విభిన్న పాత్రల్లో, అబ్బురపరిచే నటనతో దశాబ్ద కాలంగా రంగస్థల కళాకారిణిగా రాణిస్తున్నారు సోమిశెట్టి అమృతవర్షిణి. ఇటు బుల్లితెర అటు వెండితెరపైనా తన అభినయంతో ప్రేక్షకులను తన్మయులను చేస్తున్నారు. రంగస్థలంలో కళాకారిణిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సృజనాత్మకతను ప్రదర్శిస్తున్నారు. కథానాయికగా, తల్లిగా, విలన్‌గా, మహారాణిగా .. ఇలా అనేక పాత్రల్లో నటించారు. పాత్ర ఏదైనా విభిన్నంగా ఆవిష్కరించాలని తపిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
గుంటూరు నగరానికి చెందిన అమృతవర్షిణి కళాకారిణిగా రాణించటానికి భర్త సోమిశెట్టి మధుసూదన చక్రపాణి కూడా ఎంతో సహకరిస్తున్నారు. ఎంబిఎ (హెచ్‌ఆర్), హిందీ లాంగ్వేజ్ పండిట్ (హెచ్‌పిటి) పూర్తిచేసిన ఆమె ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీలో ఎంఎ థియేటర్ ఆర్ట్స్ రెండో ఏడాది చదువుతున్నారు. తనకు నచ్చిన రంగస్థలంలో కళాకారిణిగా రాణించాలని నిర్ణయించుకున్నారు. 2014 జూన్‌లో నాటక రంగ ప్రవేశం చేయటానికి తొలి గురువు చెరుకూరి సాంబశివరావు సహకరించారు. పౌరాణికంలో నిభానుపూడి సుబ్బరాజు ఓనమాలు దిద్దించారు. కాకినాడకు చెందిన డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ స్టేజ్‌పై నటనలో మెళకువలను నేర్పించారు. పలు సాంఘిక, పౌరాణిక, జానపద నాటికలు, నాటకాల్లో ఆమె నటనా ప్రతిభకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరుప్రఖ్యాతులు వచ్చాయి.
తాతయ్య స్ఫూర్తితో…
అమృత వర్షిణి తాత ములుగు వీరభద్రరావు ప్రముఖ రంగస్థల నటులు. ఆయన్ని స్ఫూర్తితోనే ఈమె నాటకరంగంలోకి ప్రవేశించారు. రామాంజనేయయుద్ధంలో రాముడు, కురుక్షేత్రంలో కృష్ణుడు, కార్యవర్థి బాలనాగమ్మ, చింతామణిలో బిళ్వమంగళుడు, భవానీశంకరుడు, భక్త కన్నప్పలో కైలాస్‌నాథాశాస్త్రిగా వీరభద్రరావు నటించారు. అమృత తల్లి విజయదుర్గ కూడా రంగస్థలంలో ప్రతిభాశాలి. గతంలో ఆమె చంద్రమతి, చింతామణి వంటి నాటకాల్లో నటించారు. రేడియో ఆర్టిస్ట్‌గానూ పనిచేశారు. అమృత వర్షిణి పౌరాణికం ‘పాదుక’లో కైక, ‘యయాతి’లో దేవయాని, భక్తకన్నప్పలో ‘నీలా’, హరిశ్చంద్రలో ‘చంద్రమతి’, బాలనాగమ్మలో ‘బాలనాగమ్మ’, ఝాన్సీ లక్ష్మీభాయిలో ‘ఝాన్సీ’, మాధవరంలో ‘గుండమ్మ’గా నటించారు.
నటిగా గుర్తింపు
ఈటీవీలో ప్రసారమైన మనసు- మమత సీరియల్‌లో తల్లిపాత్రలోనూ, వసంత కోకిలలో కన్నింగ్ క్యారెక్టర్‌లోనూ నటించారు. అలిపిరిలో అల్లంత దూరంలో సినిమాలోనూ తల్లి పాత్రలో కనిపించారు. బతక నివ్వండి, బృందావనం, ఇంకెన్నాళ్లు, బంగారుబాట, ఇంటింటి కథ, అష్టపది, కిడ్నాప్, హరిశ్చంధ్ర, చింతామణి, పాదుకాపట్టాభిషేకం, యయాతి, సౌందర్య భారతం, అక్షయ, మరో దేవాలయం, యాది, హర్షరుతువు, ఉయ్యాలా, అనుబంధం, నాగూడు, స్వర్ణకమలాలు, ప్రక్షాళన తదితర నాటకాల్లో నటించారు. యాదిలో యాదమ్మ క్యారెక్టర్, గోమాలక్ష్మిలో వెంకటలక్ష్మి క్యారెక్టర్, బృందావనంలో సంధ్య, కొత్తలో అక్షయగా బాగా గుర్తింపు పొందారు. సౌందర్య భారతంలో రోసి క్యారెక్టర్ చేశారు. వైఎస్ కృష్ణేశ్వరరావు, విద్యాసాగర్, వంకాయ సత్యనారాయణ, నాయుడు గోపి, గోపరాజు విజరు, తుళ్లూరు మధు, మునిపల్లె విద్యాధర, గుడివాడ సత్యనారాయణ, వెనిగళ్ల సాంబిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన నాటికల్లోనూ అమృత నటించారు.
అమృతలహరి థియేటర్ ఆర్ట్స్‌తో…
2022లో అమృతలహరి థియేటర్ ఆర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్‌ను స్థాపించి ప్రముఖ రచయిత తాళబత్తుల వెంకటేశ్వర రావు సహకారంతో ‘నాన్న నేను వచ్చేస్తా’ అనే నాటికను 70 సార్లు ప్రదర్శించారు. ఈ బృందంలో ఉన్న పూర్ణసత్యం, విసిహెచ్ ప్రసాద్, కత్తి శ్యామ్‌ప్రసాద్, ఎకెడి హాసన్, వై.సాయితేజ, ఇ.భాగ్యరాజ్, ఎల్.అనిల్, జి.లహరి సహకారంతో ముందుకు సాగుతున్నారు. హర్ష క్రియేషన్స్ అండ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్‌లో ట్రెజరర్‌గా, పిఎంకెఎం ఫైన్ ఆర్ట్స్ సంస్థకు జనరల్ సెక్రెటరీగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అవార్డులు
అమృత వర్షిణి తన నటనకు గాను పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. పరిషత్‌లలో ఉత్తమ నటి, సహాయనటి, హాస్యనటి, భోగాపురం కళా పరిషత్ ద్వారా నట విదూషీమణి బిరుదు అందుకున్నారు. 2014లో గరుడ సౌందర్యభారతం నాటిక ఉత్తమ నటిగా, 2016లో యాది నాటికలో యాదమ్మ క్యారెక్టర్‌కు గరుడ ఉత్తమ నటితో పాటు నంది అవార్డు కూడా ఈ నాటికలో వచ్చింది. అదే ఏడాది యయాతి పద్యనాటకంలో దేవయాని పాత్రకు ఉత్తమ ద్వితీయ నటి గరుడ అవార్డు అందు కున్నారు. అలాగే 2022లో జమునా రాయులు స్మారక పురస్కారం, 2018లో కళారంజని పరిషత్ భీమవరం వారి మహానటి సావిత్రి అవార్డు, వీణ అవార్డ్స్ యయాతి పద్యనాటకంలో సహాయనటి, పాదుకా పట్టాభిషేకంలో సహాయనటి, 2024లో జైజవాన్-జై కిసాన్ పరుచూరి కళాపరిషత్ ఉత్తమ నటి, భోగాపురం కళాపరిషత్ ద్వారా నటవిదూషీమణి పురస్కారాలు అందుకున్నారు.
– యడవెల్లి శ్రీనివాస్
యువత ముందుకు రావాలి
టెక్నాలజీ ఎంత విస్తరిస్తున్నా, సినిమా కొత్తరూపం తీసుకున్నా నేటికీ నాటకరంగానికి ఆదరణ ఉంది. అలాంటి నాటక రంగంలో నిష్ణాతులైతే ఏ రంగంలోనైనా రాణించొచ్చు. అందుకే యువత ఇంకా ముందుకు రావాలి. నాటకం ఒక తల్లి బిడ్డకి సంస్కారం నేర్పినట్లు…మనం ఎలా బతకాలో నేర్పిస్తుంది.
– సోమిశెట్టి అమృతవర్షిణి.