నవతెలంగాణ – ఓయూ
భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ ను అవమానించేలా పార్లమెంటులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రొఫెసర్ సౌఢ సవీన్ ఆధ్వర్యంలో ఓయూ ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రొ. సౌఢ సవీన్ మాట్లాడుతూ “బడుగు బలహీన వర్గాల జీవితాలను మార్చిన దేవుడు డా.బి.ఆర్. అంబేద్కర్. మేం అంబేద్కర్ ను తలుచుకుంటే అమిత్ షా కు భయమెందుకు. డా.బి.ఆర్. అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా భావిస్తున్నాం. నేడు భారత సమాజం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పదనాన్ని కీర్తిస్తుంటే ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ రాజకీయ పార్టీ బీజేపీ మాత్రం ఆయన గొప్పదనాన్ని తక్కువ చేసే కుట్రలు, ఆయన రాసిన భారత రాజ్యాంగాన్ని ఎత్తివేసే కుట్రలు, ఆయన కల్పించిన రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలు చేస్తున్నాయని, ఒక వైపు మోడీ ఛాయ్ వాలా ప్రధాన మంత్రి అయ్యాడంటే కారణం అంబేద్కర్ అంటుంటే, ఆయన మంత్రి వర్గంలోని వ్యక్తి మాత్రం అంబేద్కర్ ను అవమానించడం సిగ్గు చేటు. అమిత్ షాను మంత్రి వర్గం నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలి. పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రొ. కొండా నాగేశ్వర్, ప్రొ. మాయాదేవి, ప్రొ. కరుణ సాగర్, ప్రొ. కరుణ రూప్ల, ప్రొ. వనిత బాగ్డే, డా. యుగంధర్, డా. మంచాల లింగస్వామి, డా. రామేశ్వర్, డా. వెంకటేశ్వర్లు, డా. ప్రేమ్, అంసా నాయకులు నామ సైదులు, మంచాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.