డార్విన్ సిద్ధాంతం తొలగింపుపై పరిశోధకుల ఆగ్రహం
– నిర్దిష్ట అజెండా ఉండవచ్చు
– చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తున్నారు
– పరిశోధనలపై ఆంక్షలు విధిస్తున్నారు
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పదో తరగతి పాఠ్య పుస్తకాల నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగిస్తూ ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయంపై పలువురు పరిశోధకులు మండిపడ్డారు. ఇప్పటి వరకూ ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగుతున్న పరిశోధనలకు కళ్లెం వేసి, దేశ యువతను ప్రశ్నించే తత్వం నుండి దూరం చేసేందుకే ఈ చర్యకు పాల్పడ్డారని వారు విమర్శించారు. దేశ లౌకిక స్వభావాన్ని బీజేపీ అవమానిస్తోందని బ్రిటన్‌కు చెందిన జీవ శాస్త్రవేత్త రిచర్డ్ డాకిన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీఈఆర్టీ చేసిన సిలబస్ మార్పుల ప్రకారం సైన్స్, జీవశాస్త్రాన్ని ఎంచు కున్న 11వ, 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులను ప్రశ్నించే తత్వం నుండి దూరం చేయడమే దీని ఉద్దేశమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పరిణామ సిద్ధాంతాన్ని నేర్చుకోకుండా విద్యార్ధులను నిరోధించడమంటే వారిని అజ్ఞానులుగా మార్చడమే అవుతుందని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ జన్యు శాస్త్రవేత్త పార్థా ప్రతిమ్ మజుందార్ తెలిపారు. పదో తరగతి సిలబస్ నుండి పరిణామ సిద్ధాంతాన్ని తొలగించాలన్న నిర్ణయంపై పలువురు శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఏప్రిల్‌లోనే గళం విప్పారు. ప్రపంచాన్ని హేతుబద్ధమైన కోణం నుండి పరిశీలించడంలో డార్విన్ సిద్ధాంతం చాలా కీలకమని, జీవ శాస్త్రంలోని అంశాలను మించి తెలుసుకోవడానికి అది దోహదపడుతుందని వారు చెప్పారు. పరిణామ సిద్ధాంతం, ఆవర్తన పట్టిక, సుస్థిర యాజమాన్యం వంటి అంశాలను తొలగించడం వెనుక ఏదైనా నిర్దిష్ట అజెండా ఉన్నదేమోనని కొందరు శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్సీఈఆర్టీ నిర్ణయాలను అవగతం చేసుకోవడం కష్టంగా ఉందని బెంగళూరుకు చెందిన భౌతిక శాస్త్రవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. పుస్తకాల నుండి తొలగించిన మూల్యాంకనం, సుస్థిరత్వం వంటి అంశాలు విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తిస్తాయని, వారిలో ప్రశ్నించే తత్వాన్ని పెంచుతాయని కొల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్‌కి చెందిన జీవ శాస్త్రవేత్త అనిందితా భద్ర తెలిపారు. మూల్యాంకనానికి సంబంధించిన పరిజ్ఞానం విద్యార్థులను ఆలోచింపజేస్తుందని, స్థిరత్వం అనేది ఎంపిక, విలువలపై ప్రశ్నించే సామర్ధ్యాన్ని కల్పిస్తుందని ఆయన వివరించారు. పిల్లలు ఆలోచనలను, ప్రశ్నించే తత్వాన్ని పెంచుకొని మంచి పౌరులుగా ఎదగడం ఇష్టం లేకనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. భారతీయ వైజ్ఞానిక వ్యవస్థను బలోపేతం చేసే పేరుతో ఇటీవలి కాలంలో ప్రభుత్వ విభాగాలు తీసుకున్న చర్యలు చారిత్రక వాస్తవాలను వక్రీకరించాయని కొందరు పరిశోధకులు విమర్శించారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని కొల్‌కతాలోని ఐఐఎస్‌ఈఆర్‌లో భౌతిక శాస్త్ర అధ్యాపకుడు సౌమిత్రో బెనర్జీ అన్నారు.
ప్రభుత్వ శాఖలు సైతం…
ఎన్సీఈఆర్టీ మాత్రమే కాదు…కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా పరిశోధనలపై నీళ్లు చల్లుతున్నాయి. సామాజికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు విదేశీ యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు జాతీయ ఉపకార వేతనాలు పొందినట్లయితే వారు భారతీయ సంస్కృతి, చరిత్ర, సమాజం వంటి అంశాలను ఎంచుకోరాదంటూ గత సంవత్సరం ఫిబ్రవరిలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ హుకుం జారీ చేసింది. విదేశీ యూనివర్సిటీలలో పరిశోధనలు చేసే విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకుంటే కులం, మతం, లింగ సమానత్వం, సంస్కృతి-సంప్రదాయాలు పేరిట ఆంక్షలు విధిస్తున్నారు. ప్రభుత్వం గ్రాంట్లు, ఉపకార వేతనాల రూపంలో పరిశోధనలను ప్రోత్సహించాలని, అంతేకానీ ఏయే అంశాలపై పరిశోధనలు చేయాలో యూనివర్సిటీలను నిర్దేశించరాదని ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు అబా దేవ్ హబీబ్ సూచించారు. పాఠ్యాంశాలను అన్ని స్థాయిలలోనూ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారానికి అనుగుణంగా రూపొందిస్తున్నారని, కొన్ని అంశాలలో పరిశోధనలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన విమర్శించారు.