అమిత్‌షా వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అన్ని వర్గాల ప్రజల కోసం రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై పార్లమెంట్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో ఉంటూ చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అమిత్‌షా చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన హోదాకు తగ్గట్టుగా లేవని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేశాన్ని మనువాదం వైపు నడిపించే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఆ స్థానంలో కొనసాగడానికి అమిత్‌షా ఏమాత్రం అర్హుడు కాదని తెలిపారు. ఈ వ్యాఖ్యలపట్ల రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.