అమ్మ ఆదర్శ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ

– విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి
నవతెలంగాణ – ముత్తారం
అమ్మ ఆదర్శ పనుల్లో భాగంగా పెండింగ్ ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ అన్నారు. ముత్తారం మండలం దరియాపూర్ గ్రామంలోని మోడల్ పాఠశాలను శుక్రవారం అదనపు కలెక్టర్ సందర్శించారు. పాఠశాల పరిసరాలను, మరుగుదొడ్లను తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై వివరాలు అడిగితెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య, హాజరు శాతాన్ని రికార్డుల ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పనుల్లో భాగంగా చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. వర్షాకాల దృష్ట్యా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో సందర్శించారు. గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్, నర్సరీని పరిశీలించారు. హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికి 5 మొక్కలు అందించేలా చర్యలు చేపట్టాలని, గ్రామంలో ఎప్పటికప్పుడు మురికి కాలువల నిర్వహణ, దోమలు ప్రబలకుండా చూసుకోవాలని కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇఇ శ్రీనివాస్, ఎంపిఓ బైరి వేణు మాధవ్, పంచాయతీరాజ్ ఎఇ వరలక్ష్మి, గ్రామ కార్యదర్శి ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.