పరవశమై పరిమళించిన పాట

An ecstatic songవయసు పూత పూసి పరవశిస్తున్న వేళ మనసు కూడా కట్టలు తెంచుకుని పరుగులు తీస్తుంది. ఎంత ఆపినా మనసు, వయసు రెండూ మన మాట వినని తరుణంలో ఓ కొంటె గానమేదో లోలోన మోగుతుంటుంది. ఆ గానమే ఇది. 2019 లో కె.వి.ఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘దొరసాని’ సినిమాలో శ్రేష్ఠ రాసిన ఆ పాటనిపుడు పరిశీలిద్దాం..
శ్రేష్ఠ అలతి అలతి పదాల్లోనే మధురమైన పాటలు రాసిన గీత రచయిత్రి.. మనకు తెలుగులో గీత రచయిత్రుల సంఖ్య చాలా తక్కువ.. తెలంగాణలో అయితే మరీ తక్కువ.. తెలంగాణలో తొలి సినీ గేయ రచయిత్రిగా పేరుపొందిన శ్రేష్ఠ అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. సాహిత్యపు విలువలున్న పాటలను రాసింది. దొరసాని సినిమాలో ఆమె రాసిన ఈ పాటకు మంచి గుర్తింపు వచ్చింది.
ప్రేమకు కులమతాల గోడలుండవు.. అది అన్నిటికి అతీతమైనది. అగ్రకులమని, అధికారముందని తక్కువ కులం వాళ్లని ప్రేమించకూడదని, అసలు వారిని తాకడమే సరికాదని ఎన్నో ఆంక్షలు పెట్టి వారిస్తే ప్రేమ సముద్రం ఆగుతుందా? ఆగదు.. చెలియలికట్టలు తెంచుకుని ఉవ్వెత్తున ఘోషిస్తుంది..
అలా.. లేత వయసులో ప్రేమ చిగురించిన అమ్మాయి పెద్దల మాటలకు భయపడి బంగారు పంజరంలో పక్షిలా బతుకుతూ, తనలోనే తాను కుమిలిపోతుంటుంది. తక్కువ కులస్తునిపై కలిగిన ప్రేమను మొదట ఎవరికి చెప్పుకోలేక లోలోనే దాచుకుంటుంది. ఇదంతా సినిమాకథ. సన్నివేశం..
అలా.. మొదటిసారిగా ప్రేమ చిగురించినపుడు కలిగిన పరవశం పరిమళిస్తే ఎలా ఉంటుందో ఈ పాట తెలుపుతుంది.
ఆ అమ్మాయికి కళ్ళల్లో ఏదో కలవరం కలుగుతుంది. అంతేకాదు ఆమెకు కల వరమై తన ప్రియునిలా ఎదురుగా వచ్చినట్టుగా తోస్తుంది. తను కలలుకన్న స్వేచ్ఛా జీవితాన్ని అతని ద్వారా పొందాలనుకుంటుంది. గుండెల్లో ఏదో పరవశము పరవళ్లు తొక్కుతుంది. వయసు, మనసు రెండూ కలవరంతో, పరవశంతో ఊగిపోతూ ఉన్నాయి. ఈ పరవశం తన వశమై సరికొత్త అనుభూతిని కలిగిస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితి. మాటలు కూడా రానంత ఆనందం ఆ అమ్మాయిలో కలుగుతుంటుంది. ఏదో కోరిక కళ్లు తెరిచి చూస్తుంటుంది. రెక్కలు విప్పి ఎగురుతుంటుంది.
ఆమె ఒంటరిగా ఉంది. అది జైలు లాంటి గదిలో ఉంది. కాని ఆమె ఊహలు మాత్రం స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఎంతో ఇన్నోవేటివ్‌గా రాసింది కదా శ్రేష్ఠ. ఆ ఊహలు కొంటె కథలు చెబుతున్నాయట. ప్రాణం ఆరాటాల ఒడిలో వాలిపోతుందట. ఏదో కావాలని, ప్రియుడే రావాలని తహతహతో తపనలతో ఆమె ఎదురుచూస్తుంది. ఆనందాలనిధి కోసం వెతుకుతుంది. ఆరాటం వెనుక ఉన్న ఆ ఆనందం వయసుకే తెలుసు మరి. ఊరిస్తున్న ఊసులు ఎన్నో ఆమె చుట్టే తిరుగుతూ తిరుగుతూ ఉడికిస్తూ ఉండగా ఆమె తపించకుండా ఎలా ఉంటుంది. అందునా.. తపనలో తనువు ఆగలేకుండా ఉంది. బెదిరిపోయి తుళ్లిపడుతుంది. బెదరడమంటే ఇక్కడ వయసుకు కలిగిన వణుకు అనుకోవచ్చు.
పాలబుగ్గలో మెరిసిన తళుకులన్నీ వెన్నుపూసలో వణుకులుగా మారిపోయాయట. కంటిపాపలో కవితలు పలుకుతున్నాయట. కళ్లతో కవితలు రాసే విద్య ఆ అమ్మాయికి వయసు నేర్పిందని అర్థం చేసుకోవచ్చు. ఇలా హీరోయిన్‌ రకరకాల తలపులతో సతమతమవుతున్న వైనం మనకిక్కడ కనబడుతుంది.
చిన్న మనసులోని పువ్వు బంగారు అందాల నవ్వులా మెరిసిపోతూ మైమరచిపోతుంది. లేతపెదవిపైన మెరిసిన ముత్యం ముద్దేమో అన్నంత భావన కలిగిస్తోంది. ఇదంతా ప్రేమ మహిమే. ఆశలన్నీ తీయని మధువులై హదయంపై చల్లుతుంటే, మైకం ముద్దుగా మారి చెప్పలేని, ఎన్నడూ చూడలేని సరికొత్త మాయల్ని కళ్ళముందు చేస్తుంటే, శరీరంలో అణువణువు అలజడిలో చెలరేగి తన్మయత్వంతో తరలిపోతుంటే, ఆ తన్మయత్వంలో శరీరం సతమతమవుతుంటే ఆ అమ్మాయి ఇక ఈ లోకంలో ఉండదు. మనిషే ఇక్కడ ఉంటుంది. మనసు మాత్రం ఆనందాల లోకాల అంచులు దాటి వెళిపోతుంటుంది. ఇదంతా ఆ అమ్మాయిని మైమరపించిన వలపు మహిమ.
ఆ పరవశాల పరిమళాన్ని పాట రూపంలో మధుర మనోహరంగా చెప్పారు గేయరచయిత్రి శ్రేష్ఠ.
పాట
కళ్లల్లో కలవరమై కల వరమై/ గుండెల్లో పరవశమో వరమై/ కళ్లల్లో కలవరమై కల వరమూ వరమే అవ్వగా/ కళ్లల్లో కలవరమై కల వరమై/ గుండెల్లో పరవశమే వశమై/ కళ్లల్లో కలవరమై కల వరమై కలిగే కోరికా/ ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా ఊహలే/ ఎన్నో కొంటె కథలే చెప్పగా/ఆరాటాల ఒడిలో వాలుతూ ప్రాణమే/ ఆనందాల నిధికై చూడగా/ ఊరించే ఊసులు ఎన్నో/ ఉడికిస్తూ చంపుతుంటే/ ఆ తపనలోన తనువు తుళ్లిపడుతుంటే/ పాలబుగ్గలోని తళుకులే వెన్నుపూసలోని వణుకులై/ కంటిపాపలోన కవితలా మారే/ చిన్నిమనసులోని పువ్విలా/ పసిడివన్నెలోని నవ్వులా/ లేతపెదవిపైన ముత్యమై మెరిసే/ ఏవో.. ఏవో.. ఏవో.. ఆశలే.. మెల్లగా/ ఎదపై తీపి మధువే.. చల్లగా/ ఏదో.. ఏదో.. ఏదో మైకమే ముద్దుగా/ మైమరపించు మాయే చెయ్యగా/ అణువణువూ అలజడి రేగి/ తమకంలో తేల్చుతుంటే/ ఆ ఆదమరుపులోన ఈడు సతమతమై/ పాలబుగ్గలోని తళుకులే వెన్నుపూసలోని వణుకులై/ కంటిపాపలోన కవితలా మారే/ చిన్ని మనసులోని పువ్విలా/ పసిడి వన్నెలోని నవ్వులా../ లేతపెదవిపైన ముత్యమై మెరిసే..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682