అగ్రజట్ల అమీతుమీ

Amitumi of the top teams– భారత్‌, దక్షిణాఫ్రికా ఢ నేడు
– ఆతిథ్య జట్టుకు సఫారీ కఠిన సవాల్‌
– మెగా పోరుకు సిద్ధమైన ఈడెన్‌గార్డెన్స్‌
– మ|| 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
– భారత్‌, దక్షిణాఫ్రికా.. ఐసీసీ 2023 ప్రపంచకప్‌ను శాసిస్తున్న జట్లు.
ఓ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్లతో ప్రత్యర్థులను చిత్తు చేస్తుండగా.. మరో జట్టు ఛేదనలో చెలరేగుతూ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తోంది. సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖాయం చేసుకున్న ఈ రెండు జట్లు నేడు ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆతిథ్య భారత్‌ ఎనిమిదో విజయంపై కన్నేయగా.. జైత్రయాత్ర కొనసాగించాలని సఫారీ ఎదురుచూస్తోంది. భారత్‌, దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌ నేడు.
నవతెలంగాణ-కోల్‌కత
ప్రపంచకప్‌కు మరింత ఊపొచ్చే మ్యాచ్‌ వచ్చింది. గ్రూప్‌ దశలో ఎదురులేని విజయాలతో సాగుతున్న ఆతిథ్య భారత్‌, దక్షిణాఫ్రికాలు నేడు సమరానికి సై అంటున్నాయి. వరుసగా ఏడు మ్యాచుల్లో గెలుపొందిన టీమ్‌ ఇండియా అజేయ రికార్డు కొనసాగించేందుకు చూస్తుంది. ప్రపంచకప్‌లో సరికొత్తగా కదం తొక్కుతున్న సఫారీలు సెమీఫైనల్స్‌కు ముంగిట అగ్రజట్టును ఓడించి ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసుకోవాలని అనుకుంటోంది. భారత్‌, దక్షిణాఫ్రికా కండ్లుచెదిరే ఆటతో అదరగొడుతున్నా.. ఈ రెండు జట్ల ఆట తీరు, వ్యూహం పూర్తి భిన్నం. దీంతో నేడు భారత్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత ఎక్కువైంది.
జోరుమీదున్న భారత్‌
ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో సమవుజ్జీని ఎదుర్కొవటం భారత్‌కు ఇది రెండోసారి. తొలుత ధర్మశాలలో అప్పటి అజేయ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించిన రోహిత్‌సేన.. ఆ జట్టు సెమీఫైనల్‌ రేసును అతలాకుతలం చేసింది. ఇప్పుడు ఈడెన్‌గార్డెన్స్‌లో సఫారీ సవాల్‌కు సిద్ధమైన టీమ్‌ ఇండియా.. ఆ జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తుందా? చూడాలి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా భారత్‌ జోరుమీదుంది. టాప్‌-5 బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ సైతం వాంఖడెలో 92 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కెఎల్‌ రాహుల్‌ పరుగుల వేటలో దూసుకెళ్తున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ సైతం ఓ మంచి ఇన్నింగ్స్‌తో ఫామ్‌ అందుకున్నాడు. నాణ్యమైన పేస్‌ బౌలర్లు కలిగిన దక్షిణాఫ్రికాను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మాయతో మెప్పిస్తున్నాడు. అతడిని ఆడేందుకు అన్ని జట్లు ఇబ్బందులు పడ్డాయి. పేసర్లు బుమ్రా, షమి, సిరాజ్‌ త్రయం మాటలకు అందని ఫామ్‌లో ఉంది. స్వింగ్‌తో చెలరేగుతున్న షమి.. ప్రత్యర్థుల గుండెల్లో నిద్ర పోతున్నాడు. తొలుత బ్యాటింగ్‌ చేసినా, లక్ష్యాన్ని ఛేదించినా రోహిత్‌సేన విజయంపై విశ్వాసంగా కనిపిస్తోంది.
సఫారీ జోరు సాగేనా?
ఏడు మ్యాచుల్లో ఆరింట గెలుపొందిన దక్షిణాఫ్రికా నేడు ఆతిథ్య జట్టును ఢకొీట్టనుంది. కెప్టెన్‌ తెంబ బవుమా ఫామ్‌ మినహాయిస్తే సఫారీ శిబిరం సూపర్‌గా కనిపిస్తోంది. ఆరంభంలో పేసర్లపై దండెత్తగల క్వింటన్‌ డికాక్‌, వాన్‌డర్‌ డుసెన్‌.. మిడిల్‌ ఆర్డర్‌లో స్పిన్‌పై చెలరేగే క్లాసెన్‌, మార్క్‌రామ్‌, డెవిడ్‌ మిల్లర్‌ దక్షిణాఫ్రికా సొంతం. ప్రపంచకప్‌లో అత్యంత ప్రమాదకర మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ లైనప్‌ దక్షిణాఫ్రికాదే. డెత్‌ ఓవర్లలో సఫారీ బ్యాటర్ల విధ్వంసం అసమానం. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని భారీ స్కోర్లు చేయటం సఫారీ సక్సెస్‌ మంత్ర. నేడు భారత్‌తో మ్యాచ్‌లోనూ అదే ప్రణాళిక అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కానీ భీకర భారత పేసర్లను ఎదుర్కొని దక్షిణాఫ్రికా బ్యాటర్లు పరుగుల వేటలో విజయవంతం అవుతారా? ఆసక్తికరం. మార్కో జెన్సన్‌ సఫారీ సరికొత్త పేస్‌ ఆయుధం. పవర్‌ప్లేలో ప్రతి 16 బంతులకు ఓ వికెట్‌ పడగొడుతున్న జెన్సన్‌ నేడు భారత టాప్‌ ఆర్డర్‌కు సవాల్‌ విసురుతున్నాడు. కగిసో రబాడ, లుంగిసాని ఎంగిడి సహా స్పిన్నర్లు కేశవ్‌ మహరాజ్‌, షంషిలు భారత్‌పై సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నారు.
పిచ్‌, వాతావరణం
ప్రపంచకప్‌ మ్యాచుల్లో ఈడెన్‌గార్డెన్స్‌లో భారీ స్కోర్లు నమోదు కాలేదు. ఇక్కడి పిచ్‌లు ప్రత్యేకించి పేసర్లు, స్పిన్నర్లకూ అనుకూలించలేదు. పేసర్లు మెరుగైన స్ట్రయిక్‌రేట్‌తో వికెట్లు కూల్చగా, స్పిన్నర్లు మెరుగైన ఎనాకమీ సాధించారు. మధ్యాహ్నాం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనుండగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడనుంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురిసే అవకాశం కనిపిస్తోంది. టాస్‌ నెగ్గిన జట్టు సొంత బలం ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందా? ప్రత్యర్థి ఇష్టపడని నిర్ణయాలు తీసుకుంటుందా? అనేది చూడాలి.
తుది జట్లు (అంచనా) :
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌.
దక్షిణాఫ్రికా : క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), తెంబ బవుమా (కెప్టెన్‌), వాన్‌డర్‌ డుసెన్‌, డెవిడ్‌ మిల్లర్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఎడెన్‌ మార్క్‌రామ్‌, మార్కో జాన్సెన్‌, జెరాల్డ్‌, కేశవ్‌ మహరాజ్‌, కగిసో రబాడ, లుంగిసాని ఎంగిడి.
ఎక్స్‌ ఫ్యాక్టర్‌
హార్దిక్‌కు గాయంతో తుది జట్టులోకి వచ్చిన మహ్మద్‌ షమి మూడు మ్యాచుల్లో 6.71 సగటుతో ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. కివీస్‌పై 5/54, ఇంగ్లాండ్‌పై 4/22, శ్రీలంకపై 5/18తో నిప్పులు చెరిగాడు. వరల్డ్‌ క్లాస్‌ స్వింగ్‌తో టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్న షమి.. నేడు సఫారీ బ్యాటర్లకు ముకుతాడు వేయటంలో కీలకం కానున్నాడు. అటు పవర్‌ప్లేలో, ఇటు డెత్‌ ఓవర్లలో షమి ఓవర్లు ప్రభావం చూపనున్నాయి.
క్వింటన్‌ డికాక్‌ వరల్డ్‌కప్‌లో శతక జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు సెంచరీలు బాదిన డికాక్‌.. కోల్‌కతలో మరో వందపై కన్నేశాడు. 112.6 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబడుతున్న డికాక్‌కు భారత్‌పై మంచి రికార్డుంది. టాప్‌ ఆర్డర్‌లో డికాక్‌ నిలిచి, మెరిస్తేనే లోయర్‌ ఆర్డర్‌ డెత్‌ ఓవర్లలో ప్రణాళికలు అమలు చేయగలదు. సఫారీ సక్సెస్‌ ఫార్ములా డికాక్‌ ప్రదర్శనపై ఆధారపడి ఉంది.