క్షమాపణ

an apologyమన మనసు నొప్పిస్తారు.. బాధపెడతారు.. ఏడిపిస్తారు.. వెక్కివెక్కి ఏడ్చేలా చేస్తారు.. చివరకు క్షమాపణ కూడా చెప్పరు! తప్పంతా మనదేనని మనకి మనమే అనుకునేలా.. ఎక్కడెక్కడో తిరిగి మనమే మళ్ళీ వారి చుట్టూ చేరేలా చేసుకుంటారు. స్నేహితుల దగ్గర నుంచి ప్రేయసి, ప్రేమికుడు వరకు ఇలాంటి వారు మన జీవితంలో ఎంతోమంది ఎదురవుతారు. అయితే వీరిలో కొందరు జీవితాన్ని అస్తవ్యస్థం చేసే తప్పులు చేస్తారు. మన జీవితమే తలకిందులయ్యే పరిస్థితిని తీసుకొస్తారు. అయినా క్షమించాల్సిందేనా? తిరిగి వారిని జీవితంలోకి ఆహ్వానించాల్సిందేనా? ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి జీవితంలో కచ్చితంగా ఎప్పుడో ఓ అప్పుడు వస్తూనే ఉంటాయి.
ఇలాంటప్పుడే మనకు ఓ క్లారిటీ ఉండాలి. క్షమించడానికి, సయోధ్యకు మధ్య చాలా తేడా ఉంది అని గుర్తించాలి. ఇది తెలియక చాలామంది జీవితంలో చేసిన పొరపాట్లే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. ఒకరి కారణంగా ఎంతో వేదన అనుభవించి మళ్ళీ వారి గూటికే చేరతారు. ఇది ఎంత మాత్రం సరైనది కాదు అంటున్నారు నిపుణులు. క్షమించడం వేరు.. సయోధ్య వేరు. చాలామంది క్షమించడానికి అర్థం తిరిగి ప్యాచ్‌ అప్‌ అవ్వడం అనుకుంటారు. ఇక్కడే జీవితం మళ్లీ అగాధంలోకి వెళ్తుంది.
ఒక వ్యక్తిగా ఎదగడానికి, మానసికంగా ధృడంగా మారడానికి క్షమించడం చాలా అవసరం. ఇది మానసిక నిపుణులు నిత్యం చెబుతున్న మాట. ఎందుకంటే క్షమించడం వల్ల పగ, ప్రతీకారం లాంటి ఆలోచనలు పోతాయి. ఇది మన మనసును తేలిక చేస్తుంది, శాంతపరుస్తుంది. క్షమించడం మన మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్షమాగుణానికి మించిన గుణం ఈ ప్రపంచంలో లేదని అందుకే చెబుతుంటారు. అయితే ఈ క్షమాపణ సంబంధిత వ్యక్తితో సయోధ్యకు దారితీయకూడదు.
క్షమించడమన్నది మన అంతర్గత ప్రక్రియ. మనం క్షమించామని సంబంధిత వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు. అవతలి వ్యక్తి మనకు హాని తలపెట్టినప్పుడు వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూడడం మన మానసిక ఆరోగ్యాన్ని నెగిటివ్‌గా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి ప్రతీకార ఆలోచనలు మన ఎదుగుదలకు అదిపెద్ద ఆటంకాలు. మనసంతా పగతోనే నిండి ఉంటే ఏ పనీ ముందుకు కదలదు. ఏ పని మీదా మనం ధ్యాస పెట్టలేం. అలా అని అవతలి వ్యక్తి సారీ చెప్పాలన్న ఆలోచన కూడా రావాల్సిన అవసరం లేదు. క్షమాపణ అడగడం మంచి విషయమే.. ఇది ఎవరూ కాదనలేని నిజం. అయితే ఆ క్షమాపణ కోసం ఎదురుచూడడం సంకుచిత మనస్తత్వానికి చిహ్నం. క్షమాపణ చెప్పినా చెప్పకున్నా మన కోసం మనం సంబంధిత వ్యక్తిని క్షమించి తీరాల్సిందే. అప్పుడే మనకు ఆనందం.. ప్రశాంతత!
ఒక వ్యక్తిని క్షమించాలి అనుకున్నప్పుడు అవతలి వ్యక్తి నుంచి క్షమాపణ వచ్చే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మనమే మనస్ఫూర్తిగా క్షమించాలి అంటే ఆ ఆలోచన ఉండాలి. ఈగో సమస్యలా చూడాల్సిన అవసరం లేదు. క్షమించే స్వేచ్ఛ మనదే.. అది మన చేతులోనే ఉంటుంది. సయోధ్య మన చేతిలో లేదని తెలుసుకోండి. అది రెండు వైపుల నుంచి రావాలి. క్షమించేశా కదా అని సయోధ్యకు ప్రయత్నిస్తే అది మొదటికే మోసం వస్తుంది. ఈ విషయంపై పూర్తి అవగాహన ఉంటే మన ప్రశాంతతను ఎవ్వరూ భగం చేయలేరు. మన ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు.