హైదరాబాద్ : కృత్రిమ మేధా (ఎఐ) సాయంతో తమ ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలను అందిం చాలని నిర్ణయించామని ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ వెల్లడించింది. తమ బ్యాంక్ శాఖల్లో ఎఐ పవర్డ్ హోలో గ్రాఫిక్ డిజిటల్ అవతార్‌ను ప్రవేశ పెట్టినట్లు తెలిపింది. తొలుత ముంబయిలోని ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ జుహు శాఖలో ఈ సేవలను ప్రారంభించినట్లు వెల్లడించింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ రూపంతో ఇది హోలోగ్రామ్ లాగా కనిపించి వినియోగదారులకు సాయం అందించనుందని పేర్కొంది. బ్యాంకులో ఉండే హోలోగ్రాఫిక్ ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (హెచ్‌ఎక్స్‌ఆర్) పరికరం సాయంతో డిజిటల్ అవతార్‌తో నేరుగా సంభాషించొచ్చని పేర్కొంది. దీని ద్వారా బ్యాంక్ సేవలు, ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం పొందవచ్చని.. త్వరలోనే మరిన్ని శాఖల్లో ఈ ఎఐ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ హెడ్ శ్రీపాద్ షెండే తెలిపారు.