ప్రజాస్వామ్యంపై దాడి

An attack on democracy– న్యూస్‌క్లిక్‌పై సర్కారు దాడిని ఖండిస్తూ ప్రముఖ రచయితలు, కార్యకర్తలు
న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్‌ కార్యాలయాలు, జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రముఖ రచయితలు, కార్యకర్తలు ఒక ప్రకటన చేశారు. అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌ గ్రహీత గీతాంజలి శ్రీ, రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీతలు పి.సాయినాథ్‌, అరుణా రారు, రచయితలు కె.ఆర్‌.మీరా, పెరుమాళ్‌ మురుగన్‌, రామచంద్ర గుహ, వి.గీత, గాయకులు టి.ఎం.కృష్ణలు ఢిల్లీ పోలీసుల చర్యను ఖండిస్తూ ఈ ప్రకటనపై సంతకాలు చేశారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టులను ప్రభుత్వం వేధిస్తోందని, దూషణలకు గురి చేస్తోందని ఆ ప్రకటనలో వారు పేర్కొన్నారు. ధైర్య సాహసాలతో పనిచేసే జర్నలిస్టుల గొంతు నులిమివేసేందుకు ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో ప్రభుత్వం ఈ రీతిన దాడులకు పాల్పడిందని వారు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది చాలా అవసరమైనది. ఆ విమర్శకుల నోళ్ళు మూయించడానికి చేసే ఏ ప్రయత్నమైనా అది భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిపైనే దాడి చేయడమేనని వారు పేర్కొన్నారు. ఈ నెల 3న న్యూస్‌క్లిక్‌లో పనిచేసే దాదాపు 46మంది ఇండ్లపై ఢిల్లీ పోలీసులు దాడి చేశారు. వీరిలో చాలామందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని, వారిలో చాలామంది ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారని ఆ ప్రకటన పేర్కొంది. ఇది వారి గోప్యతా హక్కును ఉల్లంఘించడమే కాకుండా, కోర్టు ఆదేశాలు లేకుండా వారి ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకోవడం అక్రమమని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యుఎపిఎ కింద గతంలో ఇలా అదుపులోకి తీసుకున్నవారి ఫోన్లలో, ల్యాప్‌టాప్‌ల్లో దురుద్దేశపూరితంగా కొన్ని సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టిన వార్తలు విన్నామని, తాజా కేసులో న్యూస్‌ క్లిక్‌ జర్నలిస్టులపై కూడా ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు వున్నాయని ఆందోళన చెందుతున్నామని వారు పేర్కొన్నారు. ఈ రకంగా న్యూస్‌క్లిక్‌ జర్నలిస్టులు, కంట్రిబ్యూటర్లపై జరిగే వేధింపులకు వ్యతిరేకంగా గళం వినిపించాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ తరుణంలో జర్నలిజంలో న్యూస్‌క్లిక్‌ చేసిన అద్భుతమైన కృషిని అభినందిస్తూ, వారి సిబ్బందికి పూర్తి సంఘీభావాన్ని తెలియచేస్తున్నామని వారు పేర్కొన్నారు.
ఇఇఎఫ్‌ఐ ఖండన
పత్రికలు, ప్రజాస్వామ్యంపై జరిగిన ఆటవిక దాడిని ఇఇఎఫ్‌ఐ (ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సమాఖ్య) ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. భావ ప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న ఈ దాడిని ఖండిస్తూ నిరసనలు తెలియచేయాల్సిందిగా ఇంధన రంగంలోని ఇతర సంస్థలకు, ప్రజలకు పిలుపునిచ్చింది.