అమీబా…హైడ్రా…మట్టి గణపతి

Amoeba...Hydra...Mud Ganapatiనేను..మిత్రుడు యాదగిరి అడవిలోకి పోక చాలా రోజులయింది అనుకొని దగ్గరలో ఉన్న జన్నారం పోదామనుకొని బయలుదేరాం. మేము పూర్తిగా లోపలికి పోము కాని చీకటి పడేలోగా బయటకు వచ్చేయాలని మిత్రులు చెప్పిన మాట బాగా గుర్తు పెట్టుకొని పోతూ ఉన్నాం. అడవిలోని అందాలను, అంటే ఇంకా కొద్దో గొప్పో మిగిలినవి, మిగిలినవి అంటే తప్పూ, మిగిలించినవి. మానవులు ఎక్కడ కాలుపెడితే అక్కడ వినాశనమే అని మా మిత్రుడు చెప్పే మాటలు గుర్తొస్తున్నా యి. అయితే అందరు మానవులు నాశనం చేసేవారే కాదు ఈ ప్రపంచానికి మంచి చేసే వాళ్లూ ఉన్నారని మిత్రుడు పేర్లతో సహా వాళ్లు చేసిన మంచితో సహా చెబుతాడు వినేవాళ్లుంటే.
ఎదురుగా ఓ విచిత్ర జీవి, ఇంతలో హఠాత్తుగా ఒక పెద్ద ఆకారం, మనిషెత్తు ఉంది ఒక రూపం లేదు, చేతులు, కాళ్లు, తల, మొండెం ఇలా ఎలాంటి అవయవాలు లేవు.అయినా ముందుముందుకొస్తోంది స్పీడుగా, కోపంతో ఉన్నట్టుంది, బుసలు కొట్టినట్టు శబ్దం వినిపిస్తోంది కాని నోరు, ముక్కు లేవు మరి ఆ సౌండు ఎక్కడినుండి వస్తోందో సమఝౌతలేదు. అది మా వైపే వస్తోంది, మేము కొద్దిగా నిదానంగా నడుస్తున్నాం, పారిపోదామంటే కూడా భయంగా ఉంది. అసలు అదొక్కటే ఉందో ఇంకా తన వాళ్లు అంటే అలాంటి జీవాలు ఉన్నయేమో అన్న భయం లోలోన ఉంది. ఎక్కడినుండి అలాంటి జీవులు ఎక్కువ సంఖ్యలో వచ్చి మీదపడి చంపేస్తాయోనన్న అనుమానం, గందరగోళం. ఇంతలో అది ‘ఆగండి, భయపడకండి.. నేను మిమ్మల్నేమీ చేయను’ అనింది. మాకు ఆశ్చర్యంతో పాటు రకరకాల ఫీలింగులు కలిగాయి. అసలు ఆ జీవీ మాట్లాడుతుందని, అందులోనూ తెలుగులో మాట్లాడుతుందని తెలియదు. ఇంతకు అది స్త్రీ జంతువా, పురుష జంతువా అని కూడా తెలీకుండా ఉంది. మంచిదా, మంచోడా లేక చెడ్డదా, చెడ్డోడా అనుకుంటూనే మమ్మల్ని తినకపోతే చాలునని లోలోన అనుకుంటున్నాము. కొన్ని మాటలు బయటికే అనేస్తున్నాము.
అది మళ్ళ్లీనోరు విప్పింది, అయితే మాకు నోరెక్కడా కనిపించలేదు. తనే మళ్లా ఇలా చెప్పింది ”నేను అమీబాని” అని. ఎప్పుడో బడిలో చదువుకున్న అమీబా ఇలా మాకెదురై మట్లాడుతుందని అనుకోనే లేదు. ఆ పాఠం చెప్పిన మా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు నరసింహరావు సారు గుర్తొచ్చారు. అమీబా మన పూర్వ అవతారమని, అది ఏకకణ జీవి అంటే మొత్తం శరీరం ఒకే కణమని, దానికి కాళ్ళు చేతులూ ఉండవని, ఒక ముద్దలా ఉంటుందని, కదలడానికి ఒక మిద్యాపాదాన్ని తానే తయారు చేసుకొని దాన్ని ముందుకు చాపి అందులోకి తన ముద్దలాంటి పదార్థాన్ని పంపించి, మళ్లీ ఇంకో మిధ్యా పాదాన్ని తయారు చేసి అదే విధంగా తన పార్థాన్ని అందులోకి ంపించి అలా అలా ముందుకు పోతుందని సారు చెప్పిన ిషయాలు ఒక్కొక్కటీ గుర్తొస్తున్నాయి.
అమీబా తరువాత హైడ్రా గురించి చెప్పాడు సారు. అయితే అది కొద్దిగా అభివృద్ధి చెందిన జీవి. దానికి ఒకే కణం కానుండా ఎక్కువ కణాలుంటాయి అంటే బహుకణ జీవి అది. దాని శరీరం ఒక స్టెం అంటే కాండం మీద నిలబడి ఉంటుంది, దానికి టెంటకిల్స్‌ అంటే టెంటకిలములు అనే చేతులు, కాళ్లు లాంటి అవయవాలుంటాయి. వాటిని ముందుకు పంపి వాటి మీద నిలబడి, కాండాన్ని పైకెత్తి మళ్లీ ముందుకు వంచి పెట్టి దానిపై నిలబడుతుంది. అలా ముందుకు ముందుకు పోతుంటుంది. అది ఏకకణ జీవి కావచ్చు, బహుకణ జీవి కావచ్చు చలనమే జీవానికి ముఖ్యసూత్రం అని సారు చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. ఇంతలో ఆ అమీబా మళ్లీ మాట్లాడింది, హైడ్రాకంటే ముందు పుట్టిన నన్ను వదిలేసి మీరు అక్రమ కట్టడాలను పడగొట్టే పనికి హైడ్రా అని పేరు పెట్టుకుంటారా, ఎత అన్యాయం? అందుకే నేను మీపై దాడి చేయడానికే వస్తున్నాను అంది. యాదగిరికి, నాకు భయమేసింది. పారిపోవడానికి లేదు, అక్కడే ఉండడానికీ లేదు. చెప్పండి ఎందుకలా చేశారు? అనేసరికి ఇంక సమాధానం చెప్పాల్సిందే, లేకుంటే మమ్మలిద్దరినీ మింగేస్తుందన్న భయంతో నోరు విప్పాల్సి వచ్చింది. ‘అది కాదు అమీబా గారూ, హైడ్రా అంటే మీ తరువాత పుట్టిన ఆ హైడ్రా కాదు, ఇది హైదరాబాదు పేరుతో ముడిపడి ఉంది. హైదరాబాదు నగరాన్న వరదలు, తుపానులు, భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలనుండి కాపాడే సంస్థ అది. అందుకే హైడ్రా అన్న పేరు పెట్టాము కాని ఇంకోలా అనుకోవద్దు’ అని చెప్పేసరికి అది కొద్దిగా శాంతించి నట్టుంది, ఆ బుసబుసలు ఆగిపో యాయి. ‘అయినా అమీబా అని మీ పేరొచ్చేలా పెట్టల్సింది, బాగుంది మీ పేరు. మా ముఖ్యమంత్రికి చెప్పి పేరు మార్చే ఏర్పాటు చేస్తాము అమీబా గారు’ అనేసరికి అది కొద్దిగా శాంతించింది.
‘మాటలు బాా నేర్చారు మీ మానవులు’ అనింది. ‘మీరూ మాట్లాడుతున్నారుగా’ అన్నాడు యాదగిరి. ‘నేను మీదగ్గర నేర్చుకున్నవే అవి’ అనింది అమీబా. ‘అయినా ఈర్ష్యా, అసూయలు ఇవి మీకు కూడా ఉన్నాయా, అందుకే మాకూ వచ్చాయన్నాడు’ యాదగిరి. ‘ఎవరినుండి ఎవరికొచ్చాయన్నది కాదు, కాని ఇప్పుడు సరిచేయవలసినవి చూడండి’ అంది అమీబా. అవును అవును అని వెనుకనుండి మాటలు వినిపించాయి. ఒక హైడ్రా, తన టెంటకిలములతో పల్టీలు కొట్టుంటూ వస్తోంది. ‘నీవూ వచ్చేశావా’ అనింది అమీబా, ‘అవునంది’ హైడ్రా. ‘ఇకనుండైనా చెరువుల్లో, కాలువల్లో, నదుల్లో ఇండ్లు కట్టొద్దు. ప్రభుత్వ స్థలాలని ఆక్రమించొద్దు. దానివల్ల మీకే ఇబ్బంది. మీరే వరదల్లో మునిగిపోతారు. మరీ ముఖ్యంగా వరదలొచ్చినప్పుడు నువ్వా నేనా అని ఒకరినొకరు విమర్శించుకోవద్దు, మీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకుల్లాగ. అక్కడ కేరళలో చూడండి ముఖ్యమం్రి ఇలాంటి సమయాల్లో అన్ని పార్టీల నాయకులని తన వెంట తీసుకుపోతారు, వాళ్లూ వస్తారు. ఎన్నికలప్పుడు మాత్రమే వాళ్ల పోట్లాటలు. ఇక్కడ ఐదేళ్లూ ఎన్నికల ప్రచారంలాగే సాగిపోతున్నాయి. ఇంకో ముఖ్య విషయం, వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను మాత్రమే పెట్టండి. లేదంటే ఇప్పటికే కాలుష్యంతో ఉన్న ట్యాంకుబండు, ఇతర చెరువుల్లో ఇంకా కాలుష్యాన్ని పెంచొద్దు. అడవుల్ని నరికితే ఇతర జంతువులు, మాతో పాటు మరూ పోతారు. మేము జాగ్రత్తగా పెంచి పోషించిన ఈ భూమిని మీ తరువాత తరాలకు మంచి కానుకగా ఇవ్వండి. అంతే కాని వేడెక్కి పోయిన భూమిపై వాళ్లు కష్టాలు పడేలా చేయొద్దు’ అంది అమీబా. నిజంగానే యాదగిరి, నేను అమీబా తెలివికి ఆశ్చర్యపోయాము. ఇక చీకటయిందని వాటికి సెలవు చెప్పి ఇంటికి బయలుదేరాము. ‘మీ జీవితాలు చీకటిమయం కాకుండా చూసుకొండి అంది మళ్లీ’. ఆ ఏకకణ జీవికే ఈ భూమండలంపై అంత బాధ్యత ఉంటే మరి మనుషులకెత ఉండాలి అనుకుంటూ మేము ఇల్లు చేరాం.

– జంధ్యాల రఘుబాబు
9849753298