అమెరికా రక్షణ బడ్జెట్‌ ప్రపంచ యుద్ధం కోసమా?

US defense budget For a world war?– నెల్లూరు నరసింహారావు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శనివారం నాడు సంతకం చేసిన బడ్జెట్‌ చరిత్రలో అతిపెద్ద మొత్తాన్ని సైనిక వ్యయం కోసం అందిస్తుంది. ఫెడరల్‌ ప్రభుత్వంలో ఆరు విభాగాలకు కేటాయించిన 1.2 ట్రిలియన్ల డాలర్లలో అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖకు (పెంటగాన్‌) మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ అంటే 825 బిల్లియన్లు అందుతాయి. ఇతర ఆరు సమాఖ్య విభాగాలకు సంబంధించి బైడెన్‌ మార్చి 8న సంతకం చేసిన ప్రత్యేక బడ్జెట్‌ బిల్లులో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనర్జీ నిర్వహిస్తున్న అణ్వాయుధ కార్యక్రమాలకు ఉద్దేశింపబడిన 23.8 బిలియన్లు ఉన్నాయి. ఇతర విభాగాలు, ఏజెంట్ల ద్వారా సైనిక- గూఢచార కార్యకలాపాల కోసం చేసిన కేటాయింపులన్నింటినీ కలిపి లెక్కించినప్పుడు అమెరికా రక్షణ బడ్జెట్‌ మొత్తం 1 ట్రిలియన్‌ డాలర్ల మొత్తాన్ని అధిగమించే అవకాశం ఉంది. అయితే వాస్తవ సంఖ్య రహస్యంగానే ఉంటుంది. ఎందుకంటే సైనిక సంబంధిత వ్యయంలో ఎక్కువ భాగం నిఘా, సైనిక ఉపగ్రహ ప్రయోగాలు, ఇతర కార్యకలాపాలుగా వర్గీకరించబడి ఉంటుంది.
అమెరికా సైనిక వ్యయానికి సంబంధించి బహిరంగంగా లభించే గణాంకాల ఆధారంగా చూసినప్పటికీ అది అనూహ్య స్థాయిలోనే ఉంటుంది. మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో ఒక్క అమెరికా వాటానే 39 శాతం ఉంది. ఇది అమెరికా తరువాత అత్యున్నత స్థాయిలో సైనిక వ్యయం చేస్తున్న 11 దేశాల మొత్తం సైనిక వ్యయాన్ని కలిపిన దానితో సమానం. ప్రపంచ గణాంకాలు సమగ్రంగా అందుబాటులో వున్న 2022లో అమెరికా చేసిన సైనిక వ్యయం మొత్తం 877 బిలియన్లతో పోలిస్తే, చైనా 292 బిలియన్లు, రష్యా 86.4 బిలియన్లు తమతమ రక్షణ వ్యయంగా ఖర్చు చేసినట్లు స్టాక్‌హౌమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనా వేసింది.
అమెరికా, దాని మిత్ర దేశాల సైనిక వ్యయంతో పోల్చినప్పుడు రష్యా చేస్తున్న సైనిక వ్యయం నామమాత్రమే అని చెప్పకతప్పదు. అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి దేశాల 300 బిలియన్ల సంయుక్త సైనిక వ్యయం, ఆసియాలో అమెరికా మిత్రదేశాలు (క్వాడ్‌ అని పిలవబడే ఇండియా, జపాన్‌, ఆస్ట్రేలియా) చేస్తున్న 160 బిలియన్ల సైనిక వ్యయం, అలాగే మధ్యప్రాచ్చంలో అమెరికా కనుసన్నల్లో మెలిగే సౌదీ అరేబియా, ఇజ్రాయిల్‌, ఖతార్‌, యుఏఇ కలిపి చేస్తున్న -130 బిలియన్ల సైనిక వ్యయం- అంటే అమెరికా, దాని ప్రధాన మిత్రదేశాల సంయుక్త సైనిక వ్యయం అంతా కలిపి చూసినప్పుడు అది 1.5 ట్రిలియన్‌ డాలర్ల మొత్తాన్ని మించి ఉంటుంది. ఇది మొత్తం ప్రపంచంలోని సైనిక వ్యయంలో మూడింట రెండు వంతులుంటుంది.
రష్యా, చైనాల సంయుక్త సైనిక వ్యయం కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. ఈ స్థాయిలో అమెరికా, దాని మిత్ర దేశాలు చేస్తున్న సైనిక వ్యయం ప్రపంచ యుద్ధానికి సన్నద్ధం కావటంగా తప్ప మరోలా భావించలేము. సుదీర్ఘ
చారిత్రక క్రమంలో అమెరికన్‌ సామ్రాజ్యవాద ఆర్థిక స్థితి గణనీయంగా క్షీణించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 50 శాతంగావున్న అమెరికా వాటా 1960 కల్లా 40 శాతానికి, 1971 కల్లా 27 శాతానికి పడిపోయింది. ప్రెసిడెంట్‌ రిచర్డ్‌ నిక్సన్‌ చెల్లింపుల లోటు పెరుగుతున్న కారణంగా డాలర్‌ను బంగారంగా మార్చుకునే విధానాన్ని రద్దు చేశాడు. గత సంవత్సరం ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో అమెరికా వాటా కేవలం 15 శాతంగా వుంది. రాబోయే సంవత్సరాల్లో అది మరింతగా క్షీణిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే మానవ హనన ఆయుధాల ఉత్పత్తిలో, క్షణాల్లో పచ్చని జీవితాలను బూడిదగా మార్చగల కచ్చిత తత్వ క్షిపణుల సష్టిలో అమెరికాకు సాటిగానీ, దానికి సమీపంలోగానీ మరో దేశం లేదు.
క్షీణిస్తున్న అమెరికా ఆర్థిక స్థితి, అది చేస్తున్న భారీ సైనిక వ్యయం మధ్యగల ఈ వైరుధ్యం అమెరికా తన విదేశాంగ విధానంలో అనుసరిస్తున్న క్రూరత్వాన్ని వివరిస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను అధిగమించనున్న చైనాను దెబ్బ కొట్టే విషయంలోను, చైనా మిత్రదేశాలైన రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియాలను లొంగదీసుకోవటానికి ప్రయత్నించే విషయంలోను అమెరికాలోని రెండు ప్రధాన పెట్టుబడిదారీ పార్టీలైన డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం ఉంది. వీలైనంత త్వరగా చైనాను రెచ్చగొట్టి, ఆ దేశంతో ఘర్షణకు దిగాలని అమెరికా ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం, దాని రాజకీయ నాయకత్వం ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే మౌలిక ధోరణులు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయి. సమయం మించిపోతోంది. అమెరికా తన సైనిక బలగాలను ఉపయోగించడం పట్ల విముఖంగా ఉందని లేదా ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధ విస్తరణను నిరోధించడానికి ప్రయత్నిస్తున్నదని లేదా గాజాలో ఇజ్రాయిల్‌ చేస్తున్న మారణహౌమాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నదని బైడెన్‌ ప్రభుత్వం, అమెరికా కార్పొరేట్‌ మీడియా చెబుతున్న కట్టుకథలలో కనీస నిజాయితీ లేదనేది వాస్తవం.అమెరికా సామ్రాజ్యవాదం యొక్క నిజమైన క్రూరత్వం తాజాగా ఆమోదించబడిన పెంటగాన్‌ బడ్జెట్‌లోని ఒక ముఖ్య నిబంధనలో నిక్షిప్తమైవుంది. యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) కోసం అమెరికా చేస్తున్న సహాయంలో ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వ కూడదని కాంగ్రెస్‌లోని డెమొక్రాట్‌లు, రిపబ్లికన్లు నిర్ణయించారు. ఈ సంస్థ గాజాలోని 2.3 మిలియన్ల జనాభాతో సహా ప్రతిరోజూ మిలియన్ల పాలస్తీనియన్‌ శరణార్థులకు ఆహారం అందిస్తుంది. బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య ఎన్నికల సంవత్సరంలో పరస్పరం బురద జల్లుకోవటం ఎంతగా ఉన్నప్పటికీ సామూహిక ఆకలిని ఆయుధంగా మలచటంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఐక్యంగానే ఉన్నారు.