ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రకటన చేయాలి

– డీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్‌ ముదిరాజ్‌
నవతెలంగాణ-పరిగి
రేపు జరుగబోయే కేబినెట్‌ భేటీలో ఆర్టీసీని ప్రభుత్వలో సం పూర్ణంగా విలీనం చేస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని డీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్‌ ముదిరాజ్‌ అన్నారు. శనివారం ఆయన మాట్లాడు తూ..ఆదివారం జరుగబోయే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్‌ అసంపూర్తిగా వదిలేసిన ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ డేట్‌ అఫ్‌ అపాయింట్మెంట్‌ను ప్రకటించా లన్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు వేతన సవరణలను, రావల్సిన బకాయిలను చెల్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రివర్గం కీలక ప్రకటన చేసి ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడం సంతోషిస్తూ ఆ టికెట్‌ ఇచ్చే విధానంలో ఇబ్బందులను కూడా తొలగించాలని ముఖ్యమం త్రికి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా కాంగ్రెస్‌ ప్రజా పాలన తెలంగాణలో ఏర్పాటు అయినప్ప టి నుండి సీఎం రేవంత్‌ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వలో విలీనంపై, పెండింగ్‌లో నున్న 2 పీఆర్సీసీ లపై, 43 వేల మంది ఆర్టీసీ కార్మికులు ప్రతి రోజు ఎంతో ఆతృతతో, ఆశతో ఎదురు చూస్తున్నరన్నారు. 10 ఏండ్లలో యావత్తు ఆర్టీసీ కార్మికులకు మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన మోసానికి ఇప్పటికీ ఆర్టీసీ కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతూ కోలుకోవడం లేదని పేర్కొన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక సమస్యనూ వెంటనే పరిష్కరించి ఆర్టీసీ కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు. అదేవిధంగా రావలసిన బాండు డబ్బులు, 173 నెలల డీఏ ఏరియర్స్‌, ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత సైతం కల్పించ వలసిందిగా కోరారు.