– హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి
– గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఈ ధోరణి
– రాజకీయ కక్ష వద్దు..అభివృద్ధి కక్ష్యలో వెళ్దాం
– దివాళా..దివాళా అంటే పెట్టుబడులు వస్తాయా?
– ప్రభుత్వ చర్యలతో తెలంగాణ విశ్వసనీయత దెబ్బతింటుంది :’తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు-శ్వేతపత్రం’పై లఘుచర్చలో హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
”రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉంది. గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ధోరణితోనే దీన్ని ప్రవేశపెట్టినట్టు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందనీ, దివాళా..దివాళా అంటే పెట్టుబడులు వస్తాయా? ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్ర విశ్వసనీయత దెబ్బతింటుంది. గడచిన తొమ్మిదిన్నరేండ్ల జమా ఖర్చులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి. దాన్ని ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వానికి రాజకీయ కక్ష వద్దు..అభివృద్ధి కక్ష్యలో ముందుకెళ్దాం” అని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సభ్యులు, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు-శ్వేతపత్రం’ అనే అంశంపై జరిగిన లఘుచర్చలో ఆయన మాట్లాడారు. ”శ్వేతపత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయం- తెలంగాణ వాటా కింద 1956-57 నుంచి 2013-14 వరకు 41.68 శాతం ఖర్చు చేసినట్టు గంపగుత్త లెక్క తీశారు. ఈ లెక్కలన్నీ శుద్ద తప్పు” అని కొట్టిపారేశారు. అవసరమనుకుంటే దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక సీఎం గురువుగారి (చంద్రబాబునాయుడు) దగ్గర పనిచేసి సస్పెండ్ అయిన రిటైర్డ్, ఏపీ అధికారులతో దీన్ని తయారు చేయించారని ఆరోపించారు. సభ అనుమతిస్తే పేర్లు కూడా బయటపెడుతామని చెప్పారు. పదేండ్లలో చాలా రంగాల్లో తెలంగాణ ప్రగతి సాధించిందనీ, దాన్ని రిపోర్టులో ఎక్కడా చూపించలేదని విమర్శించారు. ఎవరైనా అప్పులను డెడ్ టు జీఎస్‌డీపీ రేషియోలో చూస్తారనీ, శ్వేతపత్రంలో మాత్రం డెడ్ టు రెవెన్యూ రిసిప్ట్‌ను చూపించారని ఆరోపించారు. కరోనా సంవత్సరాన్ని తీసుకుని దాని ప్రకారం చూపించే ప్రయత్నం చేశారని తెలిపారు. రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం చెల్లింపు, 14,15 ఫైనాన్స్ కమిషన్ల ద్వారా రావాల్సిన నిధుల విషయంలోనూ తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం జీఎస్‌డీపీ రేషియో ప్రకారం అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో కింది నుంచి తెలంగాణ ఐదో స్థానంలో ఉందని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో రూ. 3,36,916 కోట్ల అప్పును చూపారనీ, కానీ భవిష్యత్ తరాల కోసం సృష్టించిన ఆస్తుల వివరాలు వెల్లడించలేదన్నారు.
ఈ సందర్భంగా తమ ప్రభుత్వ హయాంలో ఆయా శాఖలకు కేటాయించిన బడ్జెట్ లెక్కలు, మూలధన పెట్టుబడి సౌకర్యాలను వెల్లడించారు. ‘మాతో పనిచేసిన అధికారులే ఇప్పుడు మీ దగ్గరా ఉన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌కు లోబడే రుణాలు తీసుకున్నామన్నారు.
అప్పులే కావాలనుకుంటే కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ నిబంధనలు అమలు చేసి రూ.35వేల కోట్లు తెచ్చుకొనేవాళ్లం. కానీ రైతుల బోర్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల్ని ఇదే అసెంబ్లీ సాక్షిగా తిరస్కరించి, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలకే పెద్దపీట వేశాం’ అని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హరీశ్‌రావు వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్రం ఎక్కడా రైతుల నుంచి బిల్లులు వసూలు చేయమని చెప్పలేదనీ, అప్పుడు తాను పార్లమెంటులో ఆ కమిటీ సభ్యుడిగా ఉన్నానని చెప్పారు. ఒకే అబద్ధాన్ని వందసార్లు వల్లెవేస్తే వాస్తవం కాబోదని అన్నారు. దీనిపై మంత్రికీ, హరీశ్‌రావుకు మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది.
అప్పుల పరిణామాన్ని ఎక్కువ చేసి చూపేందుకు కార్పొరేషన్ల అప్పుల్ని కూడా రాష్ట్ర అప్పులుగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకొని ‘ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ కోసం తీసుకున్న రుణాలను ప్రజల నుంచి బిల్లులు వసూలు చేసి కడతారా? లేక ప్రభుత్వం చెల్లిస్తుందా? తప్పుల్ని సమర్థించుకొనేందుకు సాంకేతికంగా మాట్లాడొద్దు. వాస్తవాలు చెప్పండి’ అని అన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సంపాదించిన ఆస్తుల్ని చూపకుండా, కేవలం అప్పులు మాత్రమే చూపిస్తున్నారని చెప్పారు. ఆ సమయంలో మరో మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకొని ‘వరంగల్‌లో పురాతన జైలును కూలగొట్టి అక్కడ ఆస్పత్రి కట్టడం, బాగున్న సచివాలయాన్ని కూలగొట్టి, కొత్త భవనం కొట్టడం ఇవేనా మీరు సంపాదించిన ఆస్తులు. ఉన్న ఆస్తుల్ని ధ్వంసం చేసి, కమిషన్ల కోసం అక్కడే కొత్త నిర్మాణాలు చేపట్టారు’ అని తీవ్రంగా విమర్శించారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో కలిసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భోజనం చేస్తారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే, ఆయనతోపాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఉండాలి. అలా కాకుండా మంత్రి కేటీఆర్ అక్కడ ఉంటారు. వాళ్లేదో అభివృద్ధి గురించి మాట్లాడుకున్నారంటూ, ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేస్తుందని బయటకు వచ్చి మీడియాకు చెప్తారు. ఇదేనా మీరు కూడబెట్టిన ఆస్తులు అని అడిగారు.
హరీశ్, కేటీఆర్ ఆలింగనం
శ్వేతపత్రంపై బీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్‌రావు ప్రసంగం పూర్తికాగానే మాజీ మంత్రి కే తారకరామారావు ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. బాగా మాట్లాడారు అని ప్రశంసించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు పెద్దగా నవ్వారు. ‘మీకేమైంది’ అంటూ కేటీఆర్ కాంగ్రెస్ సభ్యుల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం కనిపించింది.
హరీశ్‌వ్యాఖ్యలపై అభ్యంతరం
రాష్ట్ర అధికారులతో కాకుండా వేరేవాళ్లతో శ్వేతపత్రం తయారు చేయించారన్న మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఖండించారు. నిరాధార, సత్యదూర మాటలు చెప్పి సభను పక్కదోవ పట్టించొద్దని సూచించారు. ఎవరో ప్రిపేర్ చేశారనే మాటల్ని విత్‌డ్రా చేసుకోవాలని కోరారు. అయినా, హరీశ్‌రావు వెనక్కి తగ్గలేదు. మరో సందర్భంలో పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుంటూ..ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఏరోజుకారోజు వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నెట్టుకురావాల్సిన పరిస్థితి ఉందని సభకు వివరించారు. గత ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థులకు 1.25, లక్షలు ఖర్చు చేశామని చూపెట్టడం శుద్ధ అబద్ధం అని అన్నారు.