పాలస్తీనాపై అమెరికా ద్వంద్వ వైఖరి

America's Dual Position on Palestineపాలస్తీనాపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న మారణకాండపై అనుసరిస్తున్న గర్హనీయమైన వైఖరితో మిత్రదేశాలలో అసహ్యకర పరిస్థితిలో అమెరికా పడింది. జపాన్‌ రాజధాని టోక్యో నగరంలో మంగళ, బుధవారాల్లో జరిగిన జి7 కూటమి విదేశాంగ మంత్రుల సమావేశ తీరుతెన్నుల గురించి వెలువడిన విశ్లేషణల్లో ఇది ఒకటి. మొహం మీద ఛీ అంటూ ఉమ్మినా తుడుచుకొని పోయేవారికి సిగ్గూఎగ్గూ ఉండదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా ఈ కూటమిలోని దేశాల గతం, వర్తమానాన్ని చూస్తే దురాక్రమణ, యుద్ధాలు, నిరంకుశ శక్తు లకు మద్దతు, సాధారణ పౌరులు, మానవ హక్కు లను ఏడు నిలువుల లోతున పాతిపెట్టిన రక్తసిక్త చరిత్ర తప్ప మరొకటి కనిపించదు. ప్రతిరోజూ వందల మంది పిల్లలు, మహిళలు, ఏ పాపమూ ఎరగని సామాన్యులను బలితీసుకుంటున్న ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని ఖండిం చకుండా, తక్షణమే దాడులు నిలిపివేయాలని డిమాండ్‌ చేయకుండా మానవతా కారణాలతో విరామం పాటించా లని జి7 కోరింది. విన్నపాలు, వేడుకోళ్లు, కన్నీళ్లు చూసి కత్తిదించిన వేటగాడు చరిత్రలో ఎక్కడా కానరాడు. అప్పుడో గంటో ఇప్పుడో గంటో ఆపమంటే ఆపుతాం తప్ప పాలస్తీని యన్ల వేట ఆపేది లేదని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేసిన తరువాత ప్రపంచ ధనికదేశాల విఫల విన్యాసమిది.
రెండు దేశాలను ఏర్పాటు చేయాలన్న ఐరాస తీర్మా నాన్ని అడ్డుకుంటున్న ఇజ్రాయిల్‌ వైఖరి పట్ల గడచిన ఏడు న్నర దశాబ్దాలలో ఈ ధనిక దేశాలన్నీ మొత్తం మీద దానికి దన్నుగా నిలుస్తున్నాయి. అనేక సందర్భాలలో కొన్ని దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నంత మాత్రాన దుర్మార్గాన్ని వ్యతిరే కించినట్లు కాదు. పాలస్తీనియన్‌- ఇజ్రాయిల్‌ పౌరుల మీద జరుపుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని గత నెలలో ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మా నాన్ని జి7లోని ఫ్రాన్సు ఒక్కటే సమర్ధించింది. కూటమిలోని కెనడా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌, జపాన్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండగా అమెరికా వ్యతిరేకించింది. ఐరాసలో వ్యతిరేకించిన అమెరికా టోక్యో జి7 సమావేశంలో మానవతా పూర్వక కారణాలతో దాడులను నిలిపివేయాలని కోరటం ద్వంద్వ వైఖరికి పక్కా నిదర్శనం. ఉక్రెయిన్‌లో రష్యా అమలు జరు పుతున్న సైనిక చర్యను బేషరతుగా నిలిపివేయాలని కోరు తున్న పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉం దంటూ దాడులు జరపవచ్చని వెనకేసుకు వస్తున్నాయి. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకొని తమ వాకిట ముంగిట ఆయుధాలను మోహరించి తమ భద్రతకు ముప్పు తెస్తున్న కారణంగానే దాడులు తప్ప వేరు కాదని రష్యా మొత్తుకుంటున్నా పశ్చిమదేశాలు పెడచెవిన పెడుతు న్నాయి. పాలస్తీనా- ఇజ్రాయిల్‌ వివాదంలో పశ్చిమదేశాలు ముఖ్యంగా అమెరికా పెద్దఎత్తున ఆయుధాలను అందిస్తు న్నది. యూదు దురహంకారుల దాడులను హమాస్‌ ఎదు ర్కొంటున్నట్లు గానీ, దాని సాయుధులకు ఇతర దేశాలు ఆయుధాలు ఇస్తున్నట్లుగానీ ఎలాంటి రుజువులు లేవు. అసలు ప్రతిఘటనే లేదు, సామాన్య జనం, ఆసుపత్రులు, నిర్వాసితుల శిబిరాల మీద, ఐరాస సహాయ కేంద్రాల మీద 34 రోజులుగా ఇజ్రాయిల్‌ దాడులు జరుపుతున్నది. వాటిలో పదకొండువేల మంది పాలస్తీనియన్‌ పౌరులతో పౌరులతో పాటు 88 మంది ఐరాస సహాయ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఖండించ టానికి జి7కు నోరురాలేదు.
ఇజ్రాయిల్‌ జరుపుతున్న మారణకాండ మీద అమెరికా తో సహా అనేక దేశాల్లో పెద్దఎత్తున నిరసన వెల్లడి అవు తోంది. హమాస్‌ తీవ్రవాదులను అణిచివేస్తున్నామని చేస్తున్న ప్రచారం బూటకమని, గాజా ప్రాంతం మొత్తాన్ని మరుభూమిగా మారుస్తున్నారని, మరణిస్తున్నది అసహా యులైన పౌరులేనని రోజురోజుకూ తేటతెల్లం కావటంతో ఒత్తిడి పెరుగుతున్నది. జనాన్ని సంతుష్టీకరించేందుకు అమెరికా నాటకాలాడుతోంది. ‘అది మంచిది కాదు’, ‘ఇది తగదు’ అని ధర్మపన్నాలు వల్లిం చటం తప్ప ఇజ్రాయిల్‌ను నిలువరించేందుకు ఎలాంటి ప్రయత్నమూ లేదు. మధ్యధరా సముద్ర ప్రాంతానికి యుద్ధ ఓడలను పంపి, అరబ్బు దేశాలను రెచ్చగొడుతూ ఆ వివాదాన్ని మరింత రాజేయటం తప్ప మరొకపని లేదు. మారణ కాండను నివారించటంలో జి7 సమా వేశం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు కూటమిలో పెరిగిన దూరం, అపనమ్మకం కూడా వెల్లడైంది. ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కు కున్న పశ్చిమదేశాలు అమెరికా పాటలకు అను గుణంగా నృత్యం చేసేందుకు సిద్ధం కాదనే సం దేశాలు పంపుతున్నప్పటికీ అవి పూర్తిగా స్వ తంత్ర వైఖరిని తీసుకొనే స్థితిలో లేవు. ఇది ఒక్క పాలస్తీనా, మధ్య ప్రాచ్య ప్రాంతానికే కాదు యావత్‌ ప్రపంచశాంతికి ముప్పు తెచ్చే పరి ణామం. అందువల్ల పశ్చిమ దేశాల మానవ హక్కుల బూట కాన్ని ఎండగట్టేందుకు, వాటి మెడలు వంచి దారికి తెచ్చేం దుకు సకల శాంతి శక్తులు పూనుకోవాల్సి ఉంది.