ఆమ్ర కుంజ్‌

Amra Kunjసరిగ్గా నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళి
కలకత్తా చేరితే ఇరవై మూడేళ్ళ వయసును
హుషారుగా ధరించి దరిదాపు బెంగాలీ ఛాయతో
ఆ తెలుగు కుర్రాడగుపడ్డాడు యాత్రానేత్రాలతో-

ఇంటర్‌ లో పరిచయమైన ‘గోరా’ తలపో
Where the mind is without fear పిలుపో
బెంగాల్‌ సహవాసంలో దర్శన కుతూహలమో
‘ఎక్ల చొలో ఎక్ల చొలో ఎక్ల చొలే రే’ గీతమో
ఏది కదిపిందో గానీ
అతనొక ఆదివారం ఉదయాన ఇద్దరు మిత్రులతో
కాంచనగంగా రైలూ
గుర్రపు బగ్గీ సాయంతో
గీతాంజలి స్వప్నవాటికను
చేరుకున్నాడు

నాలుగడుగులు నడిచాడో లేదో
అతనికి
ఒక డెబ్బయేళ్ళతను
తెలుపు అనుభవపు వెలుగుతో కనిపించాడు
చేతుల ప్రేమతో ఓ తోట కంచెను సరిచేస్తూ-

రవీంద్రుని సన్నిధిలో చిన్న నాట మెదిలిన
ధన్యత తనదని మెత్తని జ్ఞాపకం నవ్వుతో
పరిచయం చేసుకున్నాడు,
పేరు- షుకుమారు మిత్రా-
ఆ కుర్రాడినీ అతడి మిత్రులనీ
ఆప్యాయంగా తోడ్కొని
పరిపక్వమైన చూపుతో
కొంచెం నెమ్మది నడకతో
శాంతినికేతన్‌ ప్రాచీన ఛాయలలో
కలియతిప్పుతూ
రవీంద్రుని పాదజాడల దారులనూ రాగాలనూ
కళాస్థలాలనూ చిత్ర రేఖలనూ
తన్మయానందంతో
చూపాడు నిదానంగా,
మాటల కాంతిని జోడిస్తూ-

ఓ వైపు స్మతివనంలా వున్న చెట్ల విడిదికి
తీసుకెళ్ళాడు- అది ‘ఆమ్ర కుంజ్‌’ !
దాని నీడల్లో చదువులు పాదుకున్నాయని
అక్కడే టాగూర్‌ కవితలనూ పూయించాడని
తెలుసుకున్న కుర్రాడు ఉత్తేజ చిత్తుడై
అక్కడే ఒక చెట్టు నీడలో
విధేయ విద్యార్థిలా ధ్యానిలా కూర్చుని
అప్పటికప్పుడు ఒక కవితనల్లి మురిపెంగా
దానికి ‘మామిడి తోపు’ అనే మకుటాన్నిచ్చాడు

లేకా వున్నట్లున్న రవీంద్రుడు తనకొసగిన కానుకే
ఆ కవిత అని కుర్రాడనుకున్నాడు
ఆ అమతవేళలో!
ఆ తర్వాత కూడా అనేక వేళల్లో!

సజలకాంతుల షుకుమారు మిత్రాకు
వందన పుష్పాలనందజేసి
అతని కరస్పర్శనూ పొంది
మరి కాసేపు ఆ శాంతిగీతాల నెలవులో తిరిగి
ఆ కుర్రాడు మిత్రులతో వెనుదిరిగాడు
పాదాలకందిన ప్రాచీన గ్రంధాల స్పర్షానుభూతితో
రవీంద్రుడినే కలిసినంత లలితానందంతో!

ఆ పిదప పెద్దవాడవుతూ అవుతూ ఎక్కడెక్కడో
కూర్చుని కవితలను కూర్చుకున్న ప్రతి వేళలోనూ
అతనికి
మామిడి తోపు నీడలో కూర్చుని
రాసుకున్న కుర్రాడు
గురుతుకొస్తూనే వున్నాడు అప్రయత్నంగా!

(నాడు శాంతినికేతన్‌లో నాతో పాటు పర్యటించిన మిత్రులు మహదేవశాస్త్రికీ, మల్లికార్జున రెడ్డికీ)

– దర్భశయనం శ్రీనివాసాచార్య,
94404 19039