అమ్మ సాక్షిగా అడుగుతున్నా?

Amma asking as a witness?చనిపోయిన అమ్మకడుపున
శిశువుగా జన్మించాను
అనాధగా జీవితాన్ని ప్రారంభించి
జీవన పోరాటాన్ని మొదలుపెట్టి
విమానాల మోతల మధ్య
బాంబుల శబ్దాల మధ్య
నా జీవిత భవిష్యత్‌ చిత్రాన్ని
కండ్లు తెరుస్తూనే చూశాను
మాకంటూ సొంత నేల లేని
మా దేశమనే కాందిశీకుల
రాజ్యంలో ప్రపంచం సాక్షిగా
నేనీలోకంలోకి వచ్చాను
పాలిచ్చి ఎలా పెంచాలని
లాలింపులు ఎలా చేయాలని
మనసులో ఏమేమి అనుకుందో
ఎన్ని ఊసులు తనకి తాను
చేసుకుందో చెప్పుకుందో
మురిసిపోయిందో మా అమ్మ
నాకు అవేవీ తెలియదు
ఈ మానవలోకంలో
ఒక అమానవీయ చర్యతో
నా తల్లి నాకు దూరం కాగా
తన కొడుగ్గా పుట్టిన నేను
నా ముందున్న బతుకు
ఎలా ఉండనుందో ఊహించలేని
రెండు రోజుల బాలుణ్ణి
మా బతుకులు మా సొంతం కాదు
అవి మూణ్ణాళ్ల ముచ్చటలే
అమ్మ సాక్షిగా
అడుగుతున్నా ఈ ప్రపంచాన్ని
మాకు తోడుంటారా అని….

– జంధ్యాల రఘుబాబు
9849753298
(గాజాపై ఇజ్రాయిల్‌ బాంబుదాడిలో
అమ్మ చనిపోయిన, బిడ్డకు జన్మనిచ్చిన
అల్‌-కుర్ద్‌కు నివాళిగా)