శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడుల ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత వారంరోజుల వ్యవధిలోనే నాలుగు దాడి ఘటనలు జరగడం, అమర్‌నాథ్ యాత్రకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో భద్రతా చర్యలపై అధికారులతో ఆయన దాదాపు ఐదుగంటల పాటు సమావేశమయ్యారు. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉపయోగిస్తున్న సొరంగాలను గుర్తించాలని.. అదే సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. డ్రోన్ చొరబాట్లను సైతం సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పారు. సైన్యం, పారామిలిటరీ బలగాలు పరస్పర సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని షా సూచించారు. భద్రతాపరంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అందుకు అనుగు ణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కాబోయే ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజరు భల్లా, కేంద్ర నిఘా సంస్థ డైరెక్టర్ తపన్ దేకా, సిఆర్‌పిఎఫ్ డిజి అనీశ్ దయాళ్ సింగ్, బీఎస్‌ఎఫ్ డిజి నితిన్ అగర్వాల్, డీజీ పీఆర్‌ఆర్ స్వైన్ హాజరయ్యారు.