరికా భావిస్తోంది. ఇదెలా ఉందంటే అణుబాంబును తాను మొట్టమొదటిగా కనుగొన్నది గనుక ఆ పని ఇతర దేశాలు చేయజాలవని అమెరికా భావించినట్టు అనిపిస్తోంది. నేడు మైక్రోచిప్‌ జాతీయ భద్రతకు కేంద్రకంగా మారినందున ఇతర దేశాలు ముఖ్యంగా చైనా తనకున్న అపారమైన ఆర్థిక, సాంకేతిక వనరులతో సెమీకండక్టర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చు కోజాలనదని భావించటం అమాయ కత్వమే అవుతుంది. ఇటువంటి భ్రమల వల్లనే అమెరికా మైక్రోచిప్‌ సాంకేతికను ఆయుధంగా మార్చి గ్లోబల్‌ సెమీకండక్టర్‌ సప్లై చైన్‌ను తెగ్గొట్టింది. మరోవిధంగా చెప్పాలంటే అమెరికా బహుళ ద్రువ ప్రపంచ ఆవిర్భావాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నంలో కాల ప్రవాహానికి ఎదురీదుతోంది. తాను నిరాటంకంగా ఆధిపత్యం చెలాయించిన ఏకద్రువ ప్రపంచంలోకి కాలాన్ని వెనుకకు మరల్చటం అమెరికాకు సాధ్యపడ దనేది చారిత్రక సత్యంగా ఇప్పటికే నిలిచింది.