– ఆటో ఎక్స్‌పోలో ప్రధానీ మోడీ
– 100 ఆవిష్కరణలు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద వాహన ప్రదర్శన అయినా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్ సంబరంగా ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని భారత మండపం, ద్వారకలోని యశోభూమి, గ్రేటర్ నోయిడాలోని ఢిల్లీ అండ్ ఇండియా ఎక్స్‌పో సెంటర్ అండ్ మార్ట్‌ల్లో సమాంతరంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. భారత మండపంలోని ఎక్స్‌పోను శనివారం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హెచ్‌డి కుమారస్వామి, జితన్ రామ్ మంన్జీ, మనోహర్ లాల్, పియూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరితో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ లాంచనంగా ప్రారంభించారు. జనవరి 22వ తేది వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో వివిధ కంపెనీలు దాదాపు 100 కొత్త కార్లను ఆవిష్కరించనున్నాయి. వాహన తయారీదారుల నుంచి ఆటోమొబైల్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, టైర్లు, ఇంధన స్టోరేజీ వ్యవస్థల తయారీదారులు, ఆటోమొబైల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు, మెటీరియల్ రీసైక్లింగ్ చేసే సంస్థల వరకు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.
ఇటీవల మరణించిన టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా, సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఒసము సుజుకి భారత ఆటోమొబైల్ రంగానికి విశేష సేవలను అందించారని ప్రధానీ గుర్తు చేసుకున్నారు. దేశంలో ఈ రంగం వృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. దేశంలో పెరుగుతున్న మధ్యతరగతి, పట్టణీకరణ వేగవంతం, మౌలిక వసతుల అభివృద్ధి, మేక్ ఇన్ ఇండియా వాహనాలు ప్రధానంగా ఆటో రంగ వృద్ధికి మద్దతును ఇవ్వనున్నాయన్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు, మౌలిక వసతుల కోసం రూ.11లక్షల కోట్ల వ్యయం చేసిందన్నారు. 5,100 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటాయని అంచనా. ఈ ప్రదర్శనను భారత్ సహా ప్రపంచ దేశాలకు చెందిన 5 లక్షల మంది సందర్శించే అవకాశం ఉంది. పరికరాల ప్రదర్శనలో 60 కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు జరగనున్నాయి.