నిండు జీవితానికి క్షమాపణ చెప్పిన పాట

An apology song for a full lifeతప్పులు అందరూ చేస్తారు. కాని చేసిన తప్పులకు పశ్చాత్తాపపడడం లేదా క్షమాపణలు చెప్పుకోవడం అనేది కొందరే చేస్తారు. అప్పుడే చేసిన తప్పును సరిదిద్దుకున్నట్లవుతుంది. చిన్నతప్పులయితే తొందరగా సరిదిద్దుకోవచ్చు. కాని పెద్ద తప్పులైతే సరిదిద్దుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాని కొన్ని సందర్భాల్లో చేసిన తప్పును కప్పి పుచ్చి చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే మన దృష్టిలో అది చిన్న తప్పు. కాని మనకు తెలియకుండానే అది పెద్ద తప్పై, ఎగిసిన నిప్పై మండుకుంటున్నప్పుడు ఆ తప్పును, ఆ నిప్పును కప్పిపుచ్చలేకపోతాం. అలా ఒక అమాయకురాలి నిండు జీవితానికి మనస్సాక్షిగా చెప్పే క్షమాపణలనే పాటగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశాడు. ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
సినిమా సన్నివేశానికి సరిగ్గా సరిపోయే పదబంధాల్ని పొదిగి పాట రాయడంలో సీతారామశాస్త్రి ఘనాపాటి. ఆయన రాసిన పాట సన్నివేశానికి ఎంత ఇంపుగా ఉంటుందంటే ఒక్కోసారి దర్శకులు చెప్పిన సందర్భానికి మించి గొప్పగా పాట రాస్తాడు. ఆ పాటను ఆధారంగా చేసుకుని దర్శకులు సందర్భాన్ని, సన్నివేశాన్ని మరింత ఇంపుగా, సొంపుగా సరిచేసుకుంటారు. అంత పకడ్బందీగా పాటను అల్లడం ఆయనకే సాధ్యం. అలాంటి ఓ గొప్ప పాటను ‘పెళ్ళికానుక’ (1998) సినిమా కోసం సీతారామశాస్త్రి రాశాడు.
సినిమా సన్నివేశం ప్రకారం చూసినట్లయితే కథానాయిక భారతీయ సంస్కృతిని గౌరవించే అమ్మాయి. ఆమె పల్లెటూరులో ఉంటుంది. పల్లె జీవనవిధానమంటే ఆమెకెంతో ఇష్టం. ఆమె అమాయకురాలు. కల్మషం లేని మనసు, స్వచ్ఛమైన చిరునవ్వు ఆమెది. అలాంటి అమ్మాయిని విదేశాల్లో ఉన్న అబ్బాయికిచ్చి పెళ్ళిచేయడానికి నిశ్చయించుకుంటారు. కారణం వారికి ఆ కుటుంబంతో దగ్గరి బంధుత్వం ఉండడమే. కాని, పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి, దుర్వ్యసనాలకు అలవాటుపడ్డ నీచుడు ఆ పెళ్ళికొడుకని అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియదు. కథానాయకుని మిత్రుడే ఇక్కడ ఆ పెళ్ళి కొడుకు. కథానాయకునికి తన స్నేహితుడు మరీ విషసంస్కృతికి అలవాటు పడి దిగజారిపోయాడన్న విషయం తెలియదు. ఏవో చిన్న చిన్న తప్పులు చేశాడని తెలుసు. అందుకే వాటిని సర్దిచెబుతూ అతడిని సమర్ధిస్తూ వస్తాడు. ఆ అమ్మాయి కథానాయకునికి మంచి స్నేహితురాలవుతుంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆ అమ్మాయికి నగర వాతావరణం అలవాటు చేయాలనే ఉద్దేశ్యంతో ఏ పాపమెరుగని అమ్మాయిని ఢిల్లీ తీసుకువెళ్తారు అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులు. అక్కడికి వెళ్ళాక అసలు విషయం, ఆ అబ్బాయి నిజస్వరూపం బయటపడుతుంది. కథానాయకునికి కూడా అప్పటిదాకా తన స్నేహితుని నిజస్వరూపం తెలియదు. ఇప్పుడు తిరిగి ఆ అమ్మాయిని వాళ్ళ ఊరికి పంపించేద్దామనుకుంటే పరిస్థితి అనుకూలించదు. అలాంటి సందర్భంలో కథానాయకుడు తనను తన స్నేహితురాలు ఎక్కడ అపార్థం చేసుకుంటుందోనన్న బాధతో కుమిలిపోతాడు. ఏం చేయాలో తోచక ఆమెకు మనస్సాక్షిగా క్షమాపణలు చెబుతూ ఈ పాట పాడతాడు.
చేసిన తప్పుకు ఆమెను మన్నించమని వేడుకుంటాడు. ముద్దమందారంలా, అమాయకమే సింగారంలా ఉన్న ఆమెను మోసగించి తీసుకొచ్చిన ఈ పాపపు గాలిని, చల్లని జాబిలిలాగా పైకి కనిపించి, తెరమాటున నిప్పులు వెదజల్లిన ఈ జ్వాలని, కమ్మని కథలు చెప్పి, కలలు కనేలా చేసి కాళరాత్రిలాంటి ఈ నరకకూపంలో వదిలేసినందుకు క్షమించమని ప్రాధేయపడుతుంటాడు. ఇక్కడ అమ్మాయి పేరు గంగ. ఆమె వ్యక్తిత్వం కూడా అంత పవిత్రమైనదనే ఉద్దేశ్యంతో చెబుతున్నాడు. ఆ ‘గంగ’ను సముద్రంలాంటి ఈ కుటుంబంలో కలుపుదామని తీసుకొచ్చారు. కాని గంగను కలిపినంత మాత్రాన సముద్రపు నీరులోని ఉప్పు, చేదు పోవు కదా! అని పశ్చాత్తాపపడుతుంటాడు. తేనె చినుకుతో తోడు పెట్టినంత మాత్రాన ఎలాంటి తేడా కనిపించదు కదా! తన మిత్రుని చిన్నతప్పులని ఈ గంగ వచ్చి సరిదిద్దగలదనుకున్నారు. కాని అవి క్షమించలేనంత పెద్ద తప్పులని తెలిశాక ఆమె జీవితమే ఇక్కడ బలైపోతుందని గ్రహించలేకపోయారు. ఇది అటు తెలియక చేసిన తప్పవుతుంది. ఇటు తెలిసీ తెలియక చేసిన తప్పూ అవుతుంది. మధ్యలో ఆమె జీవితం కన్నీరు మున్నీరవుతుంది. అమృతం లాంటి ఆమె హృదయాన్ని ఎప్పటికీ ఇంకిపోని ఉప్పు నీటితో నింపినందుకు మా నేరాన్ని క్షమించు అంటూ మౌనంగా వేడుకుంటున్నాడు. అక్కడామె ఎటూ వెళ్ళలేని పరిస్థితిలో రోధిస్తుంది.
మల్లెపువ్వులాంటి ఆమెను ఎడారిలాంటి ఈ కుటుంబంలో పెట్టినంత మాత్రాన వసంతం రాదు కదా! ఎలాంటి మంచి, మమత, మార్పు లేనటువంటి జీవితాలివి. తులసిలాంటి ఆమెను అడవిలాంటి ఈ ఇంటిలో పెట్టినంత మాత్రాన అది పెరడైపోతుందా? ఈ విషయాన్ని గ్రహించలేకపోయామని బాధపడతాడు కథానాయకుడు.
పారాణి పాదాలతో మెరుస్తూ, పచ్చనిపంటలకు రాణిగా కనిపించే ఆ అమ్మాయిని రాతి హృదయాల ఆ కోటకు బలి చేసినందుకు తమ పాపాల్ని క్షమించమని వేడుకుంటాడు కథానాయకుడు.
ఈ పాట గుండెల్ని తడిచేస్తుంది. ఎంతో హృదయవిదారకంగా ఉంటుంది. పాట వింటున్నంతసేపు, సన్నివేశం చూస్తున్నంతసేపు కళ్ళు చెమ్మగిల్లుతాయి. కన్నీటి దశ్యానికి అక్షరరూపమే ఈ పాట..
పాట:-
మన్నించమ్మా ముద్ద మందారమా!/ ముగ్ధసింగారామా!/ మోసగించి నిను మోసుకువచ్చిన ఈ గాలినీ/ చల్లని జాబిలి ముసుగున వచ్చిన ఈ జ్వాలనీ/ కాళరాత్రిలో నిన్ను వదిలి కనుమరుగైపోయిన కలనీ/ మన్నించమ్మా / గంగను తాగిన సంద్రంలో చేదేమీ పోదు అని/ తేనె చినుకుతో తోడు పెడితె ఏ తేడా రాదు అని/ తెలియక చేశామో తెలిసే తెలివిగ చేశామో/ అమతాన్ని నింపుకున్న నీ హదయాన్ని/ ఇంకని ఉప్పని కన్నీటితో నింపిన మా నేరాన్ని మన్నించమ్మా/ మల్లెని నాటితె ఎడారిలో మధుమాసం రాదు అని/ తులసిని నాటితె కీకారణ్యం పెరడైపోదు అని/ తెలియక చేశామో/ తెలిసే తెలివిగ చేశామో/ పారాణి పాదాల మాగాణి రాణీ/ రాతి ఎదల ఈ కోటకు నిను బలిచేసిన మా పాపాన్ని మన్నించమ్మా..
– డా||తిరునగరి శరత్‌ చంద్ర, sharathchandra.poet@yahoo.com