నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్, హాసాకొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం క్రింద జరుగుతున్న పనులను జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అంకిత్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు.బషీరాబాద్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న విద్యుదీకరణ పనులను పరిశీలించారు. మండలంలోని 18 పాఠశాలలకు నిధులు మంజూరు కాగా 17 పాఠశాలలను ఇదివరకే పనులు ప్రారంభమయ్యాయని ఎంపీడీవో రాజ శ్రీనివాస్ అడిషనల్ కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30లోగా అన్ని పాఠశాలలలో పనులను 100శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నతమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద ఈ కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేపట్టడం జరుగుతుందని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. మహిళా సంఘ సభ్యులతో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ పనులను దగ్గరుండి పర్యవేక్షణ చేయాలని ఈనెల 30వ తేదీలోపు పనులన్నీ వందశాతం పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తులు యూనిఫామ్ పనులను కూడా జూన్ 12 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం హసకొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న విద్యుదీకరణ పనులను, టాయిలెట్ పనులను సందర్శించారు.ఈ పనులన్నీ సకాలంలో పూర్తయ్యలా చూడాలని ఎంపీడీవో రాజ శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఏఈ శ్రీనివాసులు, ఐకెపి ఏపిఎం కుంట గంగాధర్ లను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ వెంట తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాసులు, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఏపిఎం కుంట గంగాధర్, సీసీలు నవీన్, భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, నరసయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.