– డీఈవో సుసింధర్ రావు
– గడ్డంమల్లయ్యగూడ, మాల్ ఎంపీపీఎస్ పాఠశాలలను సందర్శించిన డీఈవో
నవతెలంగాణ-రంగారెడ్డిడెస్క్
అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపికైన స్కూల్లో మౌలిక వసతుల కల్పన పనులను వెంటనే పూర్తి చేయాలని సుసింధర్ రావు కోరారు. గురువారం యాచారం మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడ, మాల్ ఎంపీపీఎస్ పాఠశాలలను డీఈవో సందర్శించారు. అనంతరం పాఠశాలల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ప్రధానో పాధ్యాయులకు ఆదేశించామన్నారు. మండల పరిధిలోని ఆయా పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించినట్టు తెలిపారు. ఈ పనుల్లో ఎటువంటి అలసత్వం జరగకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ పాఠశాలలన్నీ సిద్ధంగా ఉండాలన్నారు. ఈ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే, చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జగన్నాథ్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.