రెండు మనసుల తనివితీరని వయసు పాట

An age song of two mindsపరుగులు తీసే వయసు ఉన్న ఓ జంట పాడుకునే ఆనందపుగీతమిది. ఎంతగా ప్రేమించుకున్నా, ఎంతగా చూసుకున్నా, కలుసుకున్నా తనివితీరక తపనతో ఉంటారు. ఆ తపనను పాటగా పాడుకుంటుంటారు. రెండు నిండు మనసుల్లోని ఆ వలపుపాటను అక్షరాలా అద్భుతంగా ఆవిష్కరించాడు శ్రీమణి. ‘రంగరంగ వైభవంగా'(2022) సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.. 
శ్రీమణి నేటి మేటి గీతరచయిత. సినీరంగ ప్రవేశం చేసిన అనతికాలంలోనే అలుపులేని గీతరచయితగా గుర్తింపు పొందాడు. ప్రేయసీప్రియులు పాడుకునే వలపుగీతాలను ఇది వరకే ఆయన ఎన్నో రాశాడు. అయినా – ఈ పాట ప్రత్యేకమైంది. ప్రేమికులు కలుసుకున్నప్పుడు ఇదివరకు లేని పులకింత కలుగుతుంది. ఎక్కడ లేని ఆనందం, తెలియని ఉల్లాసం కలుగుతుంది. ఎందుకో చాలా కొత్తగా అనిపిస్తుంటోంది అని పాడుకుంటారు. నిజానికి కొత్తగా తొలివలపులో అడుగులేసిన జంట నుంచి, ఎన్నో ఏళ్ళుగా ప్రేమించుకుంటున్న జంటవరకు అందరూ ఇలాగే అనుకుంటారు. ఎందుకంటే ఎన్నిసార్లు కలుసుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇంకా కొత్తగానే ఉంటుంది కాబట్టి.
అయితే – ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. ప్రేయసీ ప్రియులు కొత్తగా లేదేంటి అంటూ పాడుకుంటున్నారు. అంటే .. ప్రేమ కొత్తగా లేదా? ప్రేమ ప్రత్యేకం కాదా? అన్న సందేహం కలుగొచ్చు. కాని అందులోని ఆంతర్యమేమిటంటే.. ప్రేయసీప్రియులు కలుసుకున్నపుడు కలిగే కొత్తదనం, హాయిదనం ఏదైతే ఉందో అది వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు కూడా పొందుతూనే ఉన్నారు.
అందుకే.. హీరో కొత్తగా లేదెందుకు? మనం ఎంత దగ్గరున్నా కొత్తగా అనిపించడం లేదు. అని అంటే.. ఎందుకు ఉంటుంది. ఎంతదూరంలో ఉన్నా నువ్వు నేను ఒక్కటిగానే ఉన్నాం కాబట్టి మనకు కొత్తగా అనిపించదు. అని సమాధానమిస్తుంది ప్రేయసి. అంటే.. మనం దగ్గర ఉంటేనే ఒక్కటిగా ఉన్నట్టు కాదు. దూరంగా ఉన్నా కూడా ఒక్కటిగానే ఉన్నట్టు అని భావన.
నేనెక్కడో ఉన్నా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంది కదా! అని హీరో అంటే నిద్రలో మాత్రమే నేనున్నా నా కలలన్నీ నీ వద్దనే ఉన్నాయి అని ప్రేయసి అంటుంది. మనం ఒకరై ఒకరికొకరై కలిసి ఉన్నాం కదా! పేరుకే ఇద్దరం కనిపిస్తాం కాని తరచిచూస్తే ఒక్కరే అనిపిస్తాం. అందుకే – మనకు కొత్తగా అనిపించడం లేదని ఇద్దరూ సమర్థించుకుంటారు. కొత్తగా అనిపించకపోవడానికి కారణమేమిటో హీరో మనసుకు తెలుసు. అది ప్రేయసి నోటినుంచి వినాలన్న ఆశ మాత్రమే. ఇద్దరి మనసుల్లో తనివితీరనంత ప్రేమ ఉందన్న విషయం వారి మాటల్లో, ఈ పాటలో స్పష్టంగా తెలుస్తుంది.
గుండె కొట్టుకుంటే వచ్చే శబ్దంతో ముద్దు పెట్టుకునేటపుడు వచ్చే శబ్దం పోటీపడ్డాయట. ఎంత లోతైన భావన ఇది. ఈ పోటి హద్దుదాటింది. అంటే – పరవశాలతీరం దాటేసింది. అయినా కొత్తగా అనిపించడం లేదెందుకని హీరో అంటే – సెకనుకో కోటికలలు కన్నాం మనం. అంత గాఢంగా ప్రేమించుకున్నాం. దానితో పోల్చి చూస్తే ఇది చిన్నదేగా. అందులో గొప్పేముంది అంటుంది ప్రేయసి. ఎంతో ఏకాంతం మన సొంతమే అయినా కొత్తగా లేదెందుకు? అని హీరో అంటే – ఎంత పెద్ద లోకమో మన మధ్యలో ఉన్నా ఎప్పుడైనా అడ్డుగా అనిపించిందా? అని ప్రేయసి బదులిస్తుంది. ఎన్ని ఏకాంతాలకైనా సరే అందనంత హాయిని వాళ్ళు ప్రతి క్షణం చవిచూస్తూనే ఉన్నారని ఇక్కడ అర్థం. ఏ లోకాలు మన మధ్యలో ఉన్నా మనకు అడ్డుకాలేవన్నంత గాఢమైన ప్రేమతత్త్వంతో వారున్నారు.
ప్రేమ అంటేనే చాలా చాలా కొత్తగా ఉంటుందని చెబుతుంటారు. ప్రేమ ఒక వింత మైకాన్నిస్తుంది. ప్రేమ ఏదో తెలియని గుబులుని కలిగిస్తుంది. నిన్నే నీకు సరికొత్తగా పరిచయం చేస్తుందని చెబుతుంటారు. కాని అదే ప్రేమ ఎప్పుడూ నా పక్కనే ఉన్నా నాకు కొత్తగా అనిపించడం లేదని హీరో తన తీయని సందేహాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రేమ నిరంతరం పక్కనే ఉంటే ప్రతీక్షణం కొత్తగా అనిపిస్తూ ఉండాలి కదా! అన్నది హీరో సందేహం. దానికి బదులుగా – నువ్వు మొదటి అడుగు వేసే పసిపాపవా? కాదు కదా! ప్రేమలో తొలి అడుగులు వేసినవాళ్ళకు అది వర్తిస్తుంది. ఇంత దూరం నడిచాక, ఎంతో ప్రేమానుభూతిని పొందాక, అనుభవం వచ్చాక కూడా ఇంకా నడకలో తడబాటుంటుందా? ఉండదు కదా! అని ప్రేయసి చెబుతుంది. అతడడిగిన కొంటె ప్రశ్నకు ఆమె ఇచ్చిన మరింత కొంటె సమాధానం ఔరా! అనిపించేలా ఉంటుంది.
ఎన్నేళ్ళనుంచో ఎదురుచూస్తున్న సమయమిది. మనం నిరంతరం కలిసి ఉన్నా ఎప్పుడూ అల్లరల్లరిగా కొట్టుకోవడమే కాని ఇలాంటి ప్రణయానుభూతిని పొందింది లేదు. గొప్ప రసానుభూతిని పొందిన సమయమిదే మొదటిసారి కదా! అయినా ఎన్నేళ్ళుగానో ఎదురు చూస్తున్న ఈ క్షణం మనకు కొత్తగా అనిపించడం లేదెందుకు? అని హీరో అడిగిన ప్రశ్నకు ఎందుకంటే ఏ క్షణం మనం విడిపోమనే నమ్మకముంది కాబట్టి మనకు కొత్తగా అనిపించడం లేదు. అందులో పెద్ద వింతేముంది? అన్న ప్రేయసి సమాధానం ఇరువురి ప్రేమ శాశ్వతమన్న భావనను స్పష్టం చేస్తుంది. ఈ చివరి పంక్తుల్లో వాళ్ళిద్దరి ప్రేమ అమరమన్న సత్యం స్పష్టమవుతుంది.
పాట:-
కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి/ ఎంత దగ్గరున్నా నువ్వు నేను కొత్తగా లేదేంటి/
ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైనా నువ్వు నేను ఒక్కటే కాబట్టి/
మనిషినెక్కడో ఉన్నా మనసు నీ దగ్గరే/ నిదురలో నేనున్నా కలలు నీ వద్దకే/
ఒకరికొకరై కలసి లేమా ఇద్దరం ఒకరై ఒకరై/
గుండె సడి తోటి ముద్దు సడి పోటి/
హద్దుదాటిందే అయినా కొత్తగా లేదేంటి/
సెకనుకో కోటికలలు కనలేదేంటి/ దానితో పోల్చి చూస్తే ఇందులో గొప్పేంటి/
ఎంత ఏకాంతమో మన సొంతమే అయినా కొత్తగా లేదేంటి/
ఎంత పెద్ద లోకమో మన మధ్యలో/ అయినా ఎప్పుడు అడ్డుగుందేంటి?/ కొత్తగుంటుంది ప్రేమ అంటారే/ పక్కనుందీ ప్రేమే అయినా కొత్తగా లేదేంటీ/
మొదటి అడుగేసే పాపవా నువ్వు/ ఇంత నడిచాకా నడకలో తడబాటుంటాదేంటి?/
ఎన్నినాళ్ళ వీక్షణం ఈ క్షణం/
అయినా కొత్తగా లేదేంటి?/ ఎందుకంటే ఏ క్షణం విడిపోం మనం అని నమ్మకం కాబట్టి..
– డా||తిరునగరి శరత్‌ చంద్ర, sharathchandra.poet@yahoo.com