అమిత్‌షాకు సీసీఐ నిరసన ఆందోళనకారుల అరెస్ట్‌

Amit Shah's CCI protest agitators arrested– సీసీఐ పున:ప్రారంభంపై స్పందించని నేత
– కేటీఆర్‌ను సీఎం చేసేందుకే కేసీఆర్‌ తాపత్రయమంటూ వ్యాఖ్య
– ఆదిలాబాద్‌ జనగర్జన సభలో కేంద్ర హోంమంత్రి
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటనకు ‘సీసీఐ’ నిరసన తాకింది. సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)ని తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ సీసీఐ సాధన కమిటీ నాయకులు ప్లకార్డులు, నల్ల బెలూన్లు పట్టుకుని, కండువాలు ధరించి నిరసన తెలిపారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం బీజేపీ జన గర్జనసభకు అమిత్‌షా హాజరయ్యారు. అయితే, ఇందిరా ప్రియదర్శిని మైదానం నుంచి డైట్‌ మైదానానికి అమిత్‌షా వస్తున్నారనే విషయం తెలుసుకున్న కమిటీ నాయకులు బాబూజగ్జీవన్‌రాం చౌక్‌లో ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చారు. సీసీఐని తెరిపిస్తామని సభలో ప్రకటన చేయాలంటూ నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అడ్డుకొని బండి దత్తాత్రి, అరుణ్‌కుమార్‌, బుట్టి శివకుమార్‌, వాగ్మారే ప్రశాంత్‌, స్నుజన్‌జెట్టి, అఖిల్‌, ఆసిఫ్‌, సోహెల్‌, రఘు, కలీంలను అరెస్టు చేసి మావల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సభలో అమిత్‌షా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కారు పార్టీ స్టీరింగ్‌ మజ్లీస్‌ చేతిలో ఉందని, ఎంఐఎంపై ఆధారపడి ఈ సర్కారు నడుస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేండ్ల నుంచి తన కొడును సీఎం చేసేందుకే తాపత్రయ పడుతున్నారని, ఆయనకు పేదలపై ఎలాంటి ప్రేమా లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచి మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రకటిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్థలం కేటాయించలేదని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ మంజూరైందని గుర్తుచేశారు. కృష్ణాజలాల అంశంపైనా పార్లమెంటులో మాట్లాడి పరిష్కరించినట్టు తెలిపారు. 75ఏండ్లలో ఆదివాసులు ఎప్పుడూ రాష్ట్రపతి కాలేదని, బీజేపీ తొలిసారి నిరుపేద ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిందని చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చాలా హామీలిచ్చారని కానీ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఆయన పేదల పనులు చేయరని, కేవలం ఆయన కుటుంబం కోసమే పనులు చేస్తుంటారని విమర్శించారు. ఈ సభలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజరు, ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మెన్‌ ఈటల రాజేందర్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.