
నవతెలంగాణ- తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం దట్టమైన అటవీ ప్రాంతంలోని బంధాల గ్రామపంచాయతీ లోని ఏజెన్సీలో, మేడారం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతున్న 15 సంవత్సరాల ఆగబోయిన సంధ్య కు ఇటీవల జబ్బు చేసింది. ఈ ఆదివాసి చిన్నారి చిన్నతనంలోనే తండ్రి ఆగబోయిన నారాయణ మృతి చెందాడు. తల్లి ఆగబోయిన కళ, వారి తల్లిదండ్రుల ఇంటి వద్దనే (బంధాల) కూలీ, నాలి చేసుకుంటూ జీవనం సాగించుకుంటూ పిల్లలను చదివించుకుంటుంది. ఈ తరుణంలో గత సంవత్సరం ఆగబోయిన సంధ్య అనే ఈ పాపకు అనారోగ్యం పాలయింది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రికి కూడా వైద్యం చేయించారు. అసలు ఏమి జబ్బు అనేది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. భూత వైద్యం, చేతబడి వైద్యం చేయిస్తూ, ఆ ఆదివాసి విద్యార్థిని ప్రాణాపాస్థితికి చేరుకుంది. ఆదివాసి ఈ విద్యార్థిని మంచం నుండి లేవలేని స్థితిలో ఉంది. వైద్యాధికారులు, సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పేదరికంలో మగ్గుతున్న ఆ విద్యార్థిని ఆధునిక మంచి వైద్యం అందించి, మూఢనమ్మకాలపై అవేర్నెస్ కల్పించి, ఆ ఆదివాసి విద్యార్థిని ప్రాణాలను కాపాడాలని ఆదివాసి గిరిజనులు, గ్రామస్తులు కోరుతున్నారు.