గౌహతి: సీఏఏకి వ్యతిరేకంగా ప్రజల నిరసనలకు భయపడి కేంద్ర హౌంమంత్రి అమిత్ షా అసోం పర్యటనను రద్దు చేసుకున్నారు. మార్చి 15న అసోంలో జరిగే ఓ అధికారిక కార్యక్రమానికి ఆయన హాజరవ్వాల్సి ఉంది. అమిత్ షా పర్యటన రద్దయిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. మరోవైపు అసోంలో సీఏఏ వ్యతిరేక ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా విద్యార్థులు ఉద్యమంలోకి దిగారు. ఈ రోజు గౌహతి సహా పలు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి . ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మలను నిరసనకారులు దహనం చేశారు. శివసాగర్‌లో ఆందోళనకారులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు, అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీఏఏకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసింది. పార్టీ తరపున అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబ్‌బ్రత సైకియా, బార్‌పేట కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలేక్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. సీఏఏ అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో మూడు కేసులు దాఖలయ్యాయి. మార్చి 11వ తేదీ రాత్రి రూల్‌ను అమలు చేసిన మరుసటి రోజే డివైఎఫ్‌ఐ, ముస్లిం లీగ్‌లు కేసు వేశాయి. మూడు అంశాలను దష్టిలో ఉంచుకుని కేసు దాఖలు చేసినట్లు దేబ్‌బ్రత సైకియా సుప్రీంకోర్టులో పిటషన్ వేశారు. మొదటిది, సీఏఏ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తుంది. ఈ విభాగం సమానత్వ హక్కు గురించి మాట్లాడుతుంది. కానీ మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వాలనేది సీఏఏ ఉద్దేశం. రెండవది, సీఏఏ అసోం ఒప్పందాన్ని బలహీనపరిచింది. చాలా పోరాటాల తర్వాత 1985లో అస్సాం ఒప్పందం కుదిరింది. మూడవది, సీఏఏ ఆరు ముస్లిమేతర మతస్తులకు పౌరసత్వాన్ని అందిస్తుంది. ముస్లింలతో పాటు తమిళులు కూడా ఈ చట్టం నుంచి మినహాయించబడ్డారు. శ్రీలంక నుండి వచ్చిన తమిళులు కూడా ఈ చట్టం ప్రకారం పౌరసత్వానికి అర్హులు కాదు. రాజ్యాంగ విరుద్ధమైన, అస్సాం ఒప్పందాన్ని ఉల్లంఘించే ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని సైకియా తెలిపారు.
సంఫ్ పరివార్ డీఎన్‌ఎలోనే విభజన : బృందా కరత్
”విభజన అనేది సంఘ పరివార్ డీఎన్‌ఎలోనే వుంది. ఎన్‌ఆర్‌సీ (జాతీయ పౌర పట్టిక), సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)లు రెండూ భిన్నమైనవని, సీఏఏతో ఎన్‌ఆర్‌సీకి ఎలాంటి సంబంధం లేదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అర్ధ రహితం”. ”సంఫ్‌ు పరివార్ డీఎన్‌ఏలోనే ఈ విభజన వుంది. విభజన లేకుండా వారు మనుగడ సాగించలేరు. మతం పేరుతో ప్రజలను చీల్చడం, విద్వేషాలను వ్యాప్తి చేయడమే వారి జీవిత లక్ష్యం. భారత ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడమే వారి జీవిత పరమావధి. సీఏఏను ఆమోదించిన ఐదేండ్ల తర్వాత ఈ నిబంధనలను ఇప్పుడు తీసుకురావడంలోనే వారి దుర్బుద్ధి అర్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో వున్నాయనగా ఈ నిబంధనలను ఎందుకు తీసుకువచ్చారు?” అని ఆమె ప్రశ్నించారు.