మొదటిచూపులోనే ఎదను దోచేసిన అమ్మాయి అందం గురించి ఎంతో చెప్పాలనిపిస్తుంటుంది. ఆ అమ్మాయి గొప్పతనాన్ని చెప్పడానికి మాటలు సరిపోకపోతే పాటల్లో, కవితల్లో చెప్పాలనిపిస్తుంటుంది. అలాంటి అందమూ, అణకువ ఉన్న అమ్మాయిని గురించి వర్ణిస్తూ రాసిన పాట ఇది. 2023లో చెందు ముద్దు దర్శకత్వంలో వచ్చిన ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ సినిమాలో శ్రీనివాసమౌళి రాసిన ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
శ్రీనివాసమౌళి ప్రతిభావంతుడైన సినీకవి. నేడు సినీరంగంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఎలాంటి సన్నివేశానికైనా అలవోకగా పాటలు రాయగల తీరు ఇతనిది.. అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాలో ఆయన రాసిన ‘రంగమ్మా ఓ నా రంగమ్మా’ పాట సూపర్ హిట్ అయి అందరి మన్ననలందుకుంది. ఇపుడు ఆ పాటను చూద్దాం.
తొలిచూపులోనే అమ్మాయిని చూడగానే అబ్బాయిలో కలిగిన తీయని పరవశమే ఈ పాట.. పులకింతలతో ఉక్కిరిబిక్కిరై ఆమె చేసిన మాయను గురించి పాట రూపంలో చెబుతున్నాడిక్కడ అబ్బాయి.
కంటిచూపు ఎప్పుడైతే నిన్ను చూసిందో అప్పటి నుంచి ఇక నిన్నే చూడాలని సంబరపడుతుంది. ఏ దశ్యాన్ని చూడడానికి ఇష్టపడడం లేదు. నిన్ను చూసిన కంటిచూపు నిన్ను వదిలిపోనంటుంది. కారణం అనిర్వచనీయమైన నీ అందం.. ఆ అందం వల్ల నాలో కలిగిన ఆనందం కూడా అనిర్వచనీయమేనని అతని భావన.. నీ అందమైన రూపం నాలో నిండిపోయి ఏవో కొంటె ఆశలు నాలో చెలరేగాయి.. గుండెలో మంట పెట్టింది నీవే.. అంతలోనే మందు పూసి చల్లార్చింది నీవే.. అంటున్నాడు. అలజడి కలిగించింది ఆమెనే.. ఉపశమనం ఇచ్చింది కూడా ఆమెనే.. అని అతని అభిప్రాయం. గుండెను దొంగిలించి జడతో గంట కొట్టిన మాయ కూడా ఆమెదేనని అంటున్నాడు. ఓ రంగమ్మా.. మాయలు చేసి చల్లగా జారుకోకుండా నన్ను ఒకసారి ఇటు చూడమ్మా అంటూ హీరో ప్రేమతో వేడుకుంటున్నాడు.
ఆమెలోని లేత అందాలు అతనికి ఎన్నో సరదాలను నేర్పించాయి. ఆమె చూసే దొంగ చూపులు అతనిలో కలవరం కలిగిస్తుంది. రేయంతా నిద్ర లేకుండా చేస్తుంది. దిగులు కలిగిస్తుంది. ఆమె ఊసులు జడివానలా కురిసి తనను నిలువునా ముంచేస్తున్నా యంటున్నాడు. ఆమె ఊసులను జడివానగా అభివర్ణించడం వినూత్నంగా ఉంది.
ఊహ ఆమెను చుట్టుకున్నదేమో? ఏదో పిచ్చి పట్టిందేమో? చుట్టూ చూసినా, ఎటూ వెళ్లినా లోకమంతటా ఆమెనే కనబడుతుందతనికి. అతనికి ఏం అర్థమవ్వని పరిస్థితి. అయోమయంలో మునిగి తేలుతున్నాడు. ఇది ప్రేయసి చేసిన మాయ.. ఆమె తొలిచూపు చేసిన వింత గారడి.. అది అతన్ని నిలకడగా ఉండనివ్వడం లేదు. తపనల సవ్వడులతో చెలరేగేలా చేస్తుంది.
అతడు ఆమెను చూసినప్పటి నుంచి తలకిందులైపోతున్నాడు. అందుకే పైనుండాల్సిన నింగి కాళ్లకిందున్నదా? అని అనుమాన పడుతున్నాడు. కాళ్ల కింద ఉండవాల్సిన నేల ఉట్టికెక్కి ఎగిరిపోతుందేమో అనిపిస్తుందతనికి.. ఇప్పటిదాకా లేని కొత్త మత్తు ఏదో అతని నెత్తికెక్కి తొక్కినట్టుగా ఉందతనికి.. ఆమెనే లోకంగా భావించి, ఆమెకే దాసోహంగా మారి ఏకమవ్వాలనే తపనతో తానున్నానని ఆమెతో చెబుతున్నాడు..
ప్రేయసి చూపులు చేసే మాయను గురించి ఎంతో కవితాత్మకంగా చెప్పాడు శ్రీనివాసమౌళి.
పాట
కంటిచూపు నిన్నే తాకి పోనంటుదమ్మా/ కొంటె ఆశలేవో రేగి అదిరిందే బొమ్మా/ మంటే పెట్టావమ్మా మందే పూశావమ్మా/ గుండె కాజేసి జడగంట కొట్టావమ్మా/ రంగమ్మా ఓ నా రంగమ్మా/ ఇటు చూడమ్మా../ రంగమ్మా..ఓ నా రంగమ్మా/ ఇటు చూడమ్మా/ నీలోని పరువాలు నేర్పాయి సరదాలు/ ఇక చాలు దోబూచులు/ నిదరేది నాకసలు రేయంత ఓ దిగులు/ జడివాన నీ ఊసులు/ ఊహ నిన్ను చుట్టిందా/ పిచ్చిగాని పట్టిందా/ చుట్టు ముట్టి లోకం నిండా నువ్వే పిల్లా/ నింగి కాలికిందుందా/ నేల ఉట్టికెక్కిందా/ కొత్త మత్తు నెత్తెక్కి తొక్కిందే ఇలా/ నువ్వు నా లోకమై నేను దాసోహమై/ ఏకమవుదాము లోకముతో పనిఏంటమ్మా/ రంగమ్మా ఓ నా రంగమ్మా/ ఇటు చూడమ్మా/ రంగమ్మా.. ఓ నా రంగమ్మా/ ఇటు చూడమ్మా..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682