అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు

– మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
జిల్లాలో అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసినట్టు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, తాగు నీటి సరఫరా, పాఠశాలల మరమ్మతులు, సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌, ధాన్యం కొనుగోళ్ళు, సీఎంఆర్‌ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అభిషేక్‌ అగస్త్య, విజేందర్‌రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్‌ గౌతమ్‌ పాల్గొని మాట్లాడారు. బ్యాంక్‌ అకౌంట్స్‌ సెర్ఫ్‌, డీఆర్‌డీఏ ద్వారా చేయించినట్టు తెలిపారు. ఎస్టిమేషన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్టు వివరించారు. త్వరలో గ్రౌండింగ్‌ పూర్తవుతుందని కలెక్టర్‌ సీఎస్‌కు వివరించారు. గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో అత్యవసర పనులు వచ్చే విద్యా సంవత్సరంలోపు పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు అందించే వనరులను గుర్తించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తాగునీటి సరఫరా చేయాలన్నారు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలనీ, ఇప్పటికే ప్రారంభించిన సెంటర్స్‌ల్లో ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకోవాలని, సీఎంఆర్‌ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు, ఎండా కాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన విధంగా ప్రణాళికా ప్రకారం వైద్య, ఆరోగ్యశాఖ అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈవో విజయకుమారి, డీఆర్డీఏ పీడీ సాంబ శివరావు, డీపీఓ వెంకయ్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ టి.రఘునాథ స్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.